poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ

First Published Nov 19, 2021, 10:02 PM IST

వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

చిత్ర పరిశ్రమలోకి వస్తోన్న కొత్త దర్శకుల్లో కసి ఉంటుంది. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి తిరిగి వేసారి పోతారు. అలాంటి సమయంలో దర్శకుడిని నమ్మి సినిమా తీశాడంటే నిర్మాతని అభినందించాల్సిందే. అదే సమయంలో వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అనుభవ లేమి కనిపించినా దర్శకుడిగా చాలా వరకు సక్సెస్ అవుతుంటారు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. సినిమాల్లో పోస్టర్‌ అనే పదానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. అలాంటి క్యాచి టైటిల్‌తో చేసిన చిత్రమిది. విజయ్‌ ధరన్‌, రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

కథః

 సిద్దిపేట(తెలంగాణ)కి చెందిన శ్రీను(విజయ్‌ ధరన్‌) ఆవారాగా తిరుగుతూ ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి పనిచేస్తున్న ఒక థియేటర్ ఓనర్ అయిన పెద్దారెడ్డి కూతురు మేఘన(అక్షత)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శ్రీను. అది తెలుసుకోలేని పెద్దారెడ్డి.. శ్రీనులోని ధైర్యసాహసాలు నచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకుని అతనితో సెటిల్మెంట్స్ చేయిస్తుంటాడు. శ్రీను తన కూతురినే లవ్‌ లో పడేశాడనే విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తన మనుషులతో అతని ఇంటిపై దాడి చేస్తాడు. శ్రీనుపై, వారి తల్లిదండ్రులపై పెద్దారెడ్డి దాడి చేసి ఊరంది ముందు వారి పరువు తీస్తారు. దీంతో అవమానంగా ఫీలైన రామస్వామి తన కొడుకుని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. అలా బయటకు వెళ్లిన శ్రీను లైఫ్ ఎలా మారిపోయింది? సెటిల్మెంట్ వల్ల శ్రీను తెలుసుకుంది ఏంటి.? సెకండ్ హాఫ్ లో వచ్చే తులసి (రాశి సింగ్) పాత్ర ఏంటి.? మరి మేఘనతో శ్రీను ప్రేమకథ ఏ టర్న్ తీసుకుంది? జీరో లాగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీను హీరోలా ఎలా వచ్చాడు అనేది మిగతా కథ.

విశ్లేషణః

నిజానికి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి కథతో చాలా సినిమాలొచ్చాయి. చాలా వరకు సక్సెస్‌ సాధించాయి. అలాంటి కథతో సినిమా అంటే రొటీన్‌ ఫీలింగే ఉంటుంది. కానీ దాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా కొత్తగా  తీర్చిదిద్దడంలోనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. `పోస్టర్‌` సినిమా విషయంలో దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దాడు. సినిమాలోని అసలు ఫ్లాట్‌ని ఓపెన్ చేయకుండా ఆ సస్పెన్స్ ని దాస్తూ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ సరదాగా నవ్విస్తుంది. తండ్రి కొడుకుల బాండింగ్, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, విలేజ్ నేటివిటీ, లవ్, డ్రామా, సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ పార్ట్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్ అవుతుంది. 

అదే సమయంలో ల్యాగ్‌ అనేది సినిమాకి మైనస్‌గా మారింది. చాలా సందర్బాల్లో ల్యాగింగ్‌తో కూడిన సీన్లు ఆడియెన్స్ ని ఇబ్బంది పెడుతుంటాయి. కథ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంటాయి. స్లో నెరేషన్‌ తగ్గించి ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లని మరికాస్త పెంచితే సినిమా మరింతగా ఆకట్టుకునే విధంగా ఉండేది. సెకండాఫ్‌లోనూ స్లో నెరేషన్‌ మరోసారి ఆడియెన్స్ ఓపికని పరీక్షిస్తుంది. అయితే కథని మలుపులు తిప్పిన విధానం కొత్తగా ఉండటంతో ఆడియెన్స్ కి స్లో నెరేషన్‌ మర్చిపోయేలా చేస్తుందని చెప్పొచ్చు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, లవ్‌ ట్రాక్‌ ఆకట్టుకుంటాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు :
శ్రీనుగా హీరో విజయధరన్‌ ఇంటెన్స్ యాక్టింగ్‌తో మెప్పించాడు. సినిమాని రక్తికట్టించడంలో తన వంతు ప్రయత్నం చేశాడు. మొదటి భాగంతో పోల్చితే సెకండాఫ్‌లో మరింత మెచ్యూర్డ్ గా చేశాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పొచ్చు. రాశి సింగ్ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ గాళ్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయి లుక్ లో కుర్రకారుని బాగా అలరించింది. గ్లామర్ ట్రీట్‌నిచ్చింది.  హీరో తండ్రిగా శివాజీరాజా అదరగొట్టాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత్ర సినిమాకి ప్లస్‌ అవుతుంది. హీరో తల్లిగా నటించిన మధుమణి కూడా తన నేచురల్ నటనతో మెప్పించింది. పెద్దిరెడ్డిగా రామరాజు విలనిజం బాగా పలికించాడు. హీరో ఫ్రెండ్స్ గా రవీందర్ ఓకే అనిపించాడు. 
 

టెక్నీకల్ టీమ్ : 

దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి దర్శకుడిగా తొలి సినిమాని చాలా కసితో చేసినట్టు సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, తాను చెప్పాలనుకున్నది అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. అదే ప్లస్‌ కావడంతోపాటు దీని కారణంగా ఏర్పడిన స్లో నెరేషన్‌ మైనస్‌గా మారింది. కానీ దర్శకుడిగా తన ప్రతిభని అభినందించాల్సిందే. అన్ని రకాల అంశాలను సమపాళ్లలో మేళవించిన తీరు బాగుంది. అక్కడ కొత్త దర్శకుడనే ఫీలింగ్‌ ఉండదు. ఈ సినిమాకి భారీ ప్యాడింగ్‌ ఉండటం ప్లస్. వారిని ఎంచుకోవడంలోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. కథకు, అంతర్లీనంగా ప్రస్తుత సమాజంలో అందరికి కావాల్సిన ఒక సందేశాన్ని అందించారు. సంగీతం అందించిన శాండీ అద్దంకి పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మార్తాండ కె వెంకటేష్ తన ఎడిటింగ్ తో బాగుంది. నిడివి తగ్గిస్తే సినిమా బాగుండేది. కెమెరా మ్యాన్ రాహుల్ విజువల్‌ కట్టిపడేసేలా ఉన్నాయి. 
 

ప్లస్ లుః
సందేశం
దర్శకత్వం
సంగీతం
మెయిన్‌ కాస్టింగ్‌ యాక్టింగ్‌

మైనస్‌లుః
స్లో నెరేషన్‌
నిడివి

ఫైనల్‌ గాః  జీరో నుంచి హీరోగా ఎదిగిన విధానం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
రేటింగ్‌-2.75

నటీనటులు : విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, తదితరులు.  
ఎడిటింగ్ : మార్తాండ కె వెంకటేష్   
కెమెరా : రాహుల్   
సంగీతం శాండీ అద్దంకి  
నిర్మాతలు : టి మహిపాల్ రెడ్డి, ట్ శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి, ఐ జి రెడ్డి.          
రచన - దర్శకత్వం : టి ఎమ్ ఆర్ 

click me!