గాడి తప్పుతున్న వ్యయాలు నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారుతున్నాయి. అందుకు తగ్గ రెవిన్యూ కనపడటం లేదు. హిట్ శాతం తగ్గిపోయింది. మరో ప్రక్క ఓటీటి విరుచుకుపడుతోంది. పెద్ద సినిమాలకు కూడా సరైన ఓపినింగ్స్ ఉండటం లేదు. చిన్న సినిమాల సంగతి సరేసరి.. ఇవన్నీ నిర్మాతలను కలవరపరుస్తున్న అంశాలు. ఇవి చాలదన్నట్లు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలు. వీటిన్నటిని స్ట్రీమ్ లైన్ లో పెట్టాలంటే కొద్ది రోజులు కొత్త సినిమాలకు బ్రేక్ ఇవ్వాలి. అదే చేస్తోంది తమిళ సినీ పరిశ్రమ.
తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షతన రాష్ట్ర సినిమా థియేటర్ల యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా థియేటర్ల మల్టీఫ్లెక్స్ యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా పంపిణీదారుల సంఘం నిర్వాహకుల సమావేశం చెన్నైలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఆరు తీర్మానాలు చేశారు. అగ్రనటుల సినిమాలు విడుదలైన 8 వారాలు తర్వాతే వాటిని ఓటీటీలో విడుదల చేయాలని, నటీనటులు, టెక్నీషియన్స్ అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత చిత్రాన్ని ముందుగా పూర్తిచేసిన తర్వాతే ఇతర చిత్రాల్లో నటించాలని సూచించారు.
దీంతో పాటు నటుడు ధనుష్ ఇప్పటికే పలువురు నిర్మాతల వద్ద అడ్వాన్స్ తీసుకున్న నేపథ్యంలో ఇకపై ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు రాష్ట్ర సినీ నిర్మాతల సంఘంతో చర్చించాలని తీర్మానించారు. ప్రస్తుతం పలు సినిమాల విడుదలకు థియేటర్లు లభించని పరిస్థితుల్లో రూపొందించిన కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాతే చిత్రీకరణ పనులు ప్రారంభించాలని తీర్మానించారు.
movie theater
దీని దృష్ట్యా ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని చిత్రాల షూటింగ్ పనులను అక్టోబరు 30వ తేదీలోపు పూర్తి చేయాలని తెలిపారు.
Sandalwood movie theater
నటీనటులు, సాంకేతిక కళాకారుల వేతనాలు, ఇతర ఖర్చుల నియంత్రణ దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్న నేపథ్యంలో నవంబరు 1 నుంచి అన్ని సినిమాల షూటింగ్ లకు సంబంధించిన పనులను నిలిపివేయాలని తీర్మానించారు. భవిష్యత్తులో సినీరంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసినట్టు నిర్మాతల మండలి వెల్లడించింది.