
భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టుల నేపథ్యంలో వచ్చే సినిమాలు తెలుగులో తక్కువే. అలాంటి సినిమాలు చేయాలంటే వాటిపై పూర్తి అవగాహన అవసరం అని గబుక్కున ఎవరూ రిస్క్ చేయరు. కాని దేవకట్టా ‘ప్రస్థానం’ నుంచి విభిన్నమైన కాన్సెప్టులతో ముందుకు వస్తున్నారు. డైలాగులతో తన ముద్ర వేస్తున్నారు. అందుకేనేమో సినిమా హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ఆయన సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు ఏర్పడ్డారు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం ఇది. అలాగే మొదటి సీన్ నుంచి నేరుగా వైసీపీ మీదే కౌంటర్లు వేసినట్టు ప్రచారం జరిగింది, అది నిజమేనా...ఇంతకీ ఈ చిత్రం కథేంటి..ఈ సినిమాతో దేవకట్టా కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకోబోతున్నారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
మొదటి నుంచి చదువులో చాలా బ్రిలియెంట్ పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్). అలాగే సమాజం పట్ల కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయినా కుటుంబం పట్టుదల వల్ల అమెరికా వెళ్దామనుకుంటాడు. ఈ లోగా ఎలక్షన్స్ వస్తాడు. ఓటేయటానికి వెళ్తే తన ఓటు వేసేసారని అక్కడకు వచ్చిన కలెక్టర్ (సుబ్బరాజు) తో వాదన పెట్టుకుంటాడు. కలెక్టర్ ని అందరిలో నిలదీస్తాడు. అప్పుడా కలెక్టర్ నువ్వు మా పొజీషన్ లో ఉంటే నీకు కష్టం ఏమిటి, వ్యవస్ద ఏమిటనేది తెలుస్తుంది. అమెరికా పారిపోయేవాడివి నీకేం తెలుసు అనటంతో తన నిర్ణయం మార్చుకుని కలెక్టర్ అవుతాడు.
ఆ ఎలక్షన్స్ లో విశాఖవాణి (రమ్యకృష్ణ) పార్టీ అధికారంలోకి వస్తోంది. వాళ్లు తె(కొ)ల్లేరును విషపూరితంగా మారుస్తూంటారు. దాంతో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజాలు వెలికి తీసే ప్రయత్నం చేసిన మైరా (ఐశ్వర్య రాజేష్) అన్నయ్యని చంపేస్తారు. మైరాతో పరిచయం అయిన పంజా అభిరామ్ కలెక్టర్ అయ్యి వచ్చి ఆ కేసుని ఎలా డీల్ చేసాడు... విశాఖవాణి ఎలా దానికి అడ్డం పడింది. చివరకు తెల్లేరు లో ఏమన్నా మార్పు వచ్చిందా, జగపతిబాబు కథేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
ఎన్నికల బూత్ దగ్గర తన ఓటు వేరే వారు వేసేసారని ప్రశ్నించటం మనకు విజయ్ హీరోగా వచ్చిన సర్కార్, విజయ్ దేవరకొండ నోటా సినిమాలు గుర్తు తెస్తాయి. అయితే ఇందులో జరిగిన కథా ప్రయాణం వేరు. ప్రజాప్రతినిధులతో కూడిన శాసన వ్యవస్థ, బ్యూరోక్రాట్లతో కూడిన అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ.. ఈ మూడూ గుర్రాలైతే.. ప్రస్తుత పరిస్థితుల్లో వాటి గమనం ఎలా సాగుతోందో, అవి ఎలా ప్రయాణం చేస్తే వ్యవస్థ బాగుంటుంద కథలో భాగంగా చెప్పే ప్రయత్నం చేసారు కానీ..చాలా డ్రై నేరేషన్ కావటంతో అర్దం అవటానికి,అవగాహన చేసుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. వ్యవస్థలన్నింటినీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న విశాఖవాణికీ, అభిరామ్‌కీ మధ్య డ్రామా మొదట నుంచి కరెక్ట్ గా నడిపితే సరిపోయేంది. అలా కాకుండా కథలోకి చాలా క్యారక్టర్స్ తీసుకొచ్చి చాలా మలుపులు తిప్పారు. దాంతో ఏం కథ చూస్తున్నామో అనే క్లారిటీ పోతుంది.
కేవలం డైలాగులతో సినిమా ని నడపొచ్చా అంటే అప్పట్లో త్రివిక్రమ్ తన ఫన్నీ డైలాగులతో అలా అలా నడిపేసేవారు. ఇప్పుడు దేవకట్టా కూడా డైలాగులు కాసిన్ని ఎక్కువే రాసుకుని వాటిని అవకాసం దొరికినప్పుడల్లా చెప్పిస్తూ కథను ,కథనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేసారు. ఆ ప్రాసెస్ లో కొన్ని చోట్ల హీరో డైలాగులు చెప్తూంటే అవి అతనికైనా అర్దమయ్యాయా అని సందేహం వచ్చేస్తుంది. అయితే కొన్ని గొప్ప డైలాగులు ఉన్నాయి అందులో సందేహం లేదు. పనిలో పనిగా ప్రస్తుత రాజకీయాల మీదా, మహారాష్రలోని శివసేన మీద డైరక్ట్ సెటైర్స్ వేసారు. అలాగే సబ్సీడిలతో కాలక్షేపం చేసే ప్రభుత్వాలను తన డైలాగులలో తూర్పారబెట్టాడు. అయితే డైలాగుల మీద పెట్టిన శ్రద్ద సీన్స్ మీద పెట్టలేదు. స్క్రీన్ ప్లే మీద అసలు పెట్టలేదు.
విలన్ కి,హీరోకు మధ్య సంఘర్షణ మొదలయ్యే సరికే ఇంటర్వెల్ వచ్చేసింది. అంటే అప్పటిదాకా వేరే ఎలిమెంట్స్ తో కథ నడుస్తుంది. అసలు కథ సెకండాఫ్ లో ఉంటుంది.ఫస్టాఫ్ మొత్తం హీరోయిన్ ట్రాక్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. హీరోయిన్ అనగానే రొమాంటిక్ గా ఊహించుకోకుండి. ఆమె అన్నగారి కిడ్నాప్ సమస్య..ఆ తర్వాత ఆమె మీద ఎటాక్,రేప్ ఇలా నడుస్తుంది. తర్వాత వీలుచూసుకుని అసలు విలన్ రమ్యకృష్ణతో తలపడతాడు. అంటే ఈ సినిమాలో రెండు కథలు అన్నమాట. రెండు కలిసిపోతే బాగుండేది. కానీ దేనికదే విడిగా ఉంటాయి.
ఈ విలన్ ట్రాక్ కు కొల్లేరు సరస్సు, అక్కడ సమస్యలతో ముడి పెట్టారు. దాన్ని నేపధ్యంగా తీసుకున్నా అదో ప్రత్యేకమైన ట్రాక్ గా కనపడుతుంది. దాంతో కొల్లేరు సమస్యలను అర్దం చేసుకుంటూ సినిమా చూడాలి. సర్లే అదీ చేద్దాం అనుకుంటే..మధ్యలో ఇవి చాలదన్నట్లు హీరో తండ్రి జగపతిబాబుకు ఓ ప్లాష్ బ్యాక్. అందులో ఓ విలన్. హీరో తల్లిని ఆ విలన్ చంపేస్తాడు. అదృష్టం బాగుంది. ఇప్పుడు ఆ విలన్ ఎక్కడున్నాడో అని హీరో వెతుక్కుంటూ వెళ్లడు. లేకపోతే అదో స్పెషల్ ట్రాక్ అయ్యేది.
పనిలో పనిగా విలన్ రమ్యకృష్ణ కు కూడా ఓ ప్లాష్ బ్యాక్ పెట్టారు. ఆమె అలా విలన్ గా ఎందుకు తయారయ్యిందో చెప్తారన్నమాట. ఈ కథలో అందరూ మంచివాళ్లే. పాపం వ్యవస్దే వాళ్ళను దుర్మార్గంగా తయారు చేసింది అని చెప్పాలని డైరక్టర్ గారి ఉద్దేశ్యం. ఇవన్నీప్రక్కన పెడితే ఓ టైమ్ లో సినిమా అయ్యిపోయిందనుకుని అందరూ లేచిపోతుంటే...అబ్బే అవ్వలేదు. మీరు చూసింది ప్రీ క్లైమాక్స్ అని తేల్చేసి,కథ మళ్లీ మొదలయ్యి..ఓ పది నిముషాలు పైగా నడుస్తుంది. ఇలా స్క్రీన్ ప్లే చాలా విసుగ్గా, బోర్ గా రాసుకున్నారు.
దీనితో పాటు ఇలాంటి కథను చాలా స్లో గా నడపాలని డైరక్టర్ ఫిక్స్ అయ్యారు. ఎక్కడా చిన్నపాటి రిలీఫ్ ఇవ్వలేదు. హీరోయిన్ ఉన్నది పేరుకే కానీ అది చాలా సీరియస్ ట్రాక్. అదీ చాలా పూర్ గా రాసుకున్నారు. అసలు ఆమె చేసేది హీరోయిన్ పాత్రా లేక కథలో ఓ క్యారక్టరా అనే డౌట్ కూడా వస్తుంది. ఇలా తెలుగు సినిమా రూల్స్ ని బ్రేక్ చేస్తూ...చూసేవాళ్ల సహనాన్ని బ్రేక్ చేసారు.
హైలెట్స్
సిస్టమ్ లో లోటు పాట్లు నిజాయితీగా చెప్పాలనే దర్శకుడు ప్రయత్నం
సాయి ధరమ్ తేజ ఫెరఫార్మెన్స్
డైలాగులు
మైనస్ లు
అడగడుక్కీ అడ్డం తగిలే ప్లాష్ బ్యాక్ లు
క్లైమాక్స్
స్లో నేరేషన్
రిలీఫ్ లేకపోవటం
టెక్నికల్ గా...
సినిమా మొదట స్క్రీన్ పరంగా దారి తప్పింది. దాంతో టెక్నికల్ గా ఎంత సౌండ్ గా ఉన్నా కలిసిరాలేదు. అప్పటికీ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఓకే . సినిమాటోగ్రఫీ నీటుగా ఉంది. సినిమాలోని చాలా సీన్స్ రియలిస్టిక్ గా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త స్పీడుగా ఉండేలా చూసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరక్టర్ రాసుకున్న డైలాగులు, మేకింగ్ బాగుంది.
నటీనటుల్లో...
ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను సాయితేజ్ చాలా ఈజ్ తో పోషించాడు. విశేషం ఏమంటే తన ఇంటిపేరును తొలిసారి సాయితేజ్ తన పాత్రకు పెట్టుకున్నాడు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా చేసింది కానీ చెప్పుకోవటానికి హీరోయిన్ కానీ తెరపై ఆ ఛాయిలు ఏమీ లేవు.అలాగే ఈ మూవీలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. జగపతిబాబు పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. రమ్యకృష్ణ పాత్ర ..శివగామికు మరో వెర్షన్.
ఫైనల్ థాట్
ఆనకట్ట వేయని దేవకట్టా ఆలోచనలు పబ్లిక్ గా ప్రవహించాయి తెరపై
Rating:2
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
సంస్థలు: జీస్టూడియోస్, జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్;
నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, పోసాని కృష్ణమురళి తదితరులు;
ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్;
సంగీతం: మణిశర్మ;
ఎడిటింగ్: కె.ఎల్.ప్రవీణ్;
స్క్రీన్‌ప్లే: దేవా కట్టా, కిరణ్ జయ్‌కుమార్;
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు;
కథ, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా;
విడుదల తేదీ: 1 అక్టోబర్ 2021