
కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ (Vikram), విజయ్‌తో ‘లియో’ (Leo), కార్తితో ‘ఖైదీ’ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ కొత్త సినిమా చేస్తున్నారనగానే అటెన్షన్ వెంటనే అటు వెళ్లిపోతుంది. అందులోనూ ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమా రజనీకాంత్ తో. దాంతో ఆ సినిమా విశేషాలు కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అయిపోతోంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ బయిటకు వచ్చింది.
రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా పేరుని, టీజర్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కథ సమయంతో ముడిపడినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా చిత్ర టీమ్ విడుదల చేసిన పోస్టర్‌లోనూ, రజనీ చేతికీ గడియారాలు కనిపిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్‌కి సంబంధించిన కథ ఇదని ఓ లీక్.
ఈ సినిమా కోసం పలు టైటిళ్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘తలైవా’ టైటిల్ పెట్టారంటూ ట్విట్లర్‌లో ఆ మధ్య ట్రెండ్ అయింది. మరి తాజాగా మరో టైటిల్ నెట్టింట్లోకి వచ్చింది. ‘కళుగు’ అనే టైటిల్‌ను పెట్టాలని లోకేష్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ‘కళుగు’ అంటే ‘గద్ద’ అని అర్థం. అన్ని భాషల్లోనూ ‘కళుగు’ పేరుతోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈనెల 22న టైటిల్ ని చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించబోతోందని సమాచారం.
లోకేశ్ కనగరాజ్ గతంలో ఈసినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో రజనీకాంత్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఆయన కనిపించే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్. కాకపోతే, ఇందులో నా గత చిత్రాల్లో చూపించిన విధంగా మాదక ద్రవ్యాలను చూపించను’’ అని అన్నారు.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను లోకేశ్ షేర్ చేసారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. దీని షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సినిమా గురించి తెలియగానే మొదట కమల్ హాసన్ ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు. ‘‘ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 2024 నాటికి అవి పూర్తవుతాయి.
లోకేష్ చెప్తూ... ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా. చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్ ఇలాంటి సినిమాలో నటించనున్నారు. దీని స్క్రిప్ట్ విన్నాక ఆయన చాలా సంతోషించారు. అనిరుధ్, నేను కలిసి వెళ్లి ఆయనకు కథ వినిపించాం. వెంటనే ఆయన నన్ను కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. చాలా సంతోషించాను’’ అని చెప్పారు.
రజనీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే ఇందులో అతిథి పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను ఇప్పటికే లోకేశ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై రణ్‌వీర్ ఆసక్తిగా ఉన్నారని, కథ కూడా వినేందుకు అంగీకరించినట్లు సమాచారం.
ఇక ‘జైలర్’ సక్సెస్ తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు రజనీకాంత్. ఇటీవల ‘లాల్‌సలామ్’తో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్‌తో సినిమా చేస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఆయన లోకేశ్ కనగరాజ్‌తో రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారు. ‘లియో’ తర్వాత లోకేశ్ కనగరాజ్ చేస్తోన్న చిత్రమిదే. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.