మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్, స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎలా ఉంది? 

First Published | Dec 26, 2024, 4:48 PM IST

ఆ గేమ్ షోలో ప్రాణాలే పందెం. ఓడితే కనికరం లేకుండా చంపేస్తారు. స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ వరల్డ్ వైడ్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. 
 

కొరియన్ సినిమాలకు, సిరీస్లకు వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంది. వినూత్నంగా వారి కంటెంట్ ఉంటుంది. ఇండియాలోని చాలా మంది దర్శకులు, రచయిత కొరియన్ సినిమాలు, సిరీస్ల స్ఫూర్తితో కథలు రాసుకుంటున్నారు. ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రాచుర్యం పొందాక కొరియన్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. విలక్షణమైన కంటెంట్ చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ విపరీతంగా ఆదరణ దక్కించుకుంది. 
 

స్క్విడ్ గేమ్ సీజన్ వన్ 2021 సెప్టెంబర్ 17న నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. స్క్విడ్ గేమ్ సిరీస్ కి హ్వాన్గ్ హొంగ్ హైయుక్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కొరియన్ యాక్టర్ లీ జంగ్ జే ప్రధాన పాత్ర చేశాడు. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఒక గేమ్ షో ఆధారంగా తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్. పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి డబ్బు ఆశ చూపి ఒక గేమ్ షోలోకి తీసుకెళతారు. ప్రపంచానికి దూరంగా, తామెక్కడ ఉన్నామో తెలియని ఒక భవనంలో ఈ గేమ్ షో నడుస్తుంది. 


దశల వారీగా గేమ్స్ ఉంటాయి. గేమ్ లో ఓడితే మరణమే. గెలిచినవారే మరో లెవెల్ కి వెళతారు. కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఒకరినొకరు చంపుకునే పరిస్థితి కూడా రావొచ్చు. కంటెస్టెంట్స్ చర్యలను సీసీ కెమెరాలలో గమనిస్తూ ఉంటారు. తప్పు చేస్తే ప్రాణాలు తీసే... సిబ్బంది ఎప్పుడూ గన్స్ తో సిద్ధంగా ఉంటుంది. గేమ్ షోలో ఒక్కో టాస్క్ నరాలు తెగే ఉత్కంఠతో సాగుతుంది. యాక్షన్, ఎమోషన్స్, సస్పెన్సు, ట్విస్ట్స్ అంశాలతో స్క్విడ్ గేమ్ సిరీస్ రూపొందించారు. చివరిగా గెలిచిన వ్యక్తి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటాడు. 

ఫస్ట్ సీజన్లో హీరో విన్నర్ అవుతాడు. స్క్విడ్ గేమ్ సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని అత్యంత భయంకరమైన గేమ్ షోకి హీరో మరలా ఎలా వెళ్ళాడు అనేది సీజన్ 2లో చూపించారు. అసలు ఆ షో వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసుకోవడమే హీరో లక్ష్యం అని అర్థం అవుతుంది. 


స్క్విడ్ గేమ్ సీజన్ 2 సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సస్పెన్సుతో పాటు ఎమోషనల్ డ్రామా వర్క్ అవుట్ అయ్యిందని అంటున్నారు. అయితే సీజన్ వన్ రేంజ్ లో లేదు. క్రిస్పీ స్క్రీన్ ప్లే మిస్ అయ్యింది. సీజన్ 1 అంత వేగంగా ప్లే సాగదు అనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఒకసారి తప్పక చూసి ఎంజాయ్ చేయాల్సిన సిరీస్ అని చెప్పొచ్చు. తెలుగు వెర్షన్ కూడా నెట్ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. 
 

Latest Videos

click me!