నందమూరి తారక రామారావు ఎవరినైనా నమ్మితే ప్రేమ కురిపిస్తారు. తప్పు చేస్తే అంతకంటే ఎక్కువగా ఉగ్ర రూపం చూపిస్తారు. ఇండస్ట్రీలో చాలా మందికి అప్పట్లో ఆయన కోపం అనుభవం అయింది. నందమూరి బాలకృష్ణకి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి తిరుగులేని విజయాల్ని అందించిన దర్శకుడు బి గోపాల్.
బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తన తొలి చిత్రం ప్రతిధ్వని చిత్రానికి ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నట్లు బి గోపాల్ తెలిపారు. ఆ తర్వాత బాలయ్యతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలు చేసిన తర్వాత మరోసారి ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. వాస్తవానికి బాలయ్యని కలవడానికి నేను, నిర్మాత త్రివిక్రమరావు చెన్నైలో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. బయట ఎన్టీఆర్ గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు.
వెంటనే వెళ్లి ఆయనకి నమస్కారం పెట్టాం. బ్రదర్ రండి కూర్చోండి.. మీ గురించి మాకు తెలుసు. బాలయ్యకి అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు అంటూ ప్రశంసలు కురిపించారు. అది నా జీవితంలో మరిచిపోలేను అని బి గోపాల్ అన్నారు. ఆయన సిన్సియారిటీ గురించి ఇండస్ట్రీలో అందరూ చెప్పేవారు. కొంత వరకు నేను దగ్గరుండి చూశాను. ఆయనకి ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది.
పరుచూరి బ్రదర్స్ కి ఎన్టీఆర్ అంటే మహా అభిమానం. అదే విషంగా ఎన్టీఆర్ కి కూడా వాళ్లిద్దరూ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఆయన్ని కలవాలి అంటే తెల్లవారు జామున 4 గంటలకి 5 గంటలకు సమయం ఇస్తారు. మిగిలిన టైంలో ఆయన బిజీగా ఉంటారు. ఒకసారి పరుచూరి బ్రదర్స్ కి 4.30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. పరుచూరి బ్రదర్స్ వెళ్లేసరికి 5 నిమిషాలు ఆలస్యం జరిగింది. దీనితో ఎన్టీఆర్ అన్నమాటలు పరుచూరి బ్రదర్స్ వణికిపోయారు.
క్షమించండి అన్నగారు కాస్త ఆలస్యం అయింది అని అడిగారట. బ్రదర్ మీరు నా డబ్బు లక్ష రూపాయలు తీసుకెళ్ళిపోండి.. నేను పట్టించుకోను. కానీ నా టైం ఒక్క నిమిషం వృధా చేసినా నేను సహించను అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. దీనితో పరుచూరి బ్రదర్స్ వణికిపోయారు. ఎన్టీఆర్ సమయపాలన ఆ విధంగా ఉంటుంది అని బి గోపాల్ తెలిపారు.