
సినిమాలో అతి కష్టమైన క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే అది డైరెక్షన్ అనే చెప్పాలి. దర్శకులు 24 క్రాఫ్ట్ లను మ్యానేజ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రమోషన్స్, రిలీజ్ వరకు అన్నీ చూసుకోవాలి. సినిమా కథ రాసి హీరోని, నిర్మాతని ఒప్పించడం ఒక ఎత్తైతే, అనుకున్న విధంగా సినిమా తీయడం మరో ఎత్తు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రాపర్‌గా చేయడం మరో ఎత్తు. ఇవన్నీ దాటుకుని సినిమాని రిలీజ్ చేయించడం ఇంకో ఎత్తు. సినిమా బిజినెస్, బయ్యర్లు, థియేటర్ రిలీజ్ వరకు దర్శకుడికి తీరిక ఉండదు. ఒక్కసారి విడుదలైతే ఆయన రిలీఫ్ అవుతాడు. సినిమా సక్సెస్ అయితే హ్యాపీ, అన్నీ మర్చిపోవచ్చు. ఒకవేళ పోయిందా? నెక్ట్స్ ఏంటనేది పెద్ద సమస్య. చాలా మంది దర్శకులు ఒక్క మూవీతో అడ్రస్ లేకుండా పోయారు. అయితే ఇంతటి రిస్క్ ని హీరోయిన్లు కూడా తీసుకున్నారు. హీరోలు డైరెక్షన్ చేయడం కామన్‌గానే జరుగుతుంది. కానీ హీరోయిన్లు కూడా దర్శకులుగా మారి సత్తా చాటారు.
మన టాలీవుడ్‌లో అడపాదడపా లేడీ డైరెక్టర్లు వస్తున్నారు. వారిలో హీరోయిన్లే దర్శకురాలుగా మారిన వారు కూడా ఉన్నారు. వారిలో సావిత్రి, భానుమతి, విజయ నిర్మల, జీవిత వంటి వారు ఉంటారు. వీరంతా హీరోయిన్‌గా పీక్‌లో ఉండగానే దర్శకురాలిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సావిత్రి దర్శకురాలిగా ఆరు సినిమాలు చేసింది. 1968లో `చిన్నారి పాపలు` చిత్రంతో దర్శకురాలిగా మారింది. ఇది పరాజయం చెందింది. అదే కథతో తమిళంలో `కులందై ఉళ్ల్ళం` మూవీ చేసి చేతులు కాల్చుకుంది. అయినా ఆగలేదు. అదే ఏడాది `మాతృదేవత` సినిమా చేసింది. ఇది జస్ట్ యావరేజ్. ఆ తర్వాత `వింత సంసారం`, `ప్రాప్తం` వంటి చిత్రాలు చేసింది. వీటిలో చాలా వరకు కమర్షియల్‌గా నష్టాలు తీసుకొచ్చాయి. దీంతో చాలా నష్టపోయింది. కాకపోతే అందులో కొన్ని మూవీస్ క్రిటికల్‌గా మెప్పించాయి.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన జీవిత దర్శకురాలిగా మారి నాలుగు సినిమాలు చేసింది. అందులో `శేషు`, `సత్యమేవ జయతే`, `మహాంకాళి`, `శేఖర్` వంటి చిత్రాలున్నాయి. ఇందులో అన్నీ భర్త రాజశేఖర్ హీరోగా నటించారు. ఆయన్ని హీరోగా నిలబెట్టేందుకు, జీవిత హీరోయిన్‌గా సత్తా చాటేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీని కారణంగా చాలా నష్టపోయింది. ఆ తర్వాత డైరెక్షన్‌కి దూరంగా ఉంటోంది. ఆమెతోపాటు నటి లక్ష్మి కన్నడలో `మక్కల సైన్య` అనే చిత్రాన్ని విష్ణువర్థన్‌తో చేసింది.ఈ మూవీ ఆడలేదు.
ఇక దర్శకురాలిగా సక్సెస్ అయిన హీరోయిన్లలో మొదటి వరుసలో భానుమతి రామకృష్ణ ఉంటారు. ఆమె డామినేటింగ్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ సైతం ఆమె ముందే తగ్గేవారంటే అతిశయోక్తి కాదు. అలాంటి భానుమతి మల్టీ టాలెంటెడ్. ఆమె నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, రచయిత్రిగా, గాయనిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తన బహుముఖ ప్రజ్ఞని చాటి చెప్పారు. ఈ క్రమంలో ఆమె దర్శకురాలిగా మారి 14 సినిమాలు తెరకెక్కించారు. వాటిలో `చండీరాణి` మొదటి మూవీ. ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత `గృహలక్ష్మి`, `అంతా మన మంచికే`, `విచిత్ర వివాహం`, `అమ్మాయి పెళ్లి`, `మనవడి కోసం`, `రచయిత్రి`, `ఒకనాటి రాత్రి`, `భక్త ధృవ మార్కండేయ`(రెండు భాగాలు), `అసాధ్యురాలు`తోపాటు మూడు తమిళ చిత్రాలు రూపొందించింది. ఇందులో చాలా వరకు మంచి ఆదరణ పొందాయి. అలా దర్శకురాలిగా సక్సెస్ అయిన తొలి నటిగా భానుమతి రికార్డు సృష్టించారు.
ఆ తర్వాత దర్శకురాలిగా సక్సెస్ అయ్యిందంటే విజయ నిర్మల మాత్రమే. ఆమె తన కెరీర్‌లో 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. విజయ నిర్మల 1950లో `మచ్చ రేఖ` అనే తమిళ చిత్రంతో నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తెలుగు, తమిళంలో బాలనటిగా పలు సినిమాలు చేసింది. కృష్ణుడిగా, సీతగా మెరిసింది. మలయాళ సినిమా `భార్గవి నిలయం` మూవీతో ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో మూవీస్ చేసింది. హీరోయిన్‌గా మలయాళ చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చిన ఆమె దర్శకురాలిగానూ మలయాళ మూవీతోనే పరిచయం కావడం విశేషం. 1973లో `కవిత` అనే సినిమాని కేవలం మూడు లక్షల బడ్జెట్‌తో రూపొందించారు. ఇది మంచి ఆదరణ పొందింది. అదే ఏడాది `మీనా` అనే తెలుగు మూవీని రూపొందించింది. ఇది సంచలన విజయం సాధించింది.
ఇక విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాల్లో `మీనా`, `దేవదాస్`, `రౌడీ రంగమ్మ`,`హేమా హేమీలు`, `రామ్ రాబర్ట్ రహీమ్`, `ఖిలాడీ కృష్ణుడు`, `డాక్టర్ సినీ యాక్టర్`, `బెజవాడ బెబ్బులి, `లంకే బిందెలు`, `సాహసమే నా ఊపిరి`, `అజాత శత్రువు`, `పుట్టింగ గౌరవం`, `ప్రజల మనిషి`, `నేరము శీక్ష` వంటి చిత్రాలతో ఆమె ఆకట్టుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్‌గా విజయ నిర్మల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లకు ఎక్కారు. ఇలా దాదాపు 44 సినిమాలకు దర్శకత్వం వహించింది విజయ నిర్మల. వీటిలో చాలా వరకు మంచి ఆదరణ పొందాయి. అందులో సూపర్ స్టార్ కృష్ణతోనే ఎక్కువగా మూవీస్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ తన సిస్టర్ పూజా శరత్ కుమార్‌తో కలిసి 'దోస డైరీస్' అనే పేరుతో సొంత బ్యానర్‌ని స్థాపించారు. ప్రొడక్షన్ నెం.1గా 'సరస్వతి' అనే టైటిల్ తో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. వరలక్ష్మి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలోనూ నటిస్తుండటం విశేషం. మరోవైపు నిర్మాతగానూ బాధ్యతలు నిర్వహించనున్నారు. మరి విజయ నిర్మల మాదిరిగానే దర్శకురాలిగా సక్సెస్ అవుతుందా? కంటిన్యూగా సినిమాలు చేస్తుందా అనేది చూడాలి.