హెడ్స్ అండ్ టేల్స్ మూవీ రివ్యూ ... భగవంతుడిగా సునీల్ చెప్పిన ముగ్గురు ఆడవాళ్ళ కథ ఎలా ఉంది

First Published Oct 22, 2021, 3:03 PM IST

సునీల్ వాయిస్ ఓవర్,భిన్న గెటప్ తో కూడిన హెడ్స్ అండ్ టేల్ ట్రైలర్ ఆకట్టుకోగా, సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కలర్ ఫోటో చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ కథ అందించిన  హెడ్స్ అండ్ టేల్స్ నేడు జీ5లో విడుదల కావడం జరిగింది.

మరి ముగ్గురు యువతుల జీవితంలో జరిగిన నాటకీయపరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన Head and tales చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.. 

కథ:

పెద్ద హీరోయిన్ కావాలనే ఆశలతో చిత్ర పరిశ్రమకు వచ్చిన అనీషాకు వేశ్య పాత్రలో నటించే అవకాశం దక్కుతుంది. దాని కోసం ఆమె హైదరాబాద్ కి వస్తుంది. అనీషాకు కాబోయే భర్త ఆమె వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకోడు, అదే సమయంలో ఆమెకు ప్రాణభయం పెడతాడు. దీనితో ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది. అనీషాకు రక్షణగా కానిస్టేబుల్  అలివేలు మంగ వస్తుంది. అలివేలు మంగకు భర్త నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బారులో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి తెచ్చుకోవడానికి బంగారం ఇవ్వమని అలివేలు మంగను వేధిస్తూ ఉంటాడు. మరో యువతి శృతి తాన్ బాయ్ ఫ్రెండ్ నుండి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ముగ్గురు యువతుల జీవితాల్లో ఉన్న మగాళ్ల వలన వారికి సమస్యలు ఏర్పడగా, ఆ సమస్యల నుండి ఎలా బయటపడ్డారు అనేది.. మిగతా కథా.. 

నేటి సమాజంలో ఆడవాళ్లకు ఎదురవుతున్న సమస్యలను కథా వస్తువుగా తీసుకొని హెడ్స్ అండ్ టేల్ తెరకెక్కింది. కట్టుకున్నవాడి వలనో , కోరుకున్నవాడి వలనో అమ్మాయిలు అనేక సమస్యలకు లోనవుతున్నారు. అలాంటి ముగ్గురు అమ్మాయిలు జీవితాలు, వాళ్లకు ఎదురైన మూడు సమస్యలను ఈ మూవీలో చర్చించారు. 

కోరుకున్న జీవితం, కలలు నిజం చేసుకోవడానికి కాబోయేవాడి రూపంలో సమస్య ఏర్పడితే ఆ యువతి స్పందన ఎలా ఉంటుందనేది అనీషా పాత్ర ద్వారా తెలియజేశారు. వేశ్య పాత్రలో నటించకూడదని, లేదంటే చంపేస్తా అని బెదిరించే వ్యక్తి వలన ఓ అమ్మాయికి ఎదురైన ఇబ్బందులను చక్కగా చూపించారు. అనీషా పాత్రలో శ్రీదివ్య మంచి నటన కనబరిచారు. 

ఇక కానిస్టేబుల్ అలివేలు మంగ పాత్ర హెడ్స్ అండ్ టేల్స్ మూవీలో ప్రత్యేకం. తెలంగాణా స్లాంగ్, డిఫరెంట్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తో దివ్య శ్రీపాద మెప్పించారు. అమాయకత్వం ఆవేదనతో కూడిన ఆమె పాత్ర మెప్పిస్తుంది. అలాగే మరో ప్రధాన పాత్ర చేసిన చాందిని రావు తన పాత్ర పరిధిలో మంచి నటన కనబరిచారు. ఈ ఆడవాళ్ల జీవితాలతో ముడిపడిన అబ్బాయిల పాత్రలకు తగినంత పరిధి లేదు. 

 ట్రైలర్ చూసి సునీల్ పాత్ర ఈ సినిమాలో చాలా ప్రత్యేకం, పూర్తి నిడివితో ఉంటుందని ప్రేక్షకులు భావించారు. ఆయన గెటప్, వాయిస్ ఓవర్ ట్రైలర్ ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఆయన కేవలం పాత్రలను, సినిమా థీమ్ ని పరిచయం చేసే భగవంతుడిగా కొద్దినిమిషాలు కనిపించి మాయమయ్యారు. అలాగే సుహాస్ పాత్ర కూడా క్యామియో కి కొంచెం ఎక్కువ అన్నట్లు సాగింది. ఉన్నంత సేపు నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు.

సమాజంలో తరచుగా ఆడవాళ్లకు ఎదురయ్యే సమస్యలను ముగ్గురు అమ్మాయిల జీవితాలతో ముడిపెడుతూ ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆయన పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. కథనం మెల్లగా సాగడంతో పాటు పాత్రల పరిచయం చేయడానికే ఆయన చాలా సమయం తీసుకున్నారు. కథలో కొత్తదనం లేకున్నా, కథనం కొత్తగా రాసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అనుకున్నంత స్థాయిలో లేవు. మణిశర్మ సంగీతం పర్వాలేదు అన్నట్లుగా ఉంది. బీజీఎమ్ మాత్రం మెప్పిస్తుంది.

చర్చించిన సమస్యలు చాలా పెద్దవి, ఈ అమ్మాయిలకు ఏమవుతుంది... వీళ్ళు ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు అనే భయం, ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులు ఫీల్ కాదు. అంటే ప్రేక్షకుడిని పూర్తిగా కథలో, పాత్రలతో ప్రయాణించేలా దర్శకుడు చేయలేకపోయారు. డ్రామాతో కూడిన సినిమాలకు ఇది చాలా అవసరం. 

మొత్తంగా హెడ్స్ అండ్ టేల్స్ ప్రేక్షకుడి అంచనాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నటుడు సునీల్ చిత్రానికి మంచి ప్రారంభం ఇచ్చినా.. అది చివరి వరకు కొనసాగలేదు. ప్రధాన పాత్రలు చేసిన నటులు, మణిశర్మ బీజీఎమ్, సునీల్ క్యామియో క్యారెక్టర్ ఆకట్టుకునే అంశాలు. 

Rating 2.5
ప్రధాన తారాగణం: దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, చాందిని రావు, అరుణ్ పులవర్తి, తరుణ్ పొనుగోటి, కివీష్ కౌటిల్య తదితరులతో పాటు భగవంతుడి పాత్రలో సునీల్, కీలక పాత్రలో సుహాస్.
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్ 
కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి
సంగీతం: మణిశర్మ
సమర్పణ: ఎస్.కె.ఎన్
నిర్మాతలు: ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి
కథ: సందీప్ రాజ్
దర్శకత్వం: సాయికృష్ణ ఎన్రెడ్డి
విడుదల: 22-10-2022 (జీ 5 ఓటీటీలో)

Also read `నాట్యం` సినిమా రివ్యూ..

click me!