Devara movie review
దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన చిత్రం దేవర. ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ కాగా... అరవింద సమేత వీర రాఘవ 2018లో విడుదలైంది. ఈ క్రమంలో దేవర చిత్రం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు.
కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో ఇది రెండో చిత్రం. గతంలో ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్. ఎన్టీఆర్ ని చాలా కొత్తగా పరిచయం చేశాడు కొరటాల. దర్శకుడు కొరటాల శివ చిత్రాల్లో హీరోలు చాలా సాఫ్ట్ అండ్ స్టైలిష్ గా ఉంటారు. దేవరలో మాత్రం ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా వైల్డ్ గా డిజైన్ చేశాడు.
యూఎస్ లో దేవర ప్రీమియర్స్ ముగిశాయి. సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ఆడియన్స్. దేవర ఫస్ట్ హాఫ్ బాగుంది అనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. దేవర టైటిల్ కార్డుని ఉద్దేశిస్తూ పలువురు నెటిజెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటూ డిజైన్ చేసిన తీరును కొనియాడుతున్నారు. టైటిల్ కార్డు గురించి ఆడియన్స్ రెస్పాండ్ కావడం ఆసక్తికర పరిణామం.
అలాగే ఎన్టీఆర్ ఇంట్రో ఆకట్టుకుందనే వాదన వినిపిస్తోంది. సొర చేపతో సముద్రంలో పోరాడుతూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడట. అయితే ఈ సీన్ ఛత్రపతిలో ప్రభాస్ ఇంట్రో ని తలపించింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ బాగుందని ఆడియన్స్ అభిప్రాయం.
యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని అంటున్నారు. దేవర సినిమాకు ప్రధాన ఆకర్షణ మ్యూజిక్. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. మెజారిటీ ఆడియన్స్ అనిరుధ్ మ్యూజిక్ కి 100 మార్కులు వేస్తున్నారు. అనిరుధ్ బీజీఎమ్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది. అతడు బ్యాక్ బోన్ లా నిలిచాడని అంటున్నారు.
దేవ్, వర పాత్రలలో ఎన్టీఆర్ విభిన్నత చూపించాడు. వర పాత్ర కొంచెం తగ్గిందని అంటున్నారు. జాన్వీ కపూర్ గ్లామర్ మరో ఆకర్షణ. ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంది. మంచి నటన కనబరిచిందని అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ నటన గురించి ప్రేక్షకులు ప్రస్తావిస్తున్నారు.
ఇక సెకండ్ హాఫ్ సైతం ఎంగేజింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. దేవర చిత్రానికి మంచి ముగింపు ఇచ్చాడు. రెండో పార్ట్ కి సెటప్ బాగుందనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి హిట్ పడింది అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.
దేవర మూవీలో మైనస్ లు మాట్లాడుకోవాలంటే... కథ రొటీన్ గానే ఉంటుంది. కొత్తదనం లేదు. అయితే కొరటాల శివ స్క్రీన్ ప్లే పరుగులు పెట్టించడం వలన ఆ భావన కలగదు. అక్కడక్కడా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ నిరాశపరుస్తాయి. ఏమంత క్వాలిటీగా లేవని ప్రేక్షకుల అభిప్రాయం.
మొత్తంగా దేవర చూడదగ్గ చిత్రం. ఫ్యాన్స్ తో పాటు సగటు సినిమా లవర్ ఎంజాయ్ చేస్తాడు. దేవర అంచనాలు అందుకుంది అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. మొత్తంగా దేవర ఈ స్థాయి విజయం సాధిస్తుందో పూర్తి రివ్యూ వస్తే కానీ తెలియదు.
దేవరకు యూఎస్ లో మంచి రెస్పాన్స్ దక్కుతుంది. హిందీలో ఈ మూవీ సత్తా చాటాల్సి ఉంది. పాన్ ఇండియా హీరో ట్యాగ్ సార్థకం చేసుకోవాలంటే బాలీవుడ్ లో దేవర ఆడాల్సి ఉంది. ఓపెనింగ్స్ పరంగా దేవరకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదని తెలుస్తుంది. పాజిటివ్ టాక్ వస్తే పుంజుకుంటుంది. పుష్ప చిత్రానికి సైతం ఫస్ట్ డే కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు వచ్చాయి.
బాలీవుడ్ లో చిత్రాలకు లాంగ్ రన్ ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చితే భాషాబేధం లేకుండా ఆదరిస్తారు. దేవర చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రూ. 400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.