Premalu Review: `ప్రేమలు` తెలుగు వెర్షన్‌ రివ్యూ, రేటింగ్‌..

First Published | Mar 8, 2024, 1:03 AM IST

మలయాళంలో దుమ్ములేపుతున్న `ప్రేమలు` చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలైంది. డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. మలయాళంలో లాగే తెలుగు ఆడియెన్స్ ని అలరించిందా అనేది చూద్దాం. 

మలయాళ సినిమాలు సింపుల్‌ కంటెంట్‌తో వచ్చి పెద్ద హిట్‌ అవుతున్నాయి. సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నాయి. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు డబ్‌ తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. తాజాగా బాగా ట్రెండింగ్‌లో ఉన్న మూవీ `ప్రేమలు`. దర్శకుడు గిరీష్‌ ఏడి రూపొందించిన ఈ చిత్రం గత నెలలో మలయాళంలో విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. కేవలం మూడు కోట్లతో రూపొంది ఏకంగా 90కోట్లు వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇది హైదరాబాద్‌ బేస్డ్ గా సాగే లవ్‌ ఎంటర్‌టైనర్‌ కావడం విశేషం. అందుకే ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మార్చి 8)న ఈ మూవీ తెలుగులో అదే పేరుతో విడుదలైంది. మరి తెలుగు వెర్షన్‌ ఎలా ఉంది, మన ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
సచిన్‌(నాస్లెన్‌ కె గపూర్‌) కేరళాకి చెందిన కుర్రాడు. ఫారెన్‌ వెళ్లాలని ప్రయత్నించగా వీసా రిజెక్ట్ అవుతుంది. దీంతో ఫ్రెండ్‌ సలహా మేరకు హైదరాబాద్‌లో గేట్‌ కోచింగ్‌ తీసుకోవాలని నిర్ణయించుకుని ఫ్రెండ్‌ అముల్‌(సంగీత్‌ ప్రతాప్‌)తో కలిసి సిటీకి వస్తాడు. తన ఫ్రెండే లెక్చరర్‌ గా పనిచేసే కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ అవుతారు. మరోవైపు రీనూ(మమితా బైజు) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొత్తగా జాబ్‌లో చేరుతుంది. అక్కడ ఆది(శ్యామ్‌ మోహన్‌) తనకు క్లోజ్‌ అవుతాడు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా మూవ్‌ అవుతారు. వీళ్ల ఫ్రెండ్‌ పెళ్లికి ఆంధ్రాకి వెళ్తారు. మరోవైపు సచిన్‌, అముల్‌ కూడా తమ ఫ్రెండ్‌ లెక్చరర్‌ పెళ్లికి అక్కడికే వెళ్తారు. రీనూ వాళ్ల ఫ్రెండ్‌ మ్యారేజ్‌ సచిన్‌ వాళ్ల లెక్చరర్‌తో పెళ్లి. దీంతో అంతా అక్కడ కలుసుకుంటారు. ఆ పెళ్లిల్లో తొలి చూపులోనే రీనూకి పడిపోతాడు సచిన్‌. తన కుళ్లు జోకులతో రీనూ, ఫ్రెండ్‌ కార్తీకలను బాగా నవ్విస్తుంటాడు. వారికి దగ్గరవుతాడు. కానీ ఇది చూసిన ఆదికి ఇదంతా నచ్చదు. అసూయ పడుతుంటాడు. పెళ్లి అయిపోయాక సచిన్‌, అముల్‌ కార్‌లోనే రీనూ, కార్తీక వస్తారు. అలా మరింత దగ్గరవుతారు. హైదరాబాద్‌కి వచ్చాక ఫోన్లు చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ల ఫ్లాట్‌కి దగ్గరలోనే వీళ్లు కూడా రెంట్‌కి తీసుకుని ఉంటూ తరచూ కలుస్తుంటారు. రీనూపై ప్రేమని మరింత పెంచుకుంటాడు సచిన్. ఇది చూసి ఆది మరింత అసూయ పెంచుకుంటాడు. ఓ ట్రిప్‌లో అది మరింతగా పెరుగుతుంది. తనకోసం రీనూ చాలా చేస్తుండటంతో ప్రేమతోనే చేస్తుందని భావిస్తాడు సచిన్‌. దీంతో ఎట్టకేలకు కంప్యూటర్‌ సెంటర్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు. కానీ రీనూ నో చెబుతుంది. ఇదంతా వర్కౌట్‌ కాదని చెబుతుంది. దీంతో మరింత డిజప్పాయింట్‌ అవుతాడు సచిన్‌. మరి ఆ తర్వాత ఏంజరిగింది? వీరిద్దరు విడిపోయారా? మళ్లీ కలిశారా? ఆది.. సచిన్‌ని ఏం చేశాడు? ఈ లవ్‌ స్టోరీ ఎలాంటి మలుపుతిరిగింది. రీనూ మనసులో సచిన్‌ ఉన్నాడా? ఆది ఉన్నాడా? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
మలయాళ సినిమాలంటే కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌. కంటెంట్‌తో మెప్పిస్తారు. ఆర్టిస్ట్ ల కంటే కంటెంటే మాట్లాడాలనుకుంటారు. అలానే సినిమాలుంటాయి. అందుకే వాటికి ఎక్కడైనా ఆదరణ దక్కుతుంది.యూనివర్సల్‌ కాన్సెప్ట్ చిత్రాలకు మరింత ఆదరణ దక్కుతుంది. ఇటీవల ఏ భాషలో సినిమా హిట్‌ అయినా, చాలా వరకు వారం రెండు వారాల గ్యాప్‌తో ఇతర భాషల్లో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నారు. అలా చాలా సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి. అలానే `ప్రేమలు` మూవీని కూడా తెలుగులో డబ్‌ చేసి ఈశుక్రవారం విడుదల చేశారు. అయితే మలయాళంలో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. ఇక్కడ అంతటి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మలయాళ వెర్షనే తెలుగు ఆడియెన్స్ బాగా చూడటం విశేషం. ఇక సినిమా విషయానికి వస్తే కేరళ కుర్రాళ్లు హైదరాబాద్‌లో ఉండటం, వారి మధ్య ప్రేమ, ఎలాంటి మలుపులు తిరిగింది. ఈ క్రమంలో ఎలాంటి ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది `ప్రేమలు` కథ. సింపుల్‌ స్టోరీ. కానీ చాలా డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ కావడం విశేషం. కేరళా వాళ్లు హైదరాబాద్‌లో ప్రేమించుకుంటే అది వినడానికి, చూడ్డానికి భలే ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ ప్లేని చాలా డిఫరెంట్ గా, అదే సమయంలో ఆ క్లిష్టమైన విషయాన్ని చాలా సింపుల్‌ వేలో చెప్పడం ఈ సినిమా ప్రత్యేకత. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అదే ఆయన ప్రతిభకి నిదర్శనంగా నిలిచింది. 

సినిమా చాలా ఫన్నీ వేలో సాగుతుంది. ప్రారంభం నుంచి ఆ ఫన్‌ జనరేట్‌ అవుతూనే ఉంటుంది. ఓ కుర్రాడు స్కూల్‌ డేస్ లో లవ్‌ లో ఫెయిల్‌ కావడం, చదువు పెద్దగా వర్కౌట్‌ కాకపోవడం, ఏంచేయాలో తోచక హైదరాబాద్‌ రావడం, ఫ్రెండ్ తో రూమ్‌లో పడే కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ చాలా నేచురల్‌గా చూపించాడు దర్శకుడు. అక్కడే ఆయన సక్సెస్‌ అయ్యాడు. ఆయా సీన్లు చూస్తుంటే రియల్‌ లైఫ్‌ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, తప్పితే సినిమా చూస్తున్నామనే ఫీలింగే కలగదు. అదే దర్శకుడి పెద్ద సక్సెస్‌. ప్రారంభమైన కాసేపటికే ఇన్‌వాల్వ్ అయిపోతాం, మనముందే ఆయా సీన్లు జరుగుతున్నట్టుగా ఉంటుంది. డైలాగ్‌లు కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి. మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టు, బ్యాచ్‌లర్‌ రూమ్‌లో ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలే ఇందులో వాడారు. వాటిని అంతేసహజంగా పలకడం కూడా సినిమా మరింతగా ఆకట్టుకోవడానికి, ఆ హ్యూమర్‌, ఫన్‌ వర్కౌట్‌ కావడానికి మెయిన్‌ రీజన్‌. యాసలు, ప్రాసలంటూ ప్రయోగాలు చేయలేదు, కుర్రాళ్లు సరదాగా వాడుకునే పదాలనే వాడారు. పైగా నేటి ట్రెండీ తగ్గ డైలాగ్‌లు ఉండటం విశేషం. సినిమాకి డైలాగ్‌లు మరో పెద్ద అసెట్‌. కామెడీ అంతే బాగా వర్కౌట్‌ కావడంలో డైలాగ్‌ల పాత్రకి మేజర్‌ రోల్‌ ప్లే చేస్తుంది. సరదాగా మాట్లాడుకునే మాటలు, పంచ్‌లు, సెటైర్లు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. అడుగడుగున ఈ హ్యూమర్‌ వర్కౌట్‌ అయ్యింది. ఆడియెన్స్ ని హిలేరియస్‌గా నవ్విస్తుంది. 
 

దీనికితోడు సచిన్‌, రీనూ లవ్‌ స్టోరీ తీసుకెళ్లిన తీరు కూడా మ్యాజికల్‌గా ఉంటుంది. అదేదో సీరియస్‌గా ఉండదు, అందులోనూ కామెడీకే పెద్ద ప్రయారిటీ ఇచ్చాడు. లవ్‌ బ్రేకప్‌ అయినా అందులోనూ హ్యూమర్‌ జనరేట్‌ చేయడం విశేషమనే చెప్పాలి. దర్శకుడి ఫైనెస్ట్ థింకింగ్‌కి ఇది నిదర్శమవుతుంది. నవ్విస్తూ నవ్విస్తూ లవ్‌ ఫీల్‌తో ఫీల్‌ గుడ్ గా మార్చాడు. ఫ్రెండ్స్ సచిన్‌, అముల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. హీరోయిన్ తో కంటే వీరిద్దరి కాంబోనే హిలేరియస్‌గా ఉంటుంది. సినిమాలో డైలాగులు ట్రెండీగాఉన్నా ఎలాంటి వల్గారిటీ ఉండదు. చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటుంది. హుందాగా ఉంటాయి. చిలిపిగా ఉంటాయి. చివరి వరకు నవ్విస్తూ, చివర్లో లవ్‌ ఎమోషన్స్ తో కాస్త హృదయాన్ని గిలిగింతులు పెట్టించి ఆఫీల్‌ గుడ్‌తో సినిమాని ముగించడం విశేషం. అయితే సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్‌ అయ్యారు. ఎయిర్‌ పోర్ట్ వెళ్లేసమయంలో ఆది టీమ్‌ వెంటపడటం అంతగా సింక్‌ కాలేదు. కానీ హిలేరియస్‌గా నవ్వించింది. మధ్య మధ్యలో సినిమా స్లో అవుతుంది. రొటీన్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. కానీహ్యూమర్‌ దాన్ని డామినేట్‌ చేస్తుంది. 
 

నటీనటులుః
చాలా వరకు అప్‌కమింగ్‌ కుర్రాళ్లే నటించారు. కానీ పాత్రలో జీవించారు. నటుల కంటే ఆ పాత్రలే మనకు కనిపిస్తాయి. సచిన్‌గా నాస్లెన్‌ కె గఫూర్‌ అదరగొట్టాడు. చిలిపి కుర్రాడిలా జీవించాడు. ఆద్యంతం నవ్వించారు. మధ్య మధ్యలో గిలిగింతలుపెట్టించాడు. ఇక ఫ్రెండ్‌ అముల్‌ పాత్రలో సంగీత్‌ ప్రతాప్‌ కామెడీ కూడా అదిరిపోయింది.ఈ ఇద్దరి కాంబినేషన్‌ మాత్రం సినిమాకి పెద్ద అసెట్‌. అలాగే రీనూగా మమితా బైజు మరింత మెప్పించింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది. తనదైన నటనతో మెప్పించింది. ఫేస్‌ ఎక్స్ ప్రెషన్స్ తోనే కట్టిపడేసింది. ఆది పాత్రలో శ్యామ్‌ మోహన్‌ ఆద్యంతం నవ్వులు పూయించాడు. మరో మెయిన్‌ హైలైట్‌ రోల్‌ శ్యామ్‌ది. బాగా చేశాడు. మాత్యూ పాత్ర కూడా కాసేపు నవ్విస్తుంది. మిగిలిన పాత్రలు సైతం ఉన్నంతలో బాగున్నాయి, బాగా సెట్‌ అయ్యాయి. సినిమాకి ఆర్టిస్టులు పెద్ద పిల్లర్‌. 
 

టెక్నీషియన్లు..
`ప్రేమలు` సినిమాకి సంగీతం పెద్ద అస్సెట్‌. విష్ణు విజయ్‌ వినసొంపైన, హృదయాన్ని టచ్‌ చేసే సంగీతం అందించారు. బీజీఎం కూడా అంతే కూల్‌గా ఉంది. సినిమాని అలా మన హదయాల్లోకి వెళ్లిపోయేలా చేస్తుంది. కెమెరా వర్క్‌ బాగుంది. అజ్మల్‌ సాబు విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. హైదరాబాద్‌ని తెలుగు డైరెక్టర్లు కూడా చూపించనంత అందంగా చూపించారు. హైదరాబాద్‌లో తిరిగే వారికి కూడా అరే భలే అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ఈ సినిమ కంటెంట్‌ నచ్చి నిర్మించాడు హీరో ఫహద్‌ ఫాజిల్‌. నిర్మాణ క్వాలిటీ కనిపిస్తుంది. ఇక దర్శకుడు గిరీష్‌ ఏడీ రాసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే హైలైట్‌. దీనికితోడు తెలుగు డైలాగ్‌లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. కొంత బోర్‌, రొటీన్‌, లాజిక్‌ లెస్‌ సీన్లు నెగటివ్‌గా మారతాయి. మరోవైపు ఇది యూత్‌కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. అందరు ఆడియెన్స్ కి నచ్చడం కష్టం. 

ఫైనల్‌గాః `ప్రేమలు` నవ్విస్తూ ఫీల్‌ గుడ్‌ లవ్‌ని పరిచయం చేసే చిత్రం. యూత్‌ ని ఆకట్టుకునే మూవీ. 

రేటింగ్‌ః 3
 

Latest Videos

click me!