
తెలుగు తెర సోగ్గాడిగా వెలుగొందారు శోభన్ బాబు. ఆయన కుటుంబ కథా చిత్రాలతో ఎక్కువగా ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. మహిళా ప్రేక్షకుల్లో ఆయనకు మించిన ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదంటే అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు కూడా ఈ విషయంలో ఆయన్ని టచ్ చేయలేకపోయారు. అందుకే ఇప్పటికీ సోగ్గాడిగా వెలుగుతున్నారు శోభన్ బాబు. అయితే ఆయన నటించిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో ఒకటి `సోగ్గాడు`. ఈ సినిమాతోనే ఆయనకు `సోగ్గాడు` అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా విడుదలై యాభై ఏళ్లు పూర్తయ్యింది. 1975 డిసెంబర్ 19న ఈ సినిమా విడుదలైంది. శుక్రవారంతో సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
అప్పట్లో ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో జోరుమీదున్నారు. మధ్య మధ్యలో యాక్షన్, కమర్షియల్ మూవీ చేశారు. కృష్ణ కూడా అదే దారిలో ఉన్నారు. ఏఎన్నార్ లవ్ స్టోరీస్, జానపద చిత్రాలతో మెప్పించారు. కృష్ణంరాజు అటు మహిళా ప్రధాన చిత్రాలు, మరోవైపు యాక్షన్ చిత్రాలు చేసి మెప్పిస్తున్నారు. కానీ శోభన్ బాబు ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలు చేస్తూ జోరు మీదున్నారు. అలాంటి సమయంలో ఆయన చేసిన చిత్రమే `సోగ్గాడు`. దీనికి కే బాపయ్య దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ డ్రామాగా ఇది రూపొందింది. ఇందులో హీరోయిన్లు జయచిత్ర, జయసుధ, అంజలిదేవి నటించడం విశేషం. రామానాయుడు నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 19న విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది.
`సోగ్గాడు` మూవీ బాక్సాఫీసు వద్ద మొదటి రోజు నుంచి కాసుల వర్షం కురిపించింది.ఈ మూవీ ఏకంగా 17 సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది. శివాజీ గణేషన్ ముఖ్య అతిథిగా విజయవాడ మున్సిపల్ గ్రౌండ్‌లో వంద రోజుల వేడుకని నిర్వహించారు. ఆ ఈవెంట్‌కి శోభన్ బాబు అభిమానులు, ముఖ్యంగా మహిళా అభిమానులు భారీగా హాజరు కావడం చూసి శివాజీ గణేషన్ ఆశ్చర్యపోయారట. అంతేకాదు శోభన్ బాబు `సోగ్గాడు`తో పోటీ పడి ఎన్టీఆర్, శివాజీ గణేషన్ చిత్రాలు కంగుతిన్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ చిత్తైపోయాడు. ఆ సినిమాలేంటో చూస్తే.
`సోగ్గాడి`కి పోటీగా వచ్చిన ఎన్టీఆర్ మూవీ `ఎదురులేని మనిషి`. ఇందులో ఎన్టీఆర్ కి జోడీగా వాణిశ్రీ నటించింది. కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలైంది. అంటే `సోగ్గాడు`కి వారం ముందే వచ్చింది. అయితే మొదటివారం కాస్త బాగానే ఆడింది. కానీ శోభన్ బాబు మూవీ రావడంతో తగ్గిపోయింది. ఆ సినిమాకి ఆదరణ పెరగడంతో ఎన్టీఆర్ నటించిన `ఎదురులేని మనిషి` సినిమాని థియేటర్ల నుంచి ఎత్తేయాల్సి వచ్చిందట. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే శోభన్ బాబు `సోగ్గాడు` మూవీకి దర్శకత్వం వహించిన కే బాపయ్యనే రామారావు `ఎదురులేని మనిషి` మూవీకి దర్శకుడు కావడం విశేషం. దీంతో తన సినిమాతో తానే పోటీ పడ్డాడు. మొత్తంగా `ఎదురులేని మనిషి` నిరాశ పరిచిందట.
సోగ్గాడుకి పోటీగా శివాజీ గణేషన్ నటించిన రెండు చిత్రాలు వచ్చాయి. డిసెంబర్ 20న `దొంగల్లో మొనగాడు` మూవీ విడుదలైంది. తమిళంలో `ఎన్ మగన్` పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో `దొంగల్లో మొనగాడు` పేరుతో విడుదల చేశారు. మంజుల, రోజా రమణి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వారం డిసెంబర్ 25న `పెద్ద మనిషి` విడుదలైంది. ఇందులో శివాజీ గణేషన్, శారద నటించారు. ఇది కూడా తమిళంలో రూపొందిన మూవీకి డబ్బింగ్ వెర్షన్. ఇది కూడా ఆడలేదు. ఇలా రెండు చిత్రాలతో చిత్తైపోయాడు శివాజీ గణేషన్. అయినా అదేమీ పట్టించుకోకుండా `సోగ్గాడు` వంద రోజుల వేడుకకి ఆయన గెస్ట్ గా హాజరు కావడం విశేషం.