మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకుంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీంతో నిహారికకు ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నిహారిక కు అభినందనలు తెలిపారు. మహేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
అందరూ కొత్త నటీనటులతో ప్రయోగాత్మకంగా కమిటీ కుర్రోళ్ళు మూవీ ని నిహారిక కొణిదెల నిర్మించారు. విలేజ్ కామెడీ నేపథ్యంలో విభిన్నమైన కథతో దర్శకుడు యదువంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు. నిహారిక సినిమాని బాగా ప్రమోట్ చేసింది. పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి మూవీ పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. కాగా కమిటీ కుర్రోళ్ళు ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పాజిటివ్ టాక్ నేపథ్యంలో స్క్రీన్స్, షోలు పెంచుతామని ఆదివారం చిత్ర యూనిట్ తెలియజేసింది. తాజాగా మహేష్ బాబు ఈ సినిమా పై ట్వీట్ చేశారు. నిహారికకు కంగ్రాట్స్ తెలిపారు. '' కమిటీ కుర్రోళ్ళు గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టి, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ నిహారిక. టోటల్ టీమ్ కు శుభాకాంక్షలు. త్వరలో ఈ చిత్రాన్ని చూస్తా '' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Mahesh Babu
మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ పోస్ట్ వైరల్ చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ ఒక చిన్న సినిమాలను ప్రోత్సహించడం గొప్ప విషయం. మహేష్ బాబు రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. ఇది ఇలా ఉంటె .. నిహారిక కమిటీ కుర్రోళ్ళు విజయం పై నిహారిక స్పందించి. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ .. ''నా సోదరుడు యాక్టర్ అంకిత్ ఓ రోజు ఫోన్ చేసి... నా స్నేహితుడి దగ్గర మంచి కథ ఉంది అని చెప్పాడు.
Niharika Konidela
మొదట్లో నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఏవో కారణాలు చెప్పి మూడు నెలలు వాయిదా వేస్తూ వచ్చా. అంతగా అడుగుతున్నాడు కదా అని కథ వినడానికి ఓకే చెప్పా. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో అది కూడా ఒకటి. కమిటీ కుర్రోళ్ళు కథ విన్నాను. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా సినిమా చూసి కొంత మంది సెకండ్ హాఫ్ బాగాలేదు. అది లేదు .. ఇది లేదు అని రివ్యూలు రాస్తున్నారు.
Niharika Konidela
మేము వంద మందికి నచ్చేలా సినిమా చేయలేము. 99 శాతం మందికి మా సినిమా నచ్చింది. ఇప్పుడు ఇది పీపుల్స్ మూవీ అయింది. మా సినిమా కొనేందుకు మొదట్లో ఏ ఓటీటీ సంస్థ ముందుకు రాలేదు. ఇప్పుడు సినిమా టాక్ చూసి కమిటీ కుర్రోళ్ళు సినిమాకి ఓటీటీ డిమాండ్ కూడా పెరిగింది. వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి'' అని అన్నారు.