నందమూరి తారకరత్న అభిమానులకు ఒక జ్ఞాపకంలా మారిపోయారు. తారకరత్న మరణించి నెలలు గడచిపోతోంది. నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే తారకరత్న ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండేవారు. కానీ కలలో కూడా ఊహించని విధంగా లోకేష్ పాదయాత్ర సమయంలో తారక రత్న కుప్పకూలడం.. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స తర్వాత మరణించడం జరిగింది.
అయితే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్తని మరచిపోలేకుంది. నిత్యం తారకరత్న జ్ఞాపకాలతో, పిల్లలతో గడుపుతోంది. తరచుగా అలేఖ్య రెడ్డి తారకరత్న ఫోటోలని, ఆయనకి సంబంధించిన విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
తాజాగా అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఒక పిక్ కి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తారకరత్న కొడుకు తనయ్ రామ్ నిండా ఐదేళ్లు కూడా లేని చిన్నారి. అలాగే కుమార్తెలు నిష్క, రేయ కూడా ఉన్నారు. తండ్రి లేకపోవడంతో వీరి ఆలనా పాలనా భారం మొత్తం అలేఖ్య రెడ్డి పైనే పడింది. అయితే పిల్లల్లోని తన భర్తని చూసుకుంటూ అలేఖ్య గడుపుతోంది.
తారకరత్న భద్రాద్రి రాముడు చిత్రంలోని లుక్ ని తన కొడుకు తనయ్ రామ్ తో పోల్చుతూ అలేఖ్య పోస్ట్ పెట్టారు. ఈ పిక్ లో తనయ్ అచ్చం తన తండ్రి తారకరత్న లాగే ఉన్నాడు. ఈ ఫోటో కి అలేఖ్య లైక్ ఫాదర్ లైక్ సన్ అని కామెంట్ పెట్టింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. నిజంగానే తనయ్ తండ్రిలాగే ఉన్నాడు. తారకరత్న ఉండిఉంటే ముగ్గురు పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉండేవారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తారకరత్న, అలేఖ్య దంపతులకు మొదట కుమార్తె నిష్క జన్మించింది. ఆ తర్వాత కొడుకు తనయ్ రామ్, కుమార్తె రేయ కవలలుగా జన్మించారు. తన తాతగారు NTR లోని మూడు అక్షరాలు కలిసేలా నిష్క, తనయ్, రేయ అని తారకరత్న పిల్లలకు నామకరణం చేశాడు.
ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా కూడా ఈ ముగ్గురు పిల్లలు తమ తండ్రికి నివాళులు అర్పించారు. ఆ దృశ్యాలని అలేఖ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తారకరత్న పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.