మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ అంశాలతో విజువల్ ఫీస్ట్ లాగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం వివిధ లోకాలకు సంబంధించిన ఆసక్తికరమైన జానపద కథతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే షూటింగ్ కి చిన్న విరామం ఇచ్చిన చిరంజీవి తన సతీమణి సురేఖ తో కలసి యుఎస్ టూర్ వెళ్లారు. అమెరికాలో చిరంజీవిని 'బ్రో' చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలుసుకున్నారు. చిరంజీవిని విశ్వప్రసాద్ సన్మానించారు. అయితే ఈ మీటింగ్ వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది.
తమ బ్యానర్ లో సినిమా చేయాలని విశ్వప్రసాద్ మెగాస్టార్ కి ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి లాంటి బిగ్ స్టార్ తో అద్భుతమైన కథతో సినిమా చేస్తే ఆ బిజినెస్ లెక్కలు వేరేలా ఉంటాయని విశ్వప్రసాద్ భావిస్తున్నారు. ఓకె అంటే అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా విశ్వప్రసాద్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కానీ చిరంజీవి సున్నితంగా ఇప్పుడు వద్దని చెప్పారట.
తన బ్యానర్ లో సినిమా చేసేందుకు చిరంజీవి కూడా ఆసక్తి చూపారు. కానీ ముందు కథ సిద్ధం చేసుకోవాలని ఆ తర్వాత రెమ్యునరేషన్ ఇతర విషయాల గురించి ఆలోచించుకోవచ్చు అన్నట్లు గా చిరంజీవి విశ్వప్రసాద్ కి సూచించినట్లు తెలుస్తోంది. విశ్వంభర తర్వాత మెగాస్టార్ తన కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఒక చిత్రం చేయాల్సి ఉంది.
మెగాస్టార్ లైన్ అప్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం కూడా ఉంటుంది కానీ అది ఎప్పుడనేది భవిష్యత్తులో తేలుతుంది. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి భారీ హిట్స్ అయితే లేవు. రీసెంట్ టైమ్ లో విశ్వప్రసాద్ కి దక్కిన హిట్ చిత్రం అంటే ధమాకా అనే చెప్పాలి. బ్రో మూవీ నిరాశపరిచింది. రామబాణం డిజాస్టర్ గా నిలిచింది.
ఇటీవల వచ్చిన రవితేజ ఈగల్ కూడా ఫ్లాప్ అయింది. కానీ ఏ నిర్మాత మాత్రం భారీ చిత్రాలు ఆపడం లేదు. పైగా చిరంజీవికి 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. చిరంజీవి కనుక 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే ప్రభాస్ తర్వాత తెలుగులో 100 కోట్లు తీసుకుని కొద్దిమంది హీరోల్లో ఒకరు అవుతారు.