దక్షిణ భారత సినీ లోకాన్ని ఊపేసిన ఒక నటి సిల్క్ స్మిత. ఆమె మరణం ఇప్పటికే ఒక మిస్టరీనే. సెప్టెంబర్ 23, 1996న సిల్క్ స్మిత చెన్నైలోనే తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని మరణించింది. ఆమెది ఆత్మహత్య గానే చెప్పారు. ఆర్థిక సమస్యలు, ప్రేమలో ఓటమి, మద్యపానం వంటివన్నీ కలిసి ఆమెకు డిప్రెషన్ తెచ్చిపెట్టాయని.. దానివల్ల ఆత్మహత్య చేసుకుందని వివరించారు. అయితే ఇప్పటికీ ఆ మరణం పై ఎన్నో వివాదాలు, వాదనలు ఉన్నాయి. సిల్క్ స్మిత చనిపోయే ముందు ఒక లేఖను కూడా రాసింది.
ఆ లేఖలో ‘నేను నటిగా మారడానికి ఎంతో కష్టపడ్డాను. ఎవరూ నన్ను ప్రేమించలేదు. ఒక్కరు మాత్రమే నన్ను కొంత ప్రేమగా చూసుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా శాంతి లేదు. అందుకే మరణం నన్ను పిలుస్తోంది. నేను బాబును నిజాయితీగా ప్రేమించాను. అతడు నన్ను ఎప్పుడూ మోసం చేయడని నమ్మాను. కానీ అతను అలాగే చేశాడు. గత ఐదేళ్లుగా ఒకరు నాకు జీవితాన్ని ఇస్తానని చెబుతున్నారు. కానీ అవన్నీ మాటలు మాత్రమే అని నేను గ్రహించాను. ఇక అలసిపోయాను. ఇకపై దాన్ని భరించలేను’ అని రాసుకొచ్చింది. ఈ లేఖను బట్టి ప్రేమలో ఓటమి ఆమె మరణానికి కారణమని అర్థం చేసుకున్నారంతా.