
సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో `అల్లూరి సీతారామరాజు` టాప్‌లో ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అది ఒకటి. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్నెం దొర అల్లూరి సీతారామరాజు ఎవరు అంటూ కృష్ణనే గుర్తొచ్చేంతగా ఆ సినిమాలో, సీతారామరాజు పాత్రలో నటించి రక్తికట్టించాడు కృష్ణ. ఆ పాత్రలో ఆయనలా మరెవ్వరూ నటించలేరు అనేంతగా చేసి మెప్పించాడు. సినిమా చరిత్రలో నిలిచిపోయారు.
ఈ సినిమా చేసే సమయంలో ఎన్టీ రామారావుకి కృష్ణకి మధ్య గొడవ జరిగిందట. ఆ విషయాన్ని బయటపెట్టాడు సూపర్ స్టార్ కృష్ణ. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. మొదట ఈ సినిమా తాను చేస్తున్నానని తెలియగానే రామారావు వద్దు అని చెప్పారట. ఆ సినిమా నువ్వు చేయోద్దు అన్నాడట. అంతేకాదు తాను చేశాక పోటీగా అదే సబ్జెక్ట్ ని తాను చేయాలని పదేళ్లపాటు తిరిగాడట ఎన్టీఆర్. మరి ఇంతకి ఏం జరిగింది, ఎన్టీఆర్ ఎందుకు వద్దన్నారనేది చూస్తే.
అల్లూరి సీతారామరాజు సబ్జెక్ట్ తో దర్శక, నిర్మాతలు కృష్ణ వద్దకు వచ్చారు. స్క్రిప్ట్ బాగా వచ్చింది. సినిమా చేయడానికి చర్చలు నడుస్తున్నాయి.ఈ విషయం ఎన్టీఆర్‌కి తెలిసింది. దీంతో కృష్ణతో మాట్లాడుతూ ఈ సినిమా చేయోద్దు బ్రదర్ అన్నాడట. మీరు చేస్తానంటే నేను చేయను, మీరు చేయండి అని ఎన్టీఆర్‌కి చెప్పాడట కృష్ణ.
నేను చేయను, మీరు చేయోద్దు, ఇది చాలా డ్రై సబ్జెక్ట్, సినిమా ఆడదు, జనాలు చూడరు అని చెప్పారట. దానికి సరే అండి మా డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో చెబుతానని చెప్పాడట. వీళ్లేమో స్క్రిప్ట్ బాగా వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరాల్సిందే అన్నారట. దీంతో బలవంతంగానే `అల్లూరి సీతారామరాజు` చేయక తప్పలేదు కృష్ణ.
ఆ సినిమా విడుదలైంది. ప్రారంభంలో యావరేజ్‌గానే ఆడినా, ఆ తర్వాత పుంజుకుందట. సంచలన విజయం సాధించిందట. దీంతో ఎన్టీఆర్‌కి, కృష్ణకి మధ్య మాటల్లేవు. చాలా కాలంపాటు మాట్లాడుకోలేదట. ఈ సినిమా హిట్ అయ్యిందని తెలిసి ఎన్టీఆర్.. తాను కూడా `అల్లూరి సీతారామరాజు` చేయాలని పదేళ్లపాటు తిరిగాడట. రైటర్స్ ని పిలిపించి మంచి కథ రెడీ చేయండి, తానే డైరెక్ట్ చేస్తానని చెప్పాడట. అయినా స్క్రిప్ట్ రాలేదు.
ఆ సమయంలోనే పరుచూరి బ్రదర్స్ బాగా పేరుతెచ్చుకున్నారు. రైటర్స్ గా మంచి ఫామ్‌లోకి వచ్చారు. ఇండస్ట్రీలో వీరి పేరు బాగా వినిపిస్తుంది. దీంతో వారిని పిలిపించి ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు స్టోరీ రెడీ చేయమన్నారు. దీనికి వాళ్లు `మీరు ఏమనుకోకపోతే ఓ విషయం చెబుతాము.. ఒకసారి మీరు కృష్ణ గారు చేసిన `అల్లూరి సీతారామరాజు` చూడండి.ఆ సినిమా చూశాక సినిమా చేయాలనిపిస్తే మేం రాస్తాము` అన్నారట. ఆ సమయంలో ఓ రోజు షూటింగ్ సమయంలో ఇద్దరు తారస పడ్డారు. ఆ సమయంలో `ఏం బ్రదర్.. మీ అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలి, నాకు మీరు పక్కన ఉండి చూపించాలి అన్నాడట ఎన్టీఆర్.
దీంతో చెన్నైలో సినిమా ప్రింట్లు తెప్పించి మద్రాస్‌లో ఉన్న తమ విజయకృష్ణ థియేటర్లో ప్రదర్శించారట. సగం సినిమా అయ్యాక మూవీ బాగా చేశారని మెచ్చుకున్నారట. సినిమా మొత్తం చూశాక.. ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరు ఈ సినిమా. చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాని మేం తీయాల్సిన పనిలేదు అని చెప్పి కౌగిలించుకున్నారట. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ కి పుల్ స్టాప్ పడిందట.