పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటించిన పీరియాడిక్ చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ముగిసింది. కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ చిత్రం నుంచి మధ్యలో తప్పుకున్నారు. మిగిలిన చిత్రాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఏఎం రత్నం ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ తో నిర్మించిన చిత్రం ఇదే. ఐదేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోహినూర్ డైమండ్, మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు పాలన లాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి సంగీతం అందించారు. పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం కావడం, ట్రైలర్, సాంగ్స్ కి టెరిఫిక్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.