ఇరు కుటుంబాల అంగీకారంతో 1959లో జానకి, రామ్ ప్రసాద్‌ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రామ్ ప్రసాద్ కేవలం భర్తగా మాత్రమే కాదు, జానకి కలలకు ఊపిరిపోసిన ప్రాణ స్నేహితుడిగా నిలిచారు. ప్రతి రికార్డింగ్, సంగీత కచేరీకి, కెరీర్‌లోని ప్రతి అడుగులోనూ ఆయన నీడలా తోడుండేవారు. ఆమెను ఎప్పుడూ ఒంటరిగా పంపనంత జాగ్రత్తగా చూసుకునేవారు. తన జీవితాన్ని భార్య సంగీత ప్రయాణానికే అంకితం చేసిన రామ్ ప్రసాద్ మద్దతే జానకమ్మ విజయానికి అతిపెద్ద బలం.
తన విజయం వెనుక ఉన్న అసలైన శక్తి రామ్ ప్రసాద్ అని జానకి ఎన్నోసార్లు చెప్పారు. `ఆయన ప్రోత్సాహం, నమ్మకం లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు` అని ఆమె కృతజ్ఞతతో గుర్తుచేసుకునేవారు. మొత్తానికి, గానకోకిల ఎస్. జానకి గారి గొంతు ఎలాగైతే కోట్లాది హృదయాలను తాకిందో, అలాగే ఆమె జీవితంలోని ఈ సరళమైన, నిస్వార్థమైన ప్రేమకథ కూడా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.