దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో, శివకార్తికేయన్ నటించిన చిత్రం `అమరన్`. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా గురువారం విడుదలైంది. తమిళనాడుకి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా, ఆయన దేశభక్తిని చాటేలా ఈ చిత్రం రూపొందింది. శివకార్తికేయన్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించాడు. ఆయన నటనకు విశేష ప్రశంసలు దక్కుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ దీపావళి రేసులో వచ్చిన 'అమరన్' చిత్రానికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధిస్తోంది.
ఈ చిత్రం మొదటి రోజు వసూళ్ల గురించి వెలువడిన సమాచారం ప్రకారం, 'అమరన్' తమిళనాడులో రూ.16 కోట్ల వరకు వసూలు చేసిందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 42.3కోట్లు వసూలు చేసిందని టీమ్ అధికారికంగా ప్రకటించింది.
'అమరన్' చిత్రం తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మొదటి రోజు దాదాపు 10 కోట్లు వసూలు చేసింది. చిత్రానికి మంచి టాక్ రావడంతో, కొద్ది రోజుల్లోనే రూ. 100 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా. వరుసగా సెలవులు కావడంతో వసూళ్లు పెరుగుతాయని అంటున్నారు.అంతేకాదు మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పెరుగుతున్నాయని తెలుస్తుంది.
అమరన్ బడ్జెట్ & ప్రీ బిజినెస్
రూ.130 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'అమరన్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే దాదాపు 65 కోట్ల రాబట్టుకుంది. తమిళనాడులో 40 కోట్లు, తెలుగులో 7 కోట్లు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో 18 కోట్లు ప్రీ బిజినెస్ ద్వారా 'అమరన్' రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 6000 కి పైగా థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. ఇక తెలుగులో ఈ మూవీకి రెండున్నర కోట్ల గ్రాస్ రావడం విశేషం.