
సీనియర్ నటుడు శరత్ బాబు నేడు తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(సోమవారం మధ్యాహ్నం) తుదిశ్వాస విడిచారు. అయితే మల్టీ ఆర్గాన్స్ దెబ్బతినడం వల్లే శరత్ బాబు కన్నుమూసినట్టు ఆసుపత్రి వర్గాల నుంచి తెలుస్తుంది. శరత్‌బాబు దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో సేవలందించారు. అనేక పాత్రలు పోషించారు. దాదాపు 300లకుపైగా సినిమాల్లో నటించారు.
శరత్ బాబు అసలు పేరు `సత్యంబాబు దీక్షితులు`. కాన్ఫూర్ నుంచి శ్రీకాకుళం ఆముదాల వలసకి వలస వచ్చారు. అక్కడ ఓ హోటల్‌ని తీసుకుని నడిపించేవారు. అప్పుడు వారిది చాలా పెద్ద కుటుంబం. ఫ్యామిలీలో 14 మంది ఉండేవారట. చిన్న హోటల్‌లోనే ఉండాల్సి వచ్చేంది. చాలా ఇబ్బంది అయ్యేది. పైగా ఒకే హోటలపై ఇంత మంది ఆధారపడటంతో వచ్చేడబ్బులు సరిపోయేవి కాదు. చదువుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఆ సమయంలో శరత్ బాబు స్నేహితుడు రంగసత్యనారాయణ సపోర్ట్ చేశారట.
మొదట రైల్వే క్యాంటీన్‌ని నడిపించారని, ఆ తర్వాత ఓ హోటల్‌ని అద్దెకి తీసుకుని నడిపించారట. కొన్నాళ్లకి దాన్నే కొనుకున్నారట. రాత్రి పూట శరత్‌బాబు స్నేహితుడి ఇంటి మెట్ల మీద కూర్చొని చదువుకునే వారట. శరత్‌బాబు తల్లి లావుగా ఉండటం వల్ల ఆమె పనిచేయలేని స్థితిలో ఉండేవారట. ఆ సమయంలో ఉండటం ఇబ్బంది కావడంతో ఇళ్లు కావాలని అడగ్గా, తన ఇళ్లునే అమ్మానని ఫ్రెండ్ రంగసత్యనారాయణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే ఆ హోటల్ నడిపించే సమయంలోనే నాటకాలు వేయడం ప్రారంభించాడట శరత్‌బాబు. అలా నాటకాలు వేస్తున్న సమయంలో ఓ సారి జి ఆనంద్ అనే సినిమా గాయకుడు ఓ నాటకంలో శరత్‌బాబుని చూసి, మద్రాస్‌కి తీసుకెళ్లి కొంత మంది సినిమా ప్రముఖులకు పరిచయం చేయించారట. ఆయన ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు శరత్ బాబు. 1973లో ఆయన `రామరాజ్యం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. నెమ్మదిగా సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది. డబ్బులు వచ్చాయి. తన సిస్టర్స్ కి మ్యారేజ్ చేయడం, తమ్ముడిని వ్యాపారంలో సెట్ బాధ్యతని శరత్‌బాబే తీసుకున్నారు. మొత్తంగా తన ఫ్యామిలీని బాగా సెటిల్ చేశారు. ఆముదాల వలసలో అమ్మవారి టెంపుల్ అభివృద్ధికి రూ.15వేలు అప్పట్లోనే విరాళంగా ఇచ్చారట. మొత్తంగా శరత్‌బాబుకి గాయకుడు జి ఆనంద్ లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు.
నిజానికి శరత్ బాబు కమిట్ అయ్యింది `కన్నె వయసు` అట, కానీ `రామరాజ్యం` ముందు రిలీజ్ కావడంతో అదే తన తొలి సినిమాగా చెబుతుంటారు. `బంగారు మనిషి`, `పంతులమ్మ`, `మరో చరిత్ర`, `ఇదికథ కాదు`, `మూడు ముళ్ల బంధం`, `రాధాకళ్యాణం`, `సీతా కోకచిలుక`, `తోడు నీడ`, `పులిదెబ్బ`, `సాగరసంగమం`, `సితార`, `స్వాతి`, `అన్వేషణ`, `ఆత్మబలం`, `ఉక్కుమనిషి`, `స్వాతిముత్యం`, `నిప్పులాంటి మనిషి`, `జీవన పోరాటం`, `సంకీర్తన`, `సంసారం ఒక చదరంగం`, `ఆత్మకథ`, `ఆణిముత్యం`, `రక్తాభిషేకం`, `చెట్టుకింద ప్లీడరు`, `అగ్గి రాముడు`, `ఆపద్భాందవుడు`, `హలో బ్రదర్`, `సిసింద్రీ`, `నువ్వు లేక నేను లేను`, `మగధీర`, చివరగా ఆయన ఇప్పుడు `మళ్లీపెళ్లి` చిత్రంలో నటించారు. ఇది ఈ నెల 26న విడుదల కానుంది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించారు.
ఇలా వరుసగా హీరోగా సినిమాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నెగటివ్ రోల్స్ కూడా చేశారు. తెలుగు తమిళ, కన్నడ సీరియల్స్ లోనూ నటించారు శరత్‌బాబు. ఉత్తమ సహాయనటుడిగా మూడునంది అవార్డులను అందుకున్నారు. శరత్‌బాబు మొదట 1974లో నటి రమ ప్రభని వివాహం చేసుకున్నారు. 1988లో విడిపోయారు. ఆ తర్వాత స్నేహ నంబియార్‌ని 1990లో వివాహం చేసుకుని 2011లో విడిపోయారు. రమప్రభని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆస్తి గొడవలు వారిని వెంటాడాయి.దీంతో చాలా డిస్టర్బ్ అయ్యాడు శరత్‌బాబు.