
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన తెలుగు సినిమానే కాదు, ఇండియన్ మూవీ దశ దిశని మార్చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, గ్లోబల్ ఫిల్మ్స్ వస్తున్నాయంటే అందుకు ఆయనే కారణం. `బాహుబలి` మూవీతో ఆయన చేసిన రిస్క్.. ఎంతో మందికి దారులు చూపించింది. ఇప్పుడు చాలా మంది ఆయన వేసిన దారిలో వెళ్తున్నారని చెప్పొచ్చు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో గ్లోబల్ ట్రోట్ మూవీ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. నవంబర్‌లో దీనికి సంబంధించిన అప్ డేట్ రాబోతుంది. హాలీవుడ్ మూవీ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు, వీడియోలు మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇదిలా ఉంటే శుక్రవారం రాజమౌళి తన 52వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాజమౌళి తాను రూపొందించిన చాలా సినిమాల్లో అలా తళుక్కున మెరిశారు. క్లైమాక్స్ లో అలా కొన్ని సెకన్లపాటు మెరవడం జరుగుతూనే ఉంది. తాను డైరెక్ట్ చేయని `రెయిన్ బో`, `మజ్ను`, `కల్కి 2898 ఏడీ` చిత్రాల్లో కూడా కనిపించారు. ప్రభాస్ `కల్కి`లో కాసేపు మెరిసి ఆయనకే వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాదు, బుల్లితెరపై కూడా మెరిశారు. రాజమౌళి ఓ సీరియల్‌లో నటించారు. కేవలం క్యామియోగా కొన్ని సెకన్లపాటు మెరవడం కాదు. ఏకంగా ఆయన ఓ ఎపిసోడ్‌లోనే నటించారు.
జక్కన్న నటించిన ఏకైక సీరియల్ `యువ`. ఇది మా టీవీలో ప్రసారం అయ్యింది. ఇందులో రాజమౌళి ఆల్మోస్ట్ ఒక హీరో రేంజ్ క్యారెక్టర్ చేశారు. అంతేకాదు యాంకర్ రష్మి గౌతమ్‌కి లవర్‌గా కనిపించారు. రష్మి ఇందులో రేడియో జాకీగా చేస్తుంది. ఆమెకి రేడియో ద్వారా రాజమౌళి పరిచయం అవుతారు. అది కాస్త ప్రేమ వైపుకు దారితీస్తుంది. ఓ రోజు ఈ ఇద్దరు మీట్ అవుతారు. ఆయా సీన్లల్లో రాజమౌళి నటించారు. ఒకటి రెండు ఎపిసోడ్లలో ఆయన నటించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు ఆ మధ్య వైరల్ అయ్యాయి. ఇందులో రాజమౌళిని చూసి రష్మి ఫిదా అవ్వడం, ఆయనతో మాట్లాడేందుకు సిగ్గుపడటం, అంతేకాదు జింతాకా జింతాకా అంటూ స్టెప్పులేయడం విశేషం. ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడుకున్నారు.
ఇందులో రాజమౌళిని ఫస్ట్ టైమ్ చూడగానే మెలికలు తిరుగుతుంది రష్మి, ఫస్ట్ క్రష్ లాగా, ఫస్ట్ మీట్‌లో ఆమె చాలా టెన్షన్ పడుతుంది. `నేను ఇది నమ్మలేకపోతున్నా` అని రష్మి అంటే, `ఫర్వాలేదు నమ్మొచ్చు` అని సింపుల్‌గా చెప్పేస్తాడు రాజమౌళి. `ఇన్ని రోజులు నాతో మాట్లాడుతున్నది మీరా?` అని రష్మి అడగ్గా, `రోజులు కాదు, గంటలు, అరగంటకోసారైనా మాట్లాడాలి కదా. కుచ్ కుచ్ హోతా హై, నీకు తెలుసు కదా. అవును నేను అంకుల్ అయితే ఏం చేసేదానివి` అని అడుగుతాడు రాజమౌళి, ఆంటీ అయ్యేదాన్ని అని రష్మి సమాధానం చెప్పడం విశేషం.
దీనికి దెబ్బకి షాక్ తిన్న జక్కన్న `అబ్బా రేడియోలోనే కాదు, బయట కూడా బాగానే మాట్లాడుతున్నావే` అంటూ పంచ్ వేస్తాడు. దీనికి `ఇంకా బాగా మాట్లాడతా` అని చెబుతుంది రష్మి. అంతటి ఆగలేదు, నాకు సిగ్గేస్తుందంటూ మెలికలు తిరుగుతుంది. నాకు తొందరగా ఉందంటాడు రాజమౌళి. అప్పుడే వెళ్లాలా అని రష్మి అంటుంది. ఏ వెళ్లనివ్వవా అంటే ఫీలింగ్ షైగా ఉంది అని చెబుతుంది. రాజమౌళి చేయిపై చేయి పెట్టి సిగ్గుపడుతుంది. తెలుస్తూనే ఉందంటూ, చెప్పు అంటాడు ప్రేమగా రాజమౌళి. తప్పదా అంటుంది రష్మి. తప్పదు అంటాడు జక్కన్న. దీంతో తలసైడ్‌కి తిప్పి కళ్లు మిటమిట కొడుతుంది. ఇది అర్థం కాని రాజమౌళి ఏంటి కళ్లు మండుతున్నాయా? అంటాడు. దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన రష్మి, షటప్ దాని అర్థం ఐ లవ్యూ, నీకు కూడా తెలియదా? అని కేఫ్‌లో అందరి ముందు గట్టిగా అరుస్తుంది, దెబ్బకి బిత్తరపోయి చూస్తాడు రాజమౌళి. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో మధ్యలో ఇద్దరు కలిసి పాట కూడా పాడుకోవడం విశేషం. ఈ వీడియో క్లిప్ ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది. ఇదే కాదు `చంద్రముఖి` అనే సీరియల్ 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాసేపు గెస్ట్ గా బుల్లితెరపై కనిపించారు జక్కన్న. ఒక ఎపిసోడ్‌ని తనే డైరెక్ట్ చేశాడు. ఈ క్రమంలో కాసేపు అలా తళుక్కున మెరిశారు. ఇలా కొన్ని షోస్, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌లోనూ కనిపించారు. అయితే రాజమౌళి పూర్తి స్థాయిలో యాక్టర్‌గా మారి నటించిన సీరియల్ మాత్రం `యువ` అనే చెప్పాలి. ఇది 2008లో మాటివీలో ప్రసారమైంది.