
టాలీవుడ్ లో మొట్ట మొదటి సాహసాల వీరుడిగా గుర్తింపు పొందింది సూపర్ స్టార్ కృష్ణ. వెండితెరపై కృష్ణ చేయని సాహసం, ప్రయోగం లేదు. అందుకే కృష్ణ టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియన్ సినిమాలో లెజెండ్ గా నిలిచిపోయారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి దిగ్గజాల మధ్య కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చాయి. వారు ఎంత విభేదించుకున్నా చివరికి కలసిపోయేవారు. ఉదాహరణకు కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రం చేయడంతో ఎన్టీఆర్ చిన్నబుచ్చుకున్నారట. ఆ తర్వాత ఆయనే పిలిచి అభిందించారట. ఆ సమయంలో కొన్నేళ్ల పాటు ఎన్టీఆర్ గారు తనతో మాట్లాడలేదని కృష్ణ ఓ సందర్భంలో అన్నారు.
అదే విధంగా సూపర్ స్టార్ కృష్ణకి మరో లెజెండ్ తో కూడా విభేదాలు ఏర్పడ్డాయట. ఆయన ఎవరో కాదు.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బాలు స్వయంగా తెలిపారు. కొందరు మధ్యలో వ్యక్తుల వల్లే తమ మధ్య కొంతకాలం స్నేహం చెడింది అని బాలు అన్నారు.
జరిగిన విషయాన్ని బాలు వివరించే ప్రయత్నం చేశారు. ఒక నిర్మాణ సంస్థ నుంచి నాకు రావలసిన డబ్బులు ఆగిపోయాయి. అడుగుతుంటే వాయిదా వేస్తున్నారు.ఆ రోజుల్లో 500, 600 కూడా పెద్ద అమౌంట్. అదే టైంలో నాకు డబ్బు అవసరం అయింది. నిర్మాతని అడిగితే.. ఏంటి మేము పారిపోతామా.. డబ్బులు ఇవ్వకపోతే మా సినిమాలో పాడరా అని గట్టిగా అడిగాడు.
దీనితో నేను అంత దూరం అవసరం లేదండీ.. మీరు నాకు డబ్బు ఇవ్వాలి అందుకే అడుగుతున్నా అని బదులిచ్చా. ప్రొడక్షన్ మ్యానేజర్ ని అడుగుతుంటే పోస్ట్ పోన్ చేస్తున్నారు. అందుకే అడుగుతున్నా అని చెప్పా. అయితే ఏంటి ఇప్పుడు మా సినిమాకి పని చేయరా అని అడిగారు. అంత దూరం వివాదం అవసరం లేదు.. నేను ఫోన్ పెట్టేస్తున్నా అని పెట్టేశా.
వెంటనే నాకు కృష్ణ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి ఇలా అన్నారంట అని అడిగారు ? ఏమన్నాను అని అడిగాను ?.. మీరు పాడకపోతే నా సినిమాలే రిలీజ్ కావు అన్నారట అని కోపంగా అడిగారు. తలలో గుజ్జు ఉన్న వాడెవడూ ఆ విధంగా అనడు.. నేను అలా అనే వ్యక్తిని కాదని మీకూ తెలుసు.. మీకు ఎవరో నూరిపోసినట్లు ఉన్నారు అని చెప్పా. అదంతా కాదు మీరు పాడకపోతే నాకు సినిమాలు లేవనుకుంటున్నారా మీరు అని అడిగారు.
అలా కాదండి.. నేను పాడకపోయినా మీ సినిమాలు మీకు ఉంటాయి. అలాగే మీ సినిమాల్లో పాడకపోయినా నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు ఇస్తారు అని చెప్పా. అదంతా కాదు మీ డబ్బులు నేను వెంటనే పంపిస్తున్నా. మీ మిత్రుడికి ఇచ్చిన డబ్బు అప్పు అలాగే ఉంది. అదిమీరు కట్టండి అని అన్నారు. ఆ మాటతో నాకు చాలా బాధగా అనిపించింది. నాకు ఇవ్వవలసిన డబ్బు 800 రూపాయలు. నా మిత్రుడి డబ్బు ఇవ్వాల్సింది 20 వేలు.
కృష్ణ గారు ఆ మాట అనడంతో వెంటనే ఫోన్ పెట్టేసి ఆయన డబ్బు ఆయనకి పంపేశా. ఆయన కూడా 800 పంపారు. అప్పటి నుంచి 3 ఏళ్ళ పాటు మేమిద్దరం కలసి పనిచేయలేదు. ఆ సంఘటన వల్ల ఫ్రెండ్ షిప్ దెబ్బతినింది. కానీ ఎక్కడైనా కలసినప్పుడు బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఈ సంఘటన గురించి మేమిద్దరం ఎప్పుడూ చర్చించుకోలేదు. ఇప్పటికి చెబుతాను కృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. కష్టాల్లో ఉన్న నిర్మాతలని ఎన్నో సార్లు ఆయన ఆదుకున్నారు. మధ్యలో మనషుల వల్లే మా మధ్య ఆ సంఘటన జరిగింది అని బాలు అన్నారు.
మూడేళ్ళ తర్వాత మళ్ళీ మా మధ్య స్నేహం చిగురించింది. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు కృష్ణ గారి సినిమాకి మీరు పాడాలి అని అడిగేవారు. ఈ ఇబ్బంది ఉంది అని చెప్పేవాడిని. ఒకసారి వేటూరి సుందర రామమూర్తి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేశారు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి.. కృష్ణ గారిని తీసుకువస్తాను అని అన్నారు. అంత గొప్ప వ్యక్తి నాకోసం రావడం ఏంటి నేనే వెళతాను అని పద్మాలయ స్టూడియోకి వెళ్ళా.
వెళ్ళగానే బాలు చాలా రోజుల తర్వాత వచ్చారు అని ఆయన చాలా సంతోషించారు. మన కాంబినేషన్ లో పాటలు రావడం లేదని మ్యూజిక్ డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. మీరు నాకు సమయం ఇస్తే ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తా అని చెప్పా. ఆయన వెంటనే ఎందుకండీ అవసరం లేదు.. చేయి ఇలా ఇవ్వండి.. రేపటి నుంచి మనిద్దరం కలసి పనిచేస్తున్నాం అని అన్నారు. అంతటితో ఆ వివాదం ముగిసిపోయింది అని బాలు తెలిపారు.