హీరోలకు డ్యూయెల్ రోల్స్ సృష్టించి వాటిపై కథలు రాయడం టాలీవుడ్ లో చాలా కాలంగా వస్తోంది. హీరోలు డ్యూయెల్ రోల్ లో నటించిన చిత్రాలు కోకొల్లలు ఉంటాయి. కానీ హీరోలు త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. హీరోలకు మూడు పాత్రలు సృష్టించి కథలు రాయడం దర్శకులకు, రచయితలకు పెద్ద సవాల్. కాబట్టి అలాంటి ప్రయోగాలు అరుదుగా జరుగుతుంటాయి.
కానీ టాలీవుడ్ లో రికార్డులు అంటే ముందుగా వినిపించే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన అందుకోని రికార్డ్ అంటూ లేదు. తన 30 ఏళ్ళ సినీ కెరీర్ లో సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా దాదాపు 300 వందల చిత్రాల్లో నటించారు. కృష్ణ దాదాపు 25 చిత్రాల్లో డ్యూయెల్ రోల్స్ లో నటించారు. అత్యధికంగా ఏడు చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేశారు.
కుమార రాజా, పగబట్టిన సింహం, డాక్టర్ సినీ యాక్టర్, సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, రక్త సంబంధం, బొబ్బిలి దొర చిత్రాల్లో కృష్ణ ట్రిపుల్ రోల్స్ లో నటించారు. ఇది ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తరం నటులు ట్రిపుల్ రోల్స్ చిత్రాల్లో నటించడమే గగనం అయిపోతోంది.
కృష్ణ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు. ఇప్పటి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో ట్రిపుల్ రోల్ చేయడం విశేషం.
భవిష్యత్తులో టాలీవుడ్ లో ట్రిపుల్ రోల్స్ లో నటించే సాహసం ఎవరు చేస్తారో చూడాలి. చిరంజీవి ఖైదీ నంబర్ 150, అందరివాడు, బిల్లా రంగా, జ్వాల లాంటి చిత్రాల్లో డ్యూయెల్ రోల్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఆంధ్రావాలా, అదుర్స్ చిత్రాల్లో డ్యూయెల్ రోల్స్ చేయడం విశేషం.