యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో, తెలుగు సినిమా చరిత్రలో ఒక కళాఖండం లా మిగిలిపోతుంది బాహుబలి చిత్రం. తనని అర్థం చేసుకునే నిర్మాతలు.. నమ్మకం ఉంచే హీరోని పెట్టుకుని రాజమౌళి శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. దానికి ప్రతిఫలమే బాహుబలి రెండు భాగాలు సాధించిన విజయం. తెలుగు సినిమా కంటే బాలీవుడ్ పెద్దది అనే భావనని బద్దలు కొట్టిన చిత్రం బాహుబలి.
అంతటి భారీ చిత్రం చేస్తున్నప్పుడు చాలా కష్టాలు, సందేహాలు ఎదురుకావడం సహజమే. బాహుబలి ప్రారంభ దశలో ఉన్నప్పుడు రాజమౌళి కూడా భయపడ్డారట. ఎందుకంటే జక్కన్న ఏం చేసినా లెక్కలు వేసుకుని ముందడుగు వేస్తారు. బాహుబలి మూవీ ప్రారంభానికి ముందు 100 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అప్పుడు రెండు పార్టులుగా తీయాలనే ఆలోచన కూడా లేదు.
Bahubali Rajamouli
కానీ కథ పూర్తిగా డెవలప్ అయ్యాక రెండు పార్టులు తీయాలనే ప్రతిపాదన వచ్చింది. అప్పుడు మరోసారి బడ్జెట్ లెక్కలు వేసుకున్నారు. బడ్జెట్ పరిమితికి మించి అవసరం అవుతోంది. దీనితో జక్కన్న భయపడ్డాడు. ఇంత రిస్క్ చేయడం చాలా ప్రమాదం అని గమనించి వెంటనే నిర్మాతలకు చెప్పాడట. ఈ విషయాలని స్వయంగా ప్రభాస్ ఓ ఈవెంట్ లో రివీల్ చేశారు.
బాహుబలి బడ్జెట్ చాలా రిస్క్ అనిపిస్తోంది. ఈ సినిమా వద్దు ఇక్కడితో ఆపేద్దాం.. షూటింగ్ మొదలు పెట్టి మధ్యలో ఆపేస్తే బాగోదు అని రాజమౌళి నిర్మాతలకు చెప్పారు. మరో ప్రతిపాదన తీసుకువచ్చారు. బాహుబలి ఆపేస్తున్నాం అని ప్రభాస్ కి నేను చెబుతా.. అతడు అర్థం చేసుకుంటాడు. బాక్సింగ్ నేపథ్యంలో మరో అద్భుతమైన కథ ఉంది. దానికి ఇంత బడ్జెట్ అవసరం లేదు. ఆ కథతో ప్రభాస్ తో మూవీ చేద్దాం అని రాజమౌళి చెప్పారట. కానీ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. రాజమౌళి ప్రతిపాదనని ఒప్పుకోలేదు.
మనం బాహుబలినే చేద్దాం.. డబ్బు గురించి ఆలోచించొద్దు. రిస్క్ అయినా పర్వాలేదు. ఒక అద్భుతమైన చిత్రం చేయాలి అని అడిగారట. నిర్మాతలే ధైర్యంగా ఉండడంతో అప్పుడు రాజమౌళి కూడా అంగీకరించారు. ఆ విధంగా రిస్క్ చేసి బాహుబలితో అద్భుతం చేసారు. అయితే రాజమౌళి దగ్గర ఉన్న ఆ బాక్సింగ్ కథ ఏమైనట్లు ? ప్రభాస్ కోసం జక్కన్న ఫ్యూచర్ లో మళ్ళీ ఆ కథని బయటకి తీసే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రారంభానికి ముందు కూడా రాజమౌళి.. ఎన్టీఆర్, రాంచరణ్ లతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ తెరకెక్కిస్తున్నారు అని రూమర్స్ వచ్చాయి.