సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి ఐసీయూలో చేరారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెను వారం రోజుల క్రితమే చెన్నైలో కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బుధవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. 95 ఏళ్ల షావుకారు జానకి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే నిన్న రాత్రి నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జానకి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తున్నారు.
24
షావుకారు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జానకి
షావుకారు జానకి 1931 డిసెంబర్ 12న జన్మించారు. 1950లో విడుదలైన ‘షావుకారు’ సినిమాతో ఆమె కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్.టి.రామారావు హీరోగా నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో జానకికి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా విజయంతో ఆమె ఇంటిపేరు `షావుకారు`గా మారిపోయింది. అంతా అలానే పిలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె షావుకారు జానకిగా అలరిస్తున్నారు. గత కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వయసుపైబడటంతో ఇంటికే పరిమితమయ్యారు.
34
400లకుపైగా చిత్రాల్లో నటిగా అలరించిన జానకి
నాటకాల నుంచి కెరీర్‌ని ప్రారంభించారు జానకి. ఆమె సినిమాల్లోకి రాకముందే 300లకుపైగా నాటకాలు ప్రదర్శించారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె నటనలోని సహజత్వం, మాధుర్యం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె నటించిన పలు చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సినీ రంగానికి షావుకారు జానకి అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2022లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆమె తన నటనా ప్రతిభతో పలు తరాల ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
ప్రస్తుతం షావుకారు జానకి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జానకి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, స్నేహితులు, సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.