#Rajamouli:రాజమౌళికి అవార్డ్ ఇచ్చిన సంస్ద స్పషాలిటీ వింటే మైండ్ బ్లాక్

First Published Dec 3, 2022, 1:57 PM IST

బెస్ట్ డైరెక్టర్-2022 అవార్డుకు రాజమౌళి ఎంపికైనట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు....తెలుగువాడు ఉన్న ప్రతీ చోటా హాట్ టాపిక్ గా మారిన అంశం...‘ఆర్ఆర్ఆర్’ సినిమా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి  ..బెస్ట్ డైరెక్టర్-2022 అవార్డుకు రాజమౌళి ఎంపిక అవటమే. ఇండియన్ సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ సినీ వేదికపై ఎగరేస్తున్న ఆయన ఈ అవార్డ్ కు ఎంపిక అవటంలో వింతేమీ లేదు. అయితే ఈ అవార్డ్ ఇచ్చింది కూడా ఆషా మాషీ వాళ్ళుకాకపోవటంతో అందరూ మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏమిటా స్పెషాలిటీ..


 గత కొంతకాలంగా  దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సంచలనాలు నమోదు చేస్తూ వస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆ తర్వాత ఒటీటీలో రిలీజ్ అయ్యి వెస్ట్ కంట్రీస్ లో సునామీ సృష్టించటం మరో విశేషం. ఒక ఇండియన్ సినిమాని ప్రపంచ సినీ ప్రేక్షుకులు ఇంతలా ఆదరిస్తారా ? ఒక భారతీయ దర్శకుడు ని హాలీవుడ్ కూడా గుర్తిస్తుందా అని ఆశ్చర్యపోతున్న వేళ ఇది.


న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) ‘బెస్ట్ డైరెక్టర్’ గా ‘రాజమౌళి’ పేరుని అనౌన్స్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. 42 మంది సినిమా విశ్లేషకులు ఉన్న జ్యూరీ రాజమౌళిని ఉత్తమ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది. అయితే ఈ సంస్ధ ఎంపిక చేస్తే ప్రత్యేకంగా ఒరిగేది ఉంటుందా అని సగటు పాఠకుడుగా మీకు సందేహం రావచ్చు. కానీ చాలా ఉంది అనేది మా సమాధానం.


1935 నుంచి చూస్తే తాము ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసిన సినిమాల్లో 43శాతం వాటికి ఆస్కార్ అవార్డులు వచ్చినట్లు న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిలే చెబుతోంది.  ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ‘లాస్ ఏంజిల్స్’, ‘న్యూయార్క్’, ‘నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’ లాంటి అసోసియేషన్ నుంచి అవార్డ్స్ వస్తేనే ఫలితం ఉంటుంది. 
 


వీటిలో ఏ అసోసియేషన్ నుంచి అవార్డ్ రాబట్టినా, ఆ సినిమాకి ఆస్కార్ రేస్ లో లాంగ్ రన్ ఉంటుంది.  ఎక్కువ రెకమెండేషన్స్ వస్తాయి, ప్రమోషనల్ బూస్ట్ లభించి, రీచ్ పెరుగుతుంది. ఈ విధంగా ఆస్కార్ రేస్ లో ఉన్న సినిమాకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఒక అవార్డ్ ని రాజమౌళి గెలుచుకోవడం చాలా గొప్ప విషయంగా ప్రపంచం పొగుడుతోంది.


ఈ సంస్ద పూర్వా పరాల్లోకి వెళితే...న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్(ఎన్‌వైఎఫ్‌సీసీ) అనేది అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఒక సంస్థ. దీన్ని 1935లో ప్రారంభించారు. న్యూయార్క్‌ నుంచి పబ్లిష్ అయ్యే.. డెయిలీ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ వంటి వాటికి చెందిన సినిమా విశ్లేషకులు ఈ సంస్థలో భాగంగా ఉంటారు.
 


 అమెరికాలో తీసిన సినిమాలతో పాటు ఇతర దేశాలకు చెందిన సినిమాలను సైతం గౌరవించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ చెబుతోంది. ఉత్తమసినిమా, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సినిమాటోగ్రఫీ, యానిమేషన్ వంటి విభాగాల్లో ఈ సంస్థ అవార్డులు ఇస్తుంది. సినిమా పురోగతికి సాయపడే చరిత్రకారులు, సేవా సంస్థలు, రచయితలు, విమర్శకులు వంటి వారికి ప్రత్యేక అవార్డులు ఇస్తారు.


న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్-2022 అవార్డుల విజేతలు:

         ఉత్తమ చిత్రం: ఠార్

         ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్.రాజమౌళి(ఆర్ఆర్ఆర్)

         ఉత్తమ నటుడు: కాలిన్ ఫారెల్(ఆఫ్టర్ యాంగ్)

         ఉత్తమ నటి: కేట్ బ్లాంచెట్(ఠార్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లోనూ అవార్డుల విజేతలను ప్రకటించారు.
 


ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో ఈ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. ఆ తరువాత ఏడాది జనవరిలో అవార్డులను ప్రదానం చేస్తారు. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల జాబితాను చూసి ఆస్కార్ అవార్డులను అంచనా వేసే అవకాశం ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది. ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఆస్కార్ నామినీల జాబితాను ప్రకటిస్తారు.  ఆడియన్స్ సపోర్ట్ తో పాటు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాని సపోర్ట్ చేస్తూ ఉండడం జక్కన్నకి కలిసొచ్చే విషయం. 

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేశాడు. ఇప్పటికీ దేశవిదేశాల్లో ఆర్ఆర్ఆర్‌ను తన స్టైల్లో ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. జపాన్‌లోనూ మన రాజమౌళి సత్తా చాటడం మనం గర్వపడే విషయం. ఈ క్రమంలోనే  ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డ్ మీద కన్నేసింది ఆస్కార్ అవార్డు, ఇంటర్నేషనల్ ప్రమోషన్ కోసం యాభై కోట్లు ఖర్చు పెట్టేశాడంటూ రాజమౌళి మీద రకరకాల వార్తలు వచ్చాయి.  వస్తున్నాయి. కాకపోతే అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే అసలు ఏమీ జరగదని రాజమౌళికు స్పష్టంగా తెలుసు.

click me!