Rajinikanth Biopic: సూపర్ స్టార్ రజనీకాంత్ తన జీవిత కథని పుస్తకంగా రాస్తున్నారు. అయితే దీన్ని ఇప్పుడు సినిమాగా తీసే ప్లాన్ కూడా జరుగుతుంది. కూతురు సౌందర్య ఈ ప్లాన్‌లో ఉన్నారట. మరి అందులో రజనీగా ఎవరు కనిపిస్తారు.
బెంగళూరు బస్ కండక్టర్ నుంచి భారతీయ సినిమా సూపర్ స్టార్ అయ్యే వరకు రజనీ ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలతో నిండి ఉంది. 70వ దశకం ప్రారంభంలో, శివాజీ రావ్ గైక్వాడ్ బెంగళూరు BMTC బస్సులో కండక్టర్‌గా పనిచేసేవారు. ఆ బస్సులో ప్రయాణించిన వాళ్లలో ఎవరికీ తెలియదు, ఈయనే ఒకరోజు భారత సినిమా చరిత్రను మారుస్తాడని. అలాంటి గొప్ప ప్రయాణం సూపర్ స్టార్ రజనీకాంత్‌ది. గత 50 ఏళ్లుగా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్న రజనీకాంత్, ఇప్పుడు తన జీవిత కథను తానే రాయడానికి సిద్ధమయ్యారు. ఆయన తన ఆత్మకథ రాస్తున్నారన్న వార్త కోలీవుడ్ నుంచి శాండల్‌వుడ్ వరకు పెద్ద సంచలనం సృష్టించింది. బెంగళూరు కండక్టర్ నుంచి చెన్నై సినీ ప్రపంచంలో శిఖరాన్ని అందుకునే వరకు ఆయన ప్రయాణం అంత సులభం కాదు. ఈ పుస్తకంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఓటములు, విజయాలు, కఠోర శ్రమ వంటి అన్ని విషయాలు ఉంటాయి.
24
సినిమాగా రజనీకాంత్ జీవితం
రజనీకాంత్ కేవలం పుస్తకం రాయడంతోనే ఆగిపోకుండా, దానిని బయోపిక్ చిత్రంగా తీయాలని తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్, 'నాన్న తన జీవితంలోని ప్రతి సవాలును రికార్డ్ చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది' అని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఒకవేళ తలైవా బయోపిక్ వస్తే, అది భారతీయ సినిమాలోనే అతిపెద్ద చిత్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
34
రజనీ పాత్రలో నటించేది ఎవరు?
ఒకవేళ రజనీ జీవితం సినిమాగా వస్తే, అందులో సూపర్ స్టార్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలుపెట్టారు. ఆయన పాత్రలో ఎవరైతే బెటరో చెబుతున్నారు. అయితే చాలా మంది ఆయన మ్యానరిజం బ్యాలెన్స్ చేయడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. ధనుష్ కొంత వరకు సెట్ అవుతారనే కామెంట్ వినిపిస్తుంది. మరి ఎవరు చేస్తారనేది చూడాలి. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లోని ఎందరో దిగ్గజాలతో కలిసి నటించిన రజనీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు వరించాయి. ఈ రోజుకీ ఆయన సినిమా విడుదలవుతుందంటే థియేటర్లు పండగలా మారిపోతాయి.
ఒకవైపు బయోపిక్ గురించి చర్చ జరుగుతున్నా, మరోవైపు రజనీకాంత్ వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'జైలర్ 2' సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో పాటు, రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి 'ధర్మాన్' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని కమల్ హాసనే నిర్మించడం మరో విశేషం. మొత్తానికి, బస్ కండక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, నేడు గ్లోబల్ ఐకాన్‌గా మారిన రజనీకాంత్ 'నిజ జీవిత' కథను తెరపై చూసేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తలైవా స్టైల్, మేనరిజం, మానవత్వం వంటి అన్ని విషయాలను చూపించే ఆ నిజమైన కథ తెరపైకి రావాలన్నది అభిమానుల కోరిక.