Anushka Shetty
అనుష్క శెట్టి.. యోగా టీచర్‌గా కెరీర్ సాగిస్తున్న సమయంలో నాగార్జున ఆమెకి లైఫ్ ఇచ్చాడు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆమె గుర్తించి నాగ్ వద్దకి తీసుకురాగా, `సూపర్` సినిమాతో హీరోయిన్‌ని చేశారు. దీంతో ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు కథానాయికల దశ దిశని మార్చేసింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోల రేంజ్‌లో మెప్పించింది. `అరుంథతి`తో ఆమె సంచలనం సృష్టించింది. `పంచాక్షరి`, `భాగమతి` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది.
`బాహుబలి`లోనూ ప్రభాస్‌కి దీటుగా చేసింది. సినిమాలో ఆమె గ్లామర్‌గానేకాదు, అంతకు మించిన యాక్షన్‌తోనూ మెప్పించింది. అద్భుతమైన నటనతో అదరగొట్టింది. అయితే ఇటీవల ఆమె సినిమాలు తగ్గించింది. అధిక బరువు కారణంగా ఆమె బయటకు రాలేకపోతుంది. అదే సమయంలో సినిమాలు కూడా చాలా సెలక్టీవ్‌గా చేస్తుంది. ఇటీవల `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`లో నటించింది కానీ ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. బరువు సమస్య కారణంగానే ఆమె బయటకు రాలేకపోతుందని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క శెట్టి గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు మేకప్‌మెన్ చంద్ర(రామచంద్రరావు). ఆయన ఆ మధ్య ఓ యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడారు. అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్ గురించి వెల్లడించాడు. అనుష్క నటించిన రెండు మూడు సినిమాలకు ఆయన ముందుగా పనిచేశారు. ఆ పరిచయంతో తను నిర్మాతగా మారి `పంచాక్షరి` సినిమా చేశాడు. ఈ మూవీ మంచి లాభాలను తెచ్చిపెట్టిందన్నారు. ఆ మూవీకి తనకు పారితోషికం తక్కువ ఇచ్చినా చేసిందని, కానీ లాభాలు వచ్చాక మరికొంత ఇచ్చినట్టు తెలిపింది.
ఈ సందర్బంగా అనుష్క గురించి చెబుతూ, ఆమె చాలా సెన్సిటివ్ పర్సన్ అని తెలిపాడు. తన ముందు ఎవరికి ఏదైనా సమస్య వస్తే చాలా ఫీలైపోతుందని, తనకు వచ్చినట్టుగానే భావిస్తుందని, అయ్యో అని అల్లాడిపోతుందని వెల్లడించారు. మంచి దయా గుణం అని ఇతర ఏ హీరోయిన్లలోనూ అలాంటి క్వాలిటీ చూడలేదన్నారు. ఏదో మోహమాటంతో చేయడం కాదు, హార్ట్ తో చేస్తుంది. అలానే ఫీలవుతుంది. చాలా జెన్యూన్ పర్సన్ అని చెప్పాడు. ఏ విషయంలోనూ, మనీ విషయంలోనూ ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టదన్నారు.
Anushka Shetty
అనుష్క మన ఇండస్ట్రీకి చాలా స్పెషల్ అని, ఆమె దొరకడం మన అదృష్టం అని చెప్పారు. ఇలాంటి అమ్మాయి దొరకదని, మరో పదేళ్లలో కూడా ఇలాంటి హీరోయిన్ దొరకదన్నారు. అంత మంచితనం మిస్ యూజ్ చేసేవాళ్ల ఉంటారు కదా అనే ప్రశ్నకి స్పందిస్తూ, ఆమెని ఎవరూ మిస్ యూజ్ చేయలేరని తెలిపారు సీనియర్ మేకప్‌మెన్. అనుష్క ఒక మనిషిని అలా చూడగానే అతని క్యారెక్టర్ ఏంటో కనిపెడుతుందని, అంత పిచ్చిది కాదు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. అందుకే ఆమెని ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పుకొచ్చాడు మేకప్‌మెన్ చంద్ర.
మరో ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఆమె ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందని, మెసెజ్ చేస్తే రియాక్ట్ అవుతుంది. ఫోన్‌లోనూ మాట్లాడుతుందని చెప్పారు. అయితే ఇటీవల మాత్రం ఆమె తనకు రియాక్ట్ కావడం లేదట. చాలా సార్లు ఫోన్లు చేశానని, కానీ లిఫ్ట్ చేయడం లేదని, మెసేజ్ చేసినా రియాక్ట్ కావడం లేదని తెలిపారు. మరి ఎందుకు అలా చేస్తుందో అర్థం కావడం లేదని, తమ మధ్య మాత్రం ఎలాంటి గొడవ లేదని స్పష్టం చేశాడు రామచంద్రరావు.
అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. యూవీ క్రియేషన్స్ దీన్ని నిర్మిస్తుంది. ఈ మూవీకి `శీలవతి` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ కథతోనే ఈ మూవీ రూపొందుతుందట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతోందని, అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది కావడం విశేషం.