Suriya
ఆయన తండ్రి ప్రముఖ హీరో. అయినా చదువు పూర్తి అయ్యాక ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ. 1200 జీతం. మూడు నెలలు మాత్రమే ఉద్యోగం చేయగలిగాడు. నటుడు కావాలని పరిశ్రమకు వచ్చాడు. ఒక్కో సినిమాతో ఎదుగుతూ వంద కోట్ల మార్కెట్ హీరో అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు సూర్య.
Suriya
సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్. తండ్రి శివ కుమార్ 70లలో కోలీవుడ్ స్టార్స్ లో ఒకడు. సూర్య చదువు పూర్తయిన వెంటనే ఒక ఉద్యోగంలో చేరాడట. గార్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తూ నెలకు పన్నెండు వందల రూపాయలు తీసుకునేవాడట. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో శివకుమార్, సూర్య, కార్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వెల్లడించాడు.
ఉద్యోగం నుండి నటుడిగా నేను యూ టర్న్ తీసుకున్నాను. నెర్రుక్కు నేర్ నా మొదటి చిత్రం. ఆ మూవీ సక్సెస్ కావడంతో ప్రేక్షకులకు నేను నచ్చాను. ఆదరిస్తారని నమ్మాను. కృషి, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాను... అని సూర్య అన్నారు. సూర్య డెబ్యూ మూవీ నెర్రుక్కు నేర్ 1997లో విడుదలైంది. ఈ చిత్రానికి మణిరత్నం నిర్మాత కావడం విశేషం.
కెరీర్ బిగినింగ్ నుండి సూర్య ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. డీగ్లామర్ రోల్స్ చేసేందుకు ఎప్పుడూ వెనకాడలేదు. 2001లో విడుదలైన నంద మూవీ సూర్యకు మంచి బ్రేక్ ఇచ్చింది. గౌతమ్ వాసుదేవ్ తెరకెక్కించిన కాక కాక, బాల దర్శకత్వంలో వచ్చిన శివ పుత్రుడు చిత్రాలతో సూర్య స్టార్ అయ్యాడు.
suriya karthi
యువ, గజినీ, ఆరు, సింగం చిత్రాలు సూర్యకు తెలుగులో కూడా ఫేమ్ తెచ్చాయి. టాలీవుడ్ లో సూర్య చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. సూర్య చిత్రాలు జయాపజయాలతో సంబంధం లేకుండా వంద కోట్ల వసూళ్లు రాబడతాయి. సూర్య తమ్ముడు కార్తీ సైతం తెలుగులో హీరోగా నిలదొక్కుకున్నాడు. సూర్య నెక్స్ట్ మూవీ కంగువా పై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.