తాను ఎదుర్కొన్న కష్టకాలం తర్వాత మరుసటి రోజు ఉదయమే మోహన్ బాబు తన ఇంటి వద్దకు వచ్చారని సుమన్ తెలిపారు. బయట ఎవరినీ కలవడానికి ఇష్టం లేదని తల్లి చెప్పినప్పటికీ, మోహన్ బాబు వచ్చినట్లు తెలియగానే లోపలికి పిలిచారని చెప్పారు. మోహన్ బాబు తనకు పూలదండ వేసి, "శిరిడీ సాయిబాబా ఆశీర్వాదాలతో నువ్వు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తావు. ఏం భయపడొద్దు, నీ సీటు నీకే వస్తుంది" అంటూ భరోసా ఇచ్చారని సుమన్ వివరించారు. ఆ మాటలు తనకెంతో ధైర్యాన్ని ఇచ్చాయని, ఆ సంఘటనను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు .ఇండస్ట్రీలో ఫోన్ చేసి పలకరించిన వారు చాలామంది ఉన్నా, బహిరంగంగా ముందుకు వచ్చి కలిసిన వారిలో పురుషుల తరఫున మోహన్ బాబు, మహిళల తరఫున సుమలత ఉన్నారని గుర్తుచేశారు.
పెళ్లి మండపంలో చందనం దండల జ్ఞాపకం
తన వివాహ సమయంలోనూ మోహన్ బాబు చూపిన ఆప్యాయతను సుమన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉదయం 5:15 గంటలకే పెళ్లి మండపానికి వచ్చిన మోహన్ బాబు, రెండు చందనం దండలు ఇచ్చారట. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నానని చెబుతూ, ఆ దండలు చివరి వరకు మెడలోనే ఉండాలని, ఫోటో తీసి పంపాలని ఆప్యాయంగా చెప్పి వెళ్లారని సుమన్ తెలిపారు.