
జూ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు టాప్ హీరోగా ఎదిగారు. తన ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ఎవరి కెరీర్‌లో అయినా పరాజయాలు కామన్. కానీ కొన్ని కోలుకోలేని దెబ్బ కొడతాయి. ఎందుకు చేశాను రా అనే ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. అదే సమయంలో భారీ నష్టాలను తీసుకొస్తాయి. మరి ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 చెత్త సినిమాలేంటనేది చూస్తే.
ఎన్టీఆర్ కెరీర్ లో టాప్ పరాజయాల్లో మొదటి వరుసలో ఉన్న మూవీ `ఆంధ్రావాలా`. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. వయసుకి మించిన పాత్ర చేశారు. రక్షిత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2004 సంక్రాంతికి విడుదలైంది. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. కమర్షియల్‌గా నిర్మాతకు దారుణమైన నష్టాలను తెచ్చిన చిత్రమిది.
బ్యాక్ టూ బ్యాక్ మరో సంక్రాంతి కూడా ఎన్టీఆర్‌కి కలిసి రాలేదు. 2005లో ఆయన `నా అల్లుడు` అనే సినిమాలో నటించాడు. యాక్షన్ కామెడీ ప్రధానంగా వర ముల్లపూడి రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్, శ్రియా, జెనీలియా హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ అత్తగా కనిపించింది. ఇద్దరు మరదళ్లతో ఎన్టీఆర్ ఆడే ఆట కామెడీగా ఉంటుంది. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో సినిమా తేడా కొట్టింది. నిర్మాతలను నిండా ముంచేసింది.
అలాగే ఎన్టీఆర్‌కి మరో మర్చిపోలేని డిజాస్టర్ ఇచ్చిన చిత్రం `నరసింహుడు`. దీనికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. అమీషా పటేల్, సమీరా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ,యాక్షన్ ప్రధానంగా సాగే ఈ మూవీ కూడా ఆడియెన్స్ కి ఆకట్టుకోలేకపోయింది. రెగ్యూలర్, రొటీన్, ఔట్ డేటెడ్ కథ అనే విమర్శలు వచ్చాయి. ఈ చిత్రం 2005లో మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైంది. తారక్‌కి మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
తారక్ కెరీర్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాల్లో `శక్తి` ఒకటి. ఇందులోనూ ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషించారు. ఫాంటసీ యాక్షన్ మూవీగా రూపొందించారు. మెహెర్ రమేష్ దర్శకుడు. ఈ చిత్రం విషయంలో ఒక ప్రయోగం చేశారు. మొదట అనుకున్న కథ ఒకటి, ఆ తర్వాత తీసిన కథ మరోటి. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సైతం తారక్ కెరీర్‌లో చెత్త సినిమాల జాబితాలో చేరింది. ఈ సినిమా గురించి ఒక ఈవెంట్‌లో ఎన్టీఆరే చెప్పారు. ఈ మూవీ దెబ్బ ఎప్పటికీ మర్చిపోలేనని. ఆ స్థాయిలో ఆయన్ని డిజప్పాయింట్ చేసిందీ సినిమా. 2011 ఏప్రిల్ 1న విడుదలైంది.
ఎన్టీఆర్ టాప్ 5 డిజాస్టర్లలో `రామయ్యా వస్తావయ్యా` చిత్రం కూడా ఉంటుంది. యాక్షన్ కామెడీగా దీన్ని హరీష్ శంకర్ రూపొందించారు. దిల్ రాజు నిర్మించారు. మొదట ఒక కథతో సినిమా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని మార్పులు చేశారు. సినిమా తేడా కొట్టింది. ఇందులో శ్రుతి హాసన్, సమంత హీరోయిన్లుగా నటించారు. క్రేజీ హీరోయిన్లు ఉన్నా, మూవీ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 2013 అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది.