
చిత్ర పరిశ్రమలో ఏ క్షణంలో అయినా మిరాకిల్స్ జరగొచ్చు. ఇక్కడ ఓపిక, సహనం చాలా అవసరం. మన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపొద్దు. అవే కొన్నిసార్లు పెట్టుబడిగా మారతాయి. అలాంటి సందర్భమే ఒక స్టార్ డైరక్టర్ విషయంలో జరిగింది. ఒక ఇండస్ట్రీ హిట్ కోసం ఆయన దాదాపు 9ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. మొదట సూపర్ స్టార్ కృష్ణతో సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. పవన్ కళ్యాణ్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ హిట్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు, కానీ ఒక్కటి మాత్రం జరగడం లేదు. రవితేజతోనూ బ్లాక్ బస్టర్ తీశాడు, కానీ సంతృప్తి లేదు. మహేష్ బాబు మూడు సార్లు రిజెక్ట్ చేశాడు. అయినా తగ్గలేదు. ఒక సినిమా విషయంలో తొమ్మిదేళ్లు వెయిట్ చేశాడు. చివరికి తండ్రితో సాధ్యం కాలేదు, కొడుకుతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఇండస్ట్రీని షేక్ చేశాడు.
ఇప్పటికే ఆ దర్శకుడు ఎవరు? ఆ మూవీ ఏంటో అర్థమై ఉంటుంది. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆయన కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మల వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ప్లాన్ చేశారు. సినిమా ఓకే అయ్యింది. ప్రారంభం కూడా జరుపుకుంది. దీనికి `తిల్లాన` అనే టైటిల్‌ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమా ఆగిపోయింది. నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకున్న నేపథ్యంలో సినిమాని ఆపేశారు. దీంతో మళ్లీ మొదటికొచ్చింది కథ. ఆ తర్వాత దాదాపు మూడేళ్లు కథలు పట్టుకొని తిరిగాడు పూరీ.
ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు. మొదట ఆయన కూడా రిజెక్ట్ చేశాడు. క్లైమాక్స్ మార్చమని చెప్పాడు. కానీ మార్చకుండానే రెండోసారి కథ చెప్పాడు పూరీ. అదే పవన్‌కి నచ్చింది. సినిమా పెద్ద హిట్ అయ్యింది. అదే `బద్రి`. ఆ తర్వాత రవితేజకి బ్యాక్ టూ బ్యాక్ మూడు హిట్లు అందించారు. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `ఇడియట్`, `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ఏదో లోటు. సరైన సినిమా పడటం లేదు. మహేష్ బాబుని కలిసి మూడు కథలు చెప్పాడు. మూడూ రిజెక్ట్ చేశాడు. తాను దాచుకున్న కథ తీశాడు పూరీ. చాలా మంది హీరోలకు చెప్పాడు, అయినా వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు. రవితేజ చేస్తానని చెప్పి పక్కన పెట్టాడు, సోనూ సూద్‌తో చేయాలనుకున్నా వర్కౌట్ కాలేదు.
ఇక చివరి ప్రయత్నంగా మరోసారి మహేష్ వద్దకే వెళ్లాడు పూరీ. కాకపోతే ఈ సారి సాలిడ్ కథతో వెళ్లాడు. మహేష్ కూడా రెండు మూడు కథలు వద్దు, సాలిడ్‌గా ఉండే ఒక్క కథ చెప్పమని చెప్పాడు. దీంతో తన అసలైన ఆయుధం బయటకు తీశాడు పూరీ. అదే `ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ`. స్క్రిప్ట్ చెప్పగానే ఫిదా అయిపోయాడు మహేష్. కొన్ని మార్పులు చెప్పాడు. ఆ మార్పులు పూరీ చేశాడు. మహేష్ బాబు స్వతహాగా తానే ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు. తన అక్క మంజులని నిర్మాతని చేశాడు. అలా `పోకిరి` ప్రారంభమైంది. మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్ కలవడానికి ముందు ఇంత కథ జరిగింది. కలిశాక ఇండస్ట్రీ షేక్ అయ్యింది.
2006లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో మహేష్ బాబు సరసన ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్ విలన్‌గా చేశారు. మహేష్‌కి తండ్రిగా నాజర్ చేశాడు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 28న విడుదలైంది. ఫస్ట్ షోతోనే మైండ్ బ్లాక్ చేసింది. క్లైమాక్స్ చూసి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఆ క్లైమాక్స్ కోసమే చాలా మంది రిపీటెడ్‌గా చూశారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో అప్పటి వరకు కలెక్షన్ల గురించి పెద్దగా చర్చ లేదు. ఎన్ని రోజులు ఆడిందనే దాన్ని బట్టే సినిమా విజయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ `పోకిరి`తో కలెక్షన్లపై చర్చ ప్రారంభమైంది. ఈ మూవీ ఓవరాల్‌గా రూ.70కోట్ల గ్రాస్, రూ.40కోట్ల షేర్ సాధించింది. టాలీవుడ్‌లో మొదటిసారి యాభై కోట్లు దాటిన సినిమాగా, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ గురించి మహేష్ బాబు ఎప్పుడూ ప్రత్యేకంగా చెబుతారు. పూరీ గురించి ప్రత్యేకంగా చెబుతారు. సూపర్ స్టార్ కృష్ణ సైతం సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమా చూసి మహేష్‌ని ప్రత్యేకంగా అభినందించారట. అలా కృష్ణతో సినిమా చేయలేకపోయిన పూరీ, ఆ తర్వాత మహేష్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు పూరీ.
అయితే కృష్ణతో సినిమా చేసేటప్పుడే సీనియర్ నటి రమాప్రభ ఒక మాట అన్నారట. కృష్ణతో సినిమా ఆగిపోయినప్పుడు పూరీ చాలా బాధపడ్డాడట. దర్శకుడిగా పరిచయం కావాల్సిన సినిమా ప్రారంభమై ఆగిపోవడంతో చాలా కుంగిపోయాడు. ఆ సమయంలో పూరీ బాధని చూసిన నటి రమాప్రభ .. ఎందుకు అలా బాధపడటం, కృష్ణగారి సినిమా ఆగిపోతేనేమి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళబ్బాయితో పెద్ద హిట్ కొడతావేమో ?` అని అన్నారట. సరిగ్గా 9ఏళ్లకు అదే నిజమైంది. దీంతో ఆమె మాటలను పూరీ ఎప్పటికీ మర్చిపోలేరట. ఆమెని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారట.