`దేవర`పై రిలీజ్‌కి ముందే నెగటివ్‌ టాక్‌, అసలు కారణాలివే? అంతిమంగా ఎన్టీఆర్ బలి?

First Published | Sep 13, 2024, 2:57 PM IST

ఎన్టీఆర్‌ నటించిన `దేవర` సినిమాపై విడుదలకు ముందే నెగటివ్‌ ప్రచారం జరుగుతుంది. దానికి కారణాలు తెలిస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. ఆ కారణాలేంటో చూస్తే..
 

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నుంచి సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఆయన `దేవర` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. బాలీవుడ్‌ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది.

మరో రెండు వారాల్లో ఇది ఆడియెన్స్ ముందుకు(సెప్టెంబర్‌ 27న రిలీజ్‌) రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి బాగానే చర్చ జరుగుతుంది. అదే సమయంలో ట్రోల్‌ కూడా నడుస్తుంది. 

`దేవర` ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. పోర్ట్(కోస్టల్‌) ఏరియా ప్రధానంగా సినిమా సాగుతుందని ట్రైలర్‌ని చూస్తే అర్థమయ్యింది. ట్రైలర్‌లోనే సినిమాలోని అసలు కథ చూపించారు దర్శకుడు కొరటాల శివ. ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిపారు. పెద్ద ఎన్టీఆర్‌ దేవర పాత్రలో కనిపిస్తుండగా, కొడుకు ఎన్టీఆర్‌ వర పాత్రలో కనిపిస్తాడట.

పోర్ట్ లో ఎలాంటి అక్రమాలు చేయకూడదని దేవర ఆదేశాలు. సముద్రంలోకి ఎవరైనా తప్పుడు పనుల కోసం వెళితే వాళ్ల అంతు చూస్తాడు దేవర. ఇది విలన్‌ పాత్రధారి అయిన సైఫ్‌ అలీ ఖాన్‌కి నచ్చదు. తనకు అడ్డుగా ఉన్న దేవరని చంపేయాలనుకుంటారు. అది ఎలా చేశారనేది సినిమా. ట్రైలర్లో రెండేళ్లు దేవర పాత్ర మిస్సింగ్‌ అని చెప్పారు.

ఆ తర్వాత వస్తాడని అర్థమవుతుంది. అదే సమయంలో తండ్రిలా కొడుకు ఎన్టీఆర్‌ (వర) ధైర్యవంతుడు కాడు. పిరికిగా ఉంటూ భయపడుతుంటాడు. మరి తనలో వచ్చిన మార్పేంటి? చివరికి ఏం చేశాడనేది సినిమాగా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్‌లోనే అసలు విషయాన్ని రివీల్ చేయడంతో `దేవర`పై ఆడియెన్స్ లో కిక్‌ పోయిందనే కామెంట్స్ సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. 
 


దీనికితోడు సినిమాలో సన్నివేశాలను చూస్తుంటే మరో `ఆంధ్రావాలా` గుర్తొస్తుంది. అందులోనూ ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి పాత్ర అందులో, ఇందులో ఒకేలా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతోపాటు `ఆచార్య` సినిమాతోనూ పోల్చుతున్నారు. రామ్‌ చరణ్‌, సోనూ సూద్‌ పాత్రలు, `దేవర`లో తండ్రి ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ల పాత్రలను తలపిస్తున్నాయని అంటున్నారు.

`ఆంధ్రావాలా 2`, `ఆచార్య 2` ని తెరకెక్కిస్తున్నారని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. కొరటాలపై ప్రధానంగా ఈ ట్రోల్స్ మీమ్స్ వేస్తున్నారు. ఇదే సినిమాపై నెగటివ్‌ ప్రచారానికి కారణమైంది. దీంతో దర్శకుడు కొరటాల మరో ఫ్లాప్‌ మూవీ లోడింగ్‌ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. 
 

ఇంకోవైపు `దేవర` చిత్రంపై రాజకీయ ప్రభావం కూడా ఉందని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడిని సీఎంగా ఉన్న వైఎస్‌ జగన్‌ జైల్లో పెట్టినప్పుడు ఎన్టీఆర్‌ ఖండించలేదు. ఆ సమయంలోనే బాగా విమర్శలు వచ్చాయి. ఆ పరిణామాలతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ వేరుగా విడిపోయారు. తారక్‌పై ట్రోలింగ్‌ నడిచింది.

టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఎన్టీఆర్‌పై విమర్శలు చేశారు. ఈ పరిణామాలతో ఎన్టీఆర్‌కి, నందమూరి, టీడీపి ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం ఉంది. ప్రస్తుతం `దేవర` సినిమా నెగటివ్‌ టాక్‌ కి కూడా ఆ ప్రభావం ఉందని చెబుతున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు సీఎంగా ఎంపికైనప్పుడు ఎన్టీఆర్‌ విషెస్‌ చెప్పారు.

అంతేకాదు ఏపీలో వరదలు విధ్వంసం నేపథ్యంలో యాభై లక్షల విరాళం ప్రకటించారు. ఈ రోజు(శుక్రవారం) ఆ చెక్‌ కూడా ఇచ్చేందుకు చంద్రబాబుని కలవబోతున్నాడని తెలుస్తుంది. ఇది సినిమాకి కలిసొచ్చే అంశం. 
 

ఇంకోవైపు `దేవర` సినిమాపై నెగటివ్‌ ప్రచారానికి రాజమౌళి సెంటిమెంట్‌ మరో కారణం. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాతి సినిమా ఫ్లాప్‌ అనే సెంటిమెంట్‌. అందరు హీరోలకు ఆ సెంటిమెంట్‌ పనిచేసింది. అందులో తారక్‌ కూడా ఉన్నారు. తాను కూడా ఈ కామెంట్‌ చేశారు. `సింహాద్రి` తర్వాత జరిగిన సంఘటనలను

గతంలో పంచకున్నారు తారక్‌. `యమదొంగ` సమయంలోనూ అదే జరిగింది. దీంతో ఆ సెంటిమెంట్‌ ఇప్పుడు తారక్కి తప్పదనే ప్రచారం ఉంది. రాజమౌళితో చేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత తారక్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఆ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఇప్పుడు `దేవర` టీమ్‌ని వణికిస్తుంది. మరి దాన్ని ఎన్టీఆర్‌ బ్రేక్‌ చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరం. 
 

దీనికితోడు ఇటీవల `దేవర` ట్రైలర్‌ ఈవెంట్‌ ముంబయిలో జరిగింది. ఈ ఈవెంట్‌కి మీడియాని ఆహ్వానించారు. క్వచ్చన్‌, ఆన్సర్‌ కార్యక్రమం జరిగింది. కానీ మీడియాతో డైరెక్ట్ ఇంటరాక్షన్‌ కాకుండా స్లిప్‌ల మీద ప్రశ్నలు రాసిస్తే దాన్ని యాంకర్‌ అడుగుతుంది. పైగా ఈ ఈవెంట్‌లో సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లకి ప్రయారిటీ ఇచ్చి, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాని వెనక్కి పంపించారట.

నార్త్ మీడియా దీనిపై గుర్రుగా ఉందని సమాచారం. ఇది కూడా `దేవర` సినిమాపై నెగటివ్‌ ప్రచారానికి కారణమని చెప్పొచ్చు. మొత్తంగా `దేవర` చిత్రంపై నెగటివ్‌ ప్రచారం గట్టిగా జరుగుతుంది. ట్రోలర్స్ ఆడుకుంటున్నారు. ఇది ఎన్టీఆర్‌పై ప్రభావం చూపించబోతుందని చెప్పొచ్చు.

అంతిమంగా ఈ సినిమా రిజల్ట్ దర్శకుడు కొరటాలే కాదు, ఎన్టీఆర్‌కి చాలా ముఖ్యం. తేడా కొడితే దర్శకుడితోపాటు తారక్‌ మార్కెట్‌పై గట్టి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. నెక్ట్స్ ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!