
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ చాలా గోప్యంగానే ఉంచింది. తెరపై వేలాది పాటలతో అలరించిన ఆమె, వ్యక్తిగత విషయాలను మాత్రం మీడియాకు దూరంగానే ఉంచారు. అందుకే ఆమె కుటుంబం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. తన సంగీత ప్రయాణంలో ఎంత వినయంగా ఉన్నారో, కుటుంబ జీవితంలో కూడా అంతే సాధారణంగా జీవించడానికే ఎస్. జానకి ప్రాధాన్యం ఇచ్చారు. ఖ్యాతి ఎంత పెరిగినా కుటుంబ బంధాలను కాపాడుకోవడమే తనకు ముఖ్యమని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా ప్రజల దృష్టికి దూరంగానే ఉండటం విశేషం.
ఎస్. జానకి భర్త పేరు వి. రామప్రసాద్. వీరికి 1959లో మ్యారేజ్ జరిగింది. ఆయన వృత్తిపరంగా మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా, జానకి సంగీత ప్రయాణానికి అండగా నిలిచిన జీవిత భాగస్వామిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో ఎస్. జానకి బిజీగా ఉన్న రోజుల్లో కూడా కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసేందుకు చాలా సపోర్ట్ చేశారట. 1997లో రామప్రసాద్ మరణించడం జానకి జీవితంలో పెద్ద విషాదంగా నిలిచింది. ఆ తర్వాత కూడా ఆమె ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి, సంగీతానికే ఎక్కువ సమయం కేటాయించారు. భర్త గురించి ఆమె మాట్లాడిన సందర్భాల్లో ఆయన తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, తన విజయాల్లో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఎస్. జానకి దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు మురళీ కృష్ణ. కొన్ని సినిమాల్లో నటుడిగానూ మెప్పించారు. కాకపోతే సినీ రంగంలో కాకుండా తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు భార్య ఉమా, ఇద్దరు కూతుళ్లు వర్ష, అప్సర ఉన్నారు. ఇదిలా ఉంటే మురళీ కృష్ణ ఆరు నెలల క్రితమే గుండెపోటుతో కన్నుమూశారు. ఇది జానకిని బాగా కుంగదీసింది. 1997లో తన భర్తని కోల్పోయినప్పుడే ఆమె బాగా డౌన్ అయ్యింది. ఇప్పుడు చివరి దశలో కొడుకుని పోగొట్టుకోవడంతో జానకి కోలుకోలేకపోయింది. ఓ వైపు వయో భారం, మరోవైపు కొడుకు మరణంతో ఆమె బాగా కుంగిపోయారు. చాలా బెంగ పెట్టుకున్నారు. దీంతో అనారోగ్యానికి గురయ్యారు. హఠాన్మరణం చెందారు. జానకీ శనివారం సాయంత్రం మైసూర్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.
సాధారణంగా సినిమా రంగంలో ఒక్కరు ఉంటే, వారసులంతా సినిమాల్లోకి వస్తారు. నటులుగా, దర్శకులుగా, ఇతర టెక్నీషియన్లుగా ఉంటారు. సింగర్లు అయితే వారసులు కూడ సింగర్లు మారుతుంటారు. కానీ జానకి ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ లేరు. కొడుకు మాత్రమే కొన్ని సినిమాల్లో మెరిశాడు. ఆ తర్వాత ఆయన కూడా దూరంగానే ఉన్నారు. వ్యక్తిగత వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. కొడలు ఉమా, మనవరాళ్లు వర్ష, అప్సర లు మాత్రమే ఉన్నారు.
జానకి తన జీవితంలో ఒక నియమాన్ని పాటించారు. ఆమె కట్టు, బొట్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన భర్త మరణంతో సంచలన నిర్ణయం తీసుకుందట. తన ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత రంగు చీరలు, జరీతో కూడిన వస్త్రాలు ధరించడం మానేసినట్లు తెలిపారు. కేవలం తెలుపు రంగు వస్త్రాలనే ధరిస్తున్నట్లు, సిల్క్ చీరలు కూడా కట్టడం లేదని చెప్పారు. గతంలో జానకి పెద్ద బొట్టు పెట్టుకునే వారు, దానికి ఒక విలువ ఉండేదని, అయితే ప్రస్తుతం బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని, తను(భర్త) లేనప్పుడు దానికి విలువ లేదని ఆమె వెల్లడించడం గమనార్హం.