2022 సంక్రాంతి కానుకగా ఆర్ ఆర్ ఆర్ (RRR movie) జనవరి 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పండుగకు ఓ వారం ముందు వస్తున్నప్పటికీ ఆర్ ఆర్ ఆర్ టార్గెట్ మాత్రం సంక్రాంతి వసూళ్లే. అయితే ఆర్ ఆర్ ఆర్ కంటే ముందు ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వేశారు. మహేష్ (Mahesh) సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్, పవన్ భీమ్లా నాయక్ చిత్రాలు దీనిపై అధికారిక ప్రకటనలు చేశాయి.
కారణం ఏదైనా మహేష్ సర్కారు వారి పాట సంక్రాంతి రేసు నుండి తప్పుకొని సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. రాధే శ్యామ్ (Radhe shyam) విడుదల ఇప్పటికే ఆలస్యం కావడంతో పాటు ప్రభాస్ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి రాధే శ్యామ్ సంక్రాంతి ప్రకటనకు కట్టుబడి ఉంది.
ఆర్ ఆర్ ఆర్ మూవీ బడ్జెట్ రీత్యా బీమ్లా నాయక్ చిత్ర విడుదల పోస్ట్ పోన్ చేయగలిగితే అందరూ సేఫ్ అని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. భీమ్లా నాయక్ నిర్మాతలతో అనధికారిక సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే వసూళ్ల వర్షం కురిపించే సంక్రాంతి సీజన్ ని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు.
rrr movie
అందుకే బీమ్లా నాయక్ విడుదల వాయిదా అంటూ వస్తున్న కథనాలకు చెక్ పెట్టడానికి జనవరి 12న విడుదల అంటూ... అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. భీమ్లా నాయక్ టీమ్ వెనక్కి తగ్గకపోవడానికి మరొక కారణం... ఆర్ ఆర్ ఆర్ విడుదల వలన భీమ్లా నాయక్ (Bheemla nayak) చిత్రానికి జరిగే నష్టం ఏమీ లేదు. మూవీకి ఉన్న డిమాండ్ రీత్యా లాభాలతో డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమాను అమ్మేసుకున్నారు. పాజిటివ్ టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు నిర్మాతలకు మరిన్ని లాభాలు వస్తాయి.
ఒక వేళ భీమ్లా నాయక్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా... ఆర్ ఆర్ ఆర్ భారీ విజయం సాధించి దాని ప్రభంజనం ముందు నిలవకపోయినా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే. అందుకే భీమ్లా నాయక్ నిర్మాతలు మొండిగా ముందుకు వెళుతున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి వేరు. ఆ మూవీ బడ్జెట్ రీత్యా భారీ వసూళ్లు అవసరం. ఓపెనింగ్స్ తో పెట్టుబడిలో యాభై శాతం రాబట్టాలి. అలా జరగాలంటే ఎక్కువ రోజులు ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లో ఉండాలి. ఆర్ ఆర్ ఆర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వారం వ్యవధిలో భీమ్లా నాయక్ విడుదల కారణంగా చాలా థియేటర్స్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్ వసూళ్లపై ప్రభావం చూపుతుంది.