
యంగ్ హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం'. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయారు. నెలన్నర వ్యవధిలో ప్రియదర్శి నుంచి వస్తున్న రెండవ చిత్రం సారంగపాణి జాతకం. మార్చిలో ప్రియదర్శి కోర్ట్ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీనితో సారంగపాణి జాతకం చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడిగా రూప కొడువాయుర్ నటించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, వైవా హర్ష, తనికెళ్ళ భరణి లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి జాతకాల పిచ్చి ఉండే యువకుడిగా నటించారు. వినోదం ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం నేడు ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సారంగపాణి జాతకం చిత్రం ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉందా, ఎంతమేరకు నవ్వించగలిగారు లాంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
సారంగపాణి(ప్రియదర్శి) కార్ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు. అతడికి మైథిలి (రూప కొడువాయుర్) అనే అమ్మాయి మేనేజర్ గా ఉంటారు. మైథిలి అంటే సారంగపాణికి ప్రేమ ఉంటుంది. ఆమె ప్రాక్టికల్ గా, లాజికల్ గా ఉండే అమ్మాయి. సారంగపాణికి మాత్రం జాతకాలంటే పిచ్చి ఉంటుంది. మైథిలి కూడా సారంగపాణిని ప్రేమిస్తుంది. దీనితో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. నిశ్చితార్థం జరుగుతుంది. ఇక పెళ్ళికి రెడీ అవుతున్న టైంలో సారంగపాణి జీవితంలో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.
ఒకరోజు పబ్ లో జాతకాలు చెప్పే హస్త సాముద్రిక నిపుణుడు అయిన జిగేశ్వరానంద ( శ్రీనివాస్ అవసరాల) సారంగకి పరిచయం అవుతాడు. అతడు సారంగపాణి చేయి చూసి నువ్వు భవిష్యత్తులో ఒక క్రైమ్ చేస్తావని చెబుతాడు. సారంగపాణికి జాతకాలపై విపరీతమైన నమ్మకం. దీనితో జిగేశ్వరానంద చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని భయపడుతుంటారు. ఆ భయంతోనే తన పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటాడు. పెళ్లి తర్వాత ఆ క్రైమ్ చేసి సమస్యల్లో చిక్కుకునే బదులు పెళ్ళికి ముందే చేసేసి పరిష్కరించుకుంటే బెటర్ అని సారంగ భావిస్తాడు.
సారంగపాణి చేయబోయే క్రైమ్ ఏంటి ? ఈ క్రమంలో సారంగపాణికి ఎదురైన సమస్యలు ఏంటి ? వెన్నెల కిషోర్ ఎలా సాయం చేశాడు? ఈ క్రమంలో బడా వ్యాపార వేత్త అహోబిల్ రావు( తనికెళ్ళ భరణి)ని సారంగపాణి ఎందుకు కలవాల్సివచ్చింది ? ఫైనల్ గా జిగేశ్వరానంద చెప్పిన జాతకం ఏమైంది ? లాంటి అంశాలు వెండితెరపైనే చూడాలి.
విశ్లేషణ :
జాతకాలని అతిగా నమ్మితే ఎంత ప్రమాదం అనే మంచి సందేశాన్ని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి చక్కటి హాస్యంతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పాల్సి వస్తే డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గారిటీ అవసరం లేకుండా మంచి కామెడీ పండించారు. ఈ సినిమాలో వినోదం కథలో భాగంగానే ఉంటుంది. కొన్ని సిల్లీగా అనిపించే సీన్లు ఉంటాయి కానీ అవి సపరేట్ గా పెట్టిన ట్రాకులు కాదు. కథలో భాగంగా ఉంటాయి. పది నిమిషాల లోపే సినిమాలో నవ్వుల జాతర మొదలవుతుంది.
మోహన్ కృష్ణ ఇంద్రగంటికి తెలుగుపై ఉన్న పట్టు ఆయన రచనలో కనిపిస్తుంది. తన జాతకం నిజం కావడం కోసం మర్డర్ చేయాలని హీరో డిసైడ్ కావడం కన్విన్సింగ్ గా అనిపించదు కానీ దాని చుట్టూ అల్లిన హాస్యం బావుంది. శ్రీనివాస్ అవసరాల ఎంట్రీతోనే కథలో మలుపు చోటు చేసుకుంటుంది. మర్డర్ చేయాలని ప్రియదర్శి నిర్ణయిచుకోవడం, దానికి వెన్నెల కిషోర్ సాయం చేయడం లాంటి సన్నివేశాలు థియేటర్ లో నవ్వులు కురిపిస్తున్నాయి.
ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కలసి వేసే ప్లాన్స్, దానికోసం తిప్పలు పడే విధానం చాలా బావుంటుంది. ప్రస్తుతం యువత గురించి,సోషల్ మీడియా పోకడల గురించి ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన డైలాగ్స్ తో సెటైర్లు వేశారు. పాత్రల్ని ఒక్క చోటికి చేర్చి నవ్వులు పండించడం ఇంద్రగంటి స్టైల్. ఈ చిత్రంలో కూడా అదే చేశారు. కథ వైజాగ్ కి షిఫ్ట్ అయ్యాక పాత్రలన్నీ ఒక్క చోటికి చేరుతాయి.
సెకండ్ హాఫ్ లో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ లకి వైవా హర్ష తోడవుతాడు. దీనితో హాస్యం మరింత ఎక్కువవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య దూరం పెంచిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని ఎమోషనల్ గా మార్చుతాడు అని అనుకుంటే అక్కడ కూడా హాస్యమే ఉంటుంది. స్టోరీ ముందుగా ఊహించేందుకు వీలుగానే ఉంటుంది. కానీ అందులో వచ్చే హాస్యం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ని పర్వాలేదనిపించే విధంగా దర్శకుడు ఎండ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిస్తుంది.
నటీనటులు :
కోర్ట్ చిత్రంలో సీరియస్ లాయర్ గా కనిపించిన ప్రియదర్శి.. వెంటనే ఈ చిత్రంలో కంప్లీట్ ఫన్ రోల్ లో నటించి మెప్పించారు. కోర్ట్ చిత్రానికి, ఈ చిత్రానికి అవసరమైన వేరియషన్ ని ప్రియదర్శి ప్రదర్శించిన విధానం అద్భుతం. ప్రియదర్శి కామెడీ టైమింగ్ ఈ చిత్రానికి హైలైట్. ప్రతి సన్నివేశాన్ని ఎంగేజింగ్ గా మార్చడంలో ప్రియదర్శి పాత్ర ఎంతైనా ఉంది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్ర సెకండ్ హీరో తరహాలో ఉంటుందని సినిమాకి ముందే ప్రియదర్శి చెప్పారు. దాదాపుగా అదే నిజం అని చెప్పొచ్చు.
ఎందుకంటే వెన్నెల కిషోర్ సినిమాలో దాదాపు ప్రతి సన్నివేశంలో ఉంటారు. ప్రియదర్శితో కలసి వెన్నెల కిషోర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వెన్నెల కిషోర్ ఇచ్చే హావభావాలు, తనకి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి.
హీరోయిన్ రూప కొదువాయుర్ అందంగా కనిపించడంతో పాటు తన పాత్ర మేరకు బాగానే నటించి మెప్పించింది. వైవా హర్షకి కూడా నవ్వులు పండించే పాత్రే దొరికింది.వైవా హర్ష సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తారు. ఇక శ్రీనివాస్ అవసరాల, తనికెళ్ళ భరణి కూడా బాగానే చేశారు.
టెక్నీషియన్లు :
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రం కోసం రాసుకున్న ఫన్ సీన్స్, డైలాగ్స్ చాలా బావున్నాయి. తెలుగు భాషపై తనకి ఉన్న గ్రిప్, సున్నితమైన అంశాలతో ఫన్ జనరేట్ చేసే బలాన్ని మరోసారి మోహన్ కృష్ణ ఇంద్రగంటి నిరూపించుకున్నారు. వివేక్ సాగర్ సంగీతం బాగానే ఉంది. కథకి అవసరమైనట్లుగా అయన బిజియం ఇచ్చారు.
నిర్మాణ విలువలు బావున్నాయి. పిజి విందా సినిమాటోగ్రాఫర్ గా మంచి విజువల్స్ రాబట్టారు. ఎడిటింగ్ కూడా కూడా బావుంది. సెకండ్ హాఫ్ పై దర్శకుడు ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. హెల్దీ కామెడీ అందించి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే విధంగా ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నారు.
ఫైనల్‌గా : డబుల్ మీనింగ్, వల్గారిటీకి తావు లేకుండా ప్రేక్షకులు సారంగపాణి జాతకం చిత్రంలో క్లీన్ కామెడీని ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్ : 3/5