ఎపిసోడ్ ప్రారంభంలో అత్తింట్లో ఏం జరిగిందో మనకి చెప్తే బాధపడతాం అని మనకి చెప్పకుండా ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో.. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఒకసారి ఫోన్ చెయ్యు అంటాడు కృష్ణమూర్తి. కావ్య ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తుంది కనకం. అందరూ వాళ్ళ ఇంటికి రాలేదని చెప్తారు. మరోవైపు దుగ్గిరాల కుటుంబ సభ్యులందరూ కావ్యని వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కావ్య కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వస్తారు.
చిట్టి అందరినీ కావ్య దొరికిందా అని అడుగుతుంది. ఎవరు దొరకలేదు అని చెప్పడంతో బాధపడుతుంది. ఇందులో నీ హస్తం ఏమైనా ఉందా అని కొడుకుని సీక్రెట్ గా అడుగుతుంది రుద్రాణి. నాకేమీ తెలియదు అంటాడు రాహుల్. ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని మాట్లాడుకుంటూ ఉంటుండగానే అక్కడికి కనకం దంపతులు వస్తారు. కావ్య కనిపించడం లేదంట, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది కనకం.
తెలీదు, ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అంటుంది అపర్ణ. అక్కడే పడుకొని ఉన్న స్వప్న దగ్గరికి వెళ్లి చెల్లెలు కనిపించకుండా పోతే ఎంత ప్రశాంతంగా పడుకుంటున్నావు, అసలు నువ్వు మనిషి పుట్టుకే పుట్టావా.. నువ్వు కనిపించకపోతే తను ఎంత కంగారు పడింది. కనీసం చెల్లెలు కనిపించడం లేదని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాలని జ్ఞానం కూడా లేదు అంటూ గడ్డి పెడుతుంది.
ఈ ఇంట్లో ఎవరికీ బాధ్యత లేదు, కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. ఏదో జరిగే ఉంటుంది లేకపోతే తను వెళ్ళిపోదు. మీరు వెళ్ళగొట్టినప్పుడు కూడా తను వర్షంలో నిలబడింది కానీ బయటికి వెళ్ళలేదు అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఏం జరిగి ఉంటుంది, నాకు నిజం చెప్పండి. మీకు మీ అబ్బాయికి నా కూతురు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే, నా కూతుర్ని మీ కోడలుగా ఒప్పుకోవడానికి మీ అహంభావం అడ్డయితే నా కూతుర్ని ప్రాణాలతో నా చేతిలో పెట్టండి.
నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తుంది. నిజంగానే ఇంట్లో ఎవరికీ ఏమీ తెలియదండి. ఎవరికి ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయింది అంటుంది దాన్యలక్ష్మి. అయినా వాళ్లందరిని అడుగుతావేంటి ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా ఈ పెద్ద మనిషి ఈయన సమాధానం చెప్తారు అంటూ సుభాష్ వైపు తిరిగి బావగారు.. ఆరోజు నన్ను ఏమని చెప్పి మందలించారు, ఈ ఇంటి కోడలు అయిన తరువాత మామగారు తండ్రి స్థానంలో ఉండి బాధ్యత తీసుకుంటారు అని చెప్పారు.
ఈరోజు నా కూతురు ఏమైంది చెప్పండయ్యా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు కృష్ణమూర్తి. అయినా నా అల్లుళ్ళు భార్యలని కాపాడుకోలేనంత చేతకాని వాళ్లు అయిపోయారా.. పెద్ద కూతుర్ని రెండుసార్లు ఎవరో ఎత్తుకుపోతే ఎవరూ ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు చిన్న కూతురు కూడా కనిపించడం లేదు. డేగల చప్పుడు వినగానే కోడి పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుంది. ఒక భర్త ఎప్పుడూ అలా ఉండాలి అంటూ కన్నీరు పెట్టుకుంటాడు కృష్ణమూర్తి.
ఇదంతా వింటున్నా రుద్రాణి మీరు పాత విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఇక్కడ నిలదీస్తున్నట్లున్నారు. మాకు మాత్రం ఏం తెలుసు, భార్యాభర్తలిద్దరూ తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు కావాలంటే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి అని పొగరుగా మాట్లాడుతుంది. సీతారామయ్య రుద్రాణిని మందలిస్తాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు మన దగ్గర జవాబు లేదు అని చెప్పవచ్చు గాని, జవాబుదారీ తనం లేదని మాత్రం చెప్పకూడదు.
తల్లిలాంటి కూతురు కనిపించకుండా పోయిన బాధ ఆ తల్లిదండ్రులది అంటాడు. చిట్టి కూడా కనకానికి సర్ది చెప్తుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ మీ అమ్మాయి ఆనందంగా పండగ చేసుకోవటం మీరు కూడా చూశారు కదా అలాంటిది మీరు మా మీద ఇలా అపనిందలు వేయకూడదు. ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలియదు, తనని వెతికి వెనక్కి రప్పించడానికే మేమందరం ప్రయత్నిస్తున్నాము అంటుంది.
తరువాయి భాగంలో గుడిలో కూర్చున్న కావ్యని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటారు సీతారామయ్య దంపతులు. రాజ్ రాసిన చీటీ అతని చేతిలో పెడుతుంది కావ్య. అది చదివిన సీతారామయ్య షాక్ అవుతాడు. ఇంటికి వచ్చిన కావ్యని హత్తుకుంటుంది కనకం. ఎక్కడికి వెళ్లావు అంటూ నిలదీస్తుంది అపర్ణ. సమాధానం నేను చెప్తాను అంటాడు సీతారామయ్య.