Published : Jul 09, 2026, 09:17 PM ISTUpdated : Jul 09, 2026, 09:50 PM IST
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం రాజేష్ శర్మ ప్రభాస్ ఫౌజీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అసలు రాజేష్ శర్మకి ఏమైంది అనే విషయంలో గందరగోళం నెలకొంది.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా సెట్‌లో నటుడు రాజేష్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) డిమాండ్ చేసింది.
25
విష పురుగు కుట్టడం వల్లే ఇలా
ఈ సీనియర్ నటుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని AICWA ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "షూటింగ్ షెడ్యూల్ సమయంలో రాజేష్ శర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన కోల్‌కతా వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇంత తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీసిన పరిస్థితులు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై వెంటనే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగాలి" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
35
క్లారిటీ ఇచ్చిన రాజేష్ శర్మ అసిస్టెంట్
రాజేష్ శర్మ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు ఇంకా ప్రమాదం తొలగిపోలేదని AICWA వెల్లడించింది."తాజా మెడికల్ అప్‌డేట్ ప్రకారం ఈ ఘటన తీవ్రత మరింత ఆందోళనకరంగా మారింది. రాజేష్ శర్మ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నందున, 'ఫౌజీ' షూటింగ్ సమయంలో ఈ ఆరోగ్య సమస్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరపడం చాలా అవసరం" అని AICWA నొక్కి చెప్పింది.
రాజేష్ శర్మ ఆసుపత్రి పాలవడంతో ప్రభాస్ మూవీ సెట్ లోనే ఏదో జరిగింది అనే పుకార్లు వ్యాపించాయి. కానీ రాజేష్ శర్మ అసిస్టెంట్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆసుపత్రిలో చేరింది ప్రభాస్ మూవీ సెట్ లో ఏదో సంఘటన జరగడం వల్ల కాదు అని.. ఆయన డైయాబెటిస్ కి చికిత్స తీసుకుంటున్నారు అని తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న డయాబెటిస్ కి రాజేష్ శర్మ చికిత్స తీసుకోవడం కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారట. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు అని తెలిపారు.
కానీ AICWA మాత్రం ఇది సినిమా సెట్ లో జరిగిన సంఘటన అన్నట్లుగానే స్పందించారు. సినిమా సెట్స్‌లోని పని పరిస్థితులపై కూడా ఈ అసోసియేషన్ ప్రశ్నలు లేవనెత్తింది. "ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్, వర్కర్‌కు సురక్షితమైన, పరిశుభ్రమైన, వైద్య సదుపాయాలున్న వాతావరణాన్ని కల్పించడం సినీ పరిశ్రమ చట్టపరమైన, నైతిక బాధ్యత. కానీ దేశవ్యాప్తంగా చాలా షూటింగ్ లొకేషన్లలో పరిశుభ్రత లోపించడం, సరైన పారిశుధ్యం లేకపోవడం, అసురక్షిత పని వాతావరణం, అత్యవసర వైద్య సదుపాయాలు కొరవడటంపై మేం పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. వేలాది మంది కార్మికులు రోజూ గంటల తరబడి సెట్స్‌లో గడుపుతారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి" అని AICWA పేర్కొంది.
55
తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
ఈ ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని AICWA కోరింది. "ఈ విచారణలో నటుడు రాజేష్ శర్మ అనారోగ్యానికి కచ్చితమైన కారణం ఏంటో తేల్చాలి. సెట్‌లో భద్రత, పరిశుభ్రత, అత్యవసర వైద్య నిబంధనలు పాటించారా లేదా అని పరిశీలించాలి. నిర్మాత, ప్రొడక్షన్ హౌస్ లేదా ఇతర బాధ్యుల వైపు నుంచి ఏదైనా నిర్లక్ష్యం ఉంటే గుర్తించాలి" అని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, ఈ విషయంపై 'ఫౌజీ' చిత్ర నిర్మాతలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.