Prema Entha Madhuram: అనుని నిలదీసిన బామ్మ.. ఆర్య నమ్మకం నిజమవుతుందా?

First Published | Jun 9, 2023, 7:03 AM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ సంపాదించుకుంటుంది. భర్త ప్రాణాలని రక్షించుకోవడం కోసం భర్తకి దూరమైన ఒక అమాయకపు భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో పిల్లల కోసం గిఫ్ట్ లు కొనలేదని హడావిడి పడుతూ ఉంటారు నీరజ్, అంజలి. అప్పుడే కిందికి వచ్చిన మాన్సీ మిమ్మల్ని చూస్తే జెండే చెప్పిన సామెత గుర్తొస్తుంది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అను లేదు పిల్లలు లేరు ఎందుకు ఈ హడావుడి మనీ వేస్ట్ అంటుంది. బంధాలు విలువ తెలియని నీకు డబ్బులే కనిపిస్తాయి కానీ మాకు దాదా నమ్మకం కనిపిస్తుంది అంటాడు నీరజ్.
 

నాకు బంధాలు విలువ తెలియదు మరి నీకు తెలిసేనా రెండో పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది మాన్సీ. నీరజ్ అన్న దాంట్లో తప్పేముంది అంటూ మాన్సీ ని మందలిస్తుంది శారదమ్మ. ఇంతలో ఆర్య కిందికి రావడంతో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దాదా అని అడుగుతాడు నీరజ్. అను నా పక్కన లేనప్పుడు ఎంత అలంకారమైనా నాకు అందంగా కనిపించదు అని బాధపడతాడు ఆర్య.
 


 నామకరణం అవుతున్నట్లు సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చావు కదా.. మనం పడుతున్న బాధ అను కి తెలిస్తే చాలు కచ్చితంగా వెనక్కి వస్తుంది అంటాడు ఆర్య. ఇచ్చాము దాదా ఒక్క యాడ్ అయినా ఆమె కంటపడితే మనం పడుతున్న యాతన వదినమ్మకు తెలిసి వెంటనే వచ్చేస్తుంది అంటాడు నీరజ్. సరే మనం కూడా వెళ్దాము ముహూర్తం 12 గంటలకు కదా ఈ లోపుగా మనం కూడా అనుని పిల్లలని వెతికి తీసుకువద్దాము అని బయలుదేరతారు ఆర్య వాళ్ళు.
 

 మరోవైపు నామకరణం జరిపించడానికి బామ్మ ఇంటికి పంతులుగారు వస్తారు. పాల్ ప్యాకెట్ అయిపోవడంతో బామ్మ నేను పాల ప్యాకెట్లు తీసుకొని వస్తాను అని బయలుదేరుతుంది అను. షాపుకి వెళ్లి పాల ప్యాకెట్ తీసుకుంటుంటే అక్కడ ఆర్య ఇచ్చిన యాడ్ చూసి షాక్ అవుతుంది. ఇది గాని బామ్మా చూసిందంటే వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని పంపించే ఏర్పాట్లు చేస్తుంది అని భయపడి కంగారుగా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది.
 

నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిపోయిందా.. నన్ను తీసుకువెళ్లే ఏర్పాటు చేస్తున్నారా.. లేకపోతే అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు యాడ్ ఇస్తారు అని మనసులో అనుకుంటుంది అను. మరోవైపు అను వాళ్ళ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు సుబ్బు దంపతులు. ముహూర్తం సమయానికి బుజ్జమ్మ వచ్చేస్తుంది కదా.. రానీ తన పని చెప్తాను ఇలా ఎందుకు చేసావు అంటూ గట్టిగా అడుగుతాను.
 

 పాపం బుజ్జమ్మ లేకుండా ఆర్య సార్ ఎంత బాధ పడుతున్నారో అంటూ బాధపడతారు సుబ్బు దంపతులు. అయినా అన్ని రోజుల తర్వాత వచ్చిన పిల్లని ఏం మందలిస్తాము వచ్చిన తర్వాత మరెటూ వెళ్ళనీయకుండా  జాగ్రత్తగా చూసుకుందాము అనుకుంటారు దంపతులిద్దరూ. మరోవైపు అను కూతురు ఏడుస్తూ ఉంటుంది. తనని ఊరుకోబెట్టటానికి వాకిట్లోకి తీసుకువస్తుంది బామ్మ.
 

 అదే సమయంలో ఇల్లిల్లు వెతుక్కుంటూ జెండే అక్కడికి వస్తాడు. అను ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు. షాక్ అవుతుంది బామ్మ.చూడలేదు అని చెప్తుంది. జెండే వెళ్లిపోబోతుంటే మొన్న కూడా ఒక ఆయన వచ్చారు ఇలాగే అడిగారు ఈరోజు మీరు కూడా అడుగుతున్నారు ఇంతకీ ఆయనకి ఈవిడ ఏమవుతుంది అని అడుగుతుంది బామ్మ.
 

 ఆయన ఆర్య సార్, ఆయన భార్య ఈవిడ. ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు మా ఆర్య సార్ దేవుడు కనీసం పిల్లల్ని కూడా చూసుకోలేదు అని బాధపడతాడు జెండే. ఒకవేళ మీకు కనిపిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే వస్తుంది అను. బయట ఏం చేస్తున్నావ్ బామ్మ పదా లోపలికి వెళ్దాం అంటుంది. ఎన్నాళ్ళని దాక్కుంటావు అంటూ నిలదీస్తుంది బామ్మ.
 

 ఒక్కసారిగా షాక్ అవుతుంది అను. ఆరోజు ఆ బాబు వచ్చినప్పుడు నిజం చెప్పవద్దు అన్నావంటే నీ వైపు ఏదో కారణం ఉంటుందని అడగలేదు. కానీ ఈరోజు మరో వ్యక్తి వచ్చి నీ గురించి వాకబు చేస్తున్నాడు అసలు ఏం జరిగింది నిజం చెప్పమంటుంది బామ్మ. పిల్లలు కనిపిస్తే ఆయన ప్రాణాలు పోతాయి బామ్మ అందుకే ఆయనకి కనిపించకుండా దాక్కుంటున్నాను.
 

 నేను ఆయనకు దూరంగా ఉన్న పర్వాలేదు కానీ ఆయన ప్రాణాలతో ఉండాలి అని చెప్తుంది అను. పిచ్చి పిల్ల సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి కానీ ఇలా పారిపోకూడదు. అయినా అలాంటి దోషం ఏమైనా ఉండి ఉంటే పాపని చూసిన మొదటి రోజే ఆయనకి ఏమైనా అయ్యేది కదా అంటూ నచ్చ చెప్తుంది బామ్మ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Latest Videos

click me!