
ప్రస్తుతం రీమేక్ సినిమాల జోరు తగ్గింది. కానీ కరోనాకి ముందు రీమేక్ చిత్రాల జోరు సాగింది. తమిళం, మలయాళ చిత్రాలు చాలా వరకు తెలుగులో రీమేక్ అయ్యాయి.
బాలీవుడ్ చిత్రాలు కూడా ఇక్కడ రీమేడ్ అయ్యాయి. అలాగే మన సినిమాలు అటు తమిళం, మరోవైపు కన్నడ, హిందీలోకి వెళ్లి అక్కడ కూడా సంచలన విజయాలు సాధించాయి.
కానీ ఇప్పుడు ఓటీటీలు రావడంతో రీమేక్‌లు వర్కౌట్ కావడం లేదు. ఒకేసారి మిగిలిన భాషల్లోనూ విడుదల చేస్తుండటంతో రీమేక్‌ల కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. అయితే ఓ తెలుగు సినిమా మాత్రం అత్యధికంగా 9 భాషల్లో రీమేక్ అయ్యింది. ఆ మూవీ ఏంటో చూద్దాం.
తొమ్మిది భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి ముఖ్య పాత్ర పోషించారు.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు నిర్మించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం 2005లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పట్లో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.
యూత్‌నే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా బాగా మెప్పించింది. అందుకే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో అటు సిద్ధార్థ్, త్రిష స్టార్స్ అయిపోయారు.
ఈ సినిమా కేవలం రెండు కోట్లతో నిర్మించారు ఎంఎస్ రాజు. ఏకంగా పది రెట్లు వసూళ్లని రాబట్టింది. సుమారు రూ.20కోట్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది.
79 సెంటర్లలో యాభై రోజులు, 35 సెంటర్లలో వంద రోజులు ఆడటం విశేసం. ఈ సినిమాతో సిద్ధార్థ్ స్టార్ అయిపోయి తెలుగు సినిమాలకు షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడే ఫోకస్ పెట్టాడు.
ఇక త్రిష స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అంతకు ముందే ఆమెకి `వర్షం`తో మరో బ్లాక్ బస్టర్ పడింది. దానికి ఈ హిట్ తోడు కావడంతో వరుసగా బిగ్ స్టార్స్ తో ఆఫర్లని అందుకుంది.
`నువ్వొస్తానంటే నేనొద్దాంటానా` మూవీ ఆ తర్వాత అనేక భాషల్లో రీమేక్ అయ్యింది. ఇది మొత్తంగా 9 భాషల్లో రీమేక్ కావడం విశేషం. ఇలా తొమ్మిది భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇండియన్ మూవీస్‌లోనే ఈ అరుదైన ఘనత సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ మూవీ సల్మాన్ ఖాన్ నటించిన `మైనే ప్యార్ కియా` ఇన్‌స్పిరేషన్ అంటుంటారు.
కానీ మళ్లీ ఈ మూవీ హిందీలోనూ రీమేక్ అయ్యింది. `రామయ్యా వస్తావయ్యా`(2013) పేరుతో గిరీష్ కుమార్, శృతి హాసన్ జంటగా బాలీవుడ్‌లో రీమేక్ అయ్యింది. అక్కడ పెద్దగా ఆడలేదు.
తమిళంలో జయం రవి, త్రిష కాంబినేషన్‌లో `ఉనక్కుమ్ ఎనక్కుమ్`(2006) పేరుతో రీమేక్ అయ్యింది. అక్కడ పర్వాలేదనిపించుకుంది. కన్నడలో విష్ణు వర్థన్, అనిరుద్ధ్, రక్షిత ప్రధాన పాత్రల్లో `నీనెల్లో నానల్లే`(2006) పేరుతో రీమేక్ అయ్యింది.
అక్కడ హిట్ అయ్యింది. వీటితోపాటు బెంగాలీలో `ఐ లవ్ యూ`(2007), మణిపూరీలో `నింగోల్ తజాబ్`(2007), ఒడియాలో `సునా చదెయ్ మో రూపా చదెయ్`(2009), పంజాబీలో `తేరా మేరా కి రిస్తా`(2009),
బంగ్లాదేశ్‌లో `నిస్సాష్ అమర్ తుమీ`(2010), నేపాలీలో `ది ఫ్లాష్ బ్యాక్‌ః ఫర్కేరా హెర్డా`(2010) గా రీమేక్ అయ్యింది. మిగిలిన అన్ని భాషల్లోనూ బాగానే ఆడింది. ఇలా మన ఇండియన్ లాంగ్వేజెస్‌లోనే కాదు ఇతర దేశాల్లోనూ రీమేక్ కావడం విశేషం.