
2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలంగాణలో అత్యంత కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా పేరుతెచ్చుకున్నారు నయీం. భువనగిరిని అడ్డగా చేసుకుని ఆయన సాగించిన కార్యకలాపాలు అంతా ఇంతా కాదు. నక్సల్‌గా ప్రారంభమైన ఆయన జీవితం, పోలీస్ కోవర్ట్ గా మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వణుకు పుట్టించాడు. చివరికి రాజ్యం ఆగ్రహానికి గురై పోలీసులచే ఎన్‌కౌంటర్‌కి గురయ్యారు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన జీవితం ఆధారంగా `నయీం డైరీస్` పేరుతో సినిమా తీసుకొచ్చారు దాము బాలాజీ. నయీంగా `కేజీఎఫ్` ఫేమ్ వశిష్ట సింహా నటించారు. ఈ సినిమా రేపు శుక్రవారం (నవంబర్ 10)న విడుదల కానుంది. ఈ సందర్బంగా మీడియాకి స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూ(Nayeem Diaries Review)లో తెలుసుకుందాం.
కథః
భువనగిరి ప్రధానంగా నయీం టీనేజ్‌గా ఉన్నప్పటి నుంచి సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పటినుంచి నయీం(వశిష్ట సింహా)కి ఆవేశం ఎక్కువ. డేర్ అండ్ డైనమిజం ఆయన సొంతం. ఏదో చేయాలనే తపన. అక్క(యజ్ఞా శెట్టి) అంటే చాలా ఇష్టం. ఆమెని ఎవరు ఏమన్నా వాళ్ల అంతు చూసే వరకునిద్ర పోడు. నయీంలోని ఆవేశం, ధైర్యసాహసాలు, అన్యాయం జరిగితే ఎదురుతిరిగే లక్షణాలు నక్సలైట్ అయిన సోమన్నకి బాగా నచ్చుతాయి. దీంతో తమతో రావాలని కోరగా, నక్సల్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఉద్యమకారుడిగా మారిపోతాడు నయీం. తన డేరింగ్ స్టెప్స్ తో నక్సల్స్ నిర్వహించే పలు ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తాడు. Nayeem Diriaes Review.
హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఐజీని కాల్చిచంపడంలో కీలక భూమిక పోషిస్తాడు. దీంతో నక్సల్స్ లో హీరో అవుతాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఎన్ కౌంటర్ చేయాలని ప్లాన్ చేయగా, ఆ విషయం మానవ హక్కుల నాయకులకు తెలియడంతో నయీంని ఎన్‌కౌంటర్ చేయకుండా జైలుకి తరలిస్తారు. నక్సల్స్ ఉండే బరాక్‌లో నయీంని ఉంచగా, అక్కడ చాలా మంది నక్సల్స్ పరిచయం అవుతాడు. ఆయనకు ఓ హీరో లెవల్‌లో వెల్‌కమ్ పలుకుతారు. దీంతో నయాం తనని తాను హీరోగా ఊహించుకుంటాడు. జైల్లో ఇతర నక్సల్స్ తో గొడవ, తన అక్కపై మరో నక్సల్ అత్యాచారానికి పాల్పడటం, అతన్ని నయాం తమ్ముడు చంపేయడం, ఆ తర్వాత నక్సల్స్ పై అసహ్యం కల్గడం, దాన్ని ఆసరగా తీసుకుని పోలీసులు నయీంని తనకు కోవర్ట్ గా మార్చుకుని నక్సల్స్ ని మట్టు పెట్టడం చేస్తుంటాడు. ఈ క్రమం భువనగిరి నుంచి హైదరాబాద్‌కి వచ్చిన నయాం ఏం చేశాడు?, తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహానికి కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఇదొక రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ జీవిత కథ కావడంతో దీన్ని రెగ్యూలర్ సినిమాలా చూడలేం. ఎంటర్‌టైన్‌మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్, సినిమాటిక్ ఫార్మాట్‌ని పక్కన పెట్టి చూసినప్పుడు... నయాం అసలు నక్సల్ నుంచి పోలీస్ కోవర్ట్ గా మారడానికి దారి తీసిన అంశాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఎన్‌కౌంటర్ చేయడానికి కారణాలేంటి? ఓ వైపు నక్సల్స్, మరోవైపు పోలీసులు, ఇంకోవైపు రాజకీయ నాయకులు ఆయన్ని ఎలా వాడుకున్నారు, చివరికి నయీంని ఎలా బలిపశువుని చేశారనేది ఇందులో దర్శకుడు దాము బాలాజీ క్లారిటీ చూపించారు. అత్యంత వివాదాస్పద, సంచలనాత్మక గ్యాంగ్‌స్టర్ కథని అంతే బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడిని అభినందించాల్సిందే. నక్సల్స్ పై నయీంకి ద్వేషం పుట్టడానికి కారణాలేంటనేది ఇందులో క్లారిటీగా చూపించారు. తన తమ్ముడు కిరాణా కొట్టు పెట్టుకునేందుకు డబ్బులు అడగ్గా పార్టీ నాయకులు నో చెప్పడం, దీనికితోడు తన అక్కపై ఓ నక్సలైట్ అఘాయిత్యం చేస్తే జస్ట్ క్షమించమని చెప్పడం, ఆ నాయకుడిని తమ్ముడు చంపితే.. తనకి పార్టీ నుంచి బహిష్కరించడం వంటి కారణాలతో నక్సల్‌పై ద్వేషం పుట్టడం అనేది ఇందులో చూపించారు.
మావోయిస్టు అగ్రనేతలు వీరన్న, రవన్న, సోమన్న, మోహన్‌రెడ్డి, సాగరన్న, గణేష్, సాంబా శివుడి పాత్రలను, వారితో నయీంకి ఉన్న అనుబంధాన్ని, ఆ తర్వాత ద్వేషాన్ని, ఆ తర్వాత వారిని పక్కా స్కెచ్‌తో ఎన్‌కౌంటర్ చేయడం చూపించారు. మావోయిస్టులపై ఉన్న ద్వేషాన్ని క్యాష్ చేసుకుని పోలీసులు నయీంని తమకి కోవర్ట్ గా మలుచుకుని అడవుల్లో మావోలను మట్టు పెట్టడం, ఆ తర్వాత నయీంకి స్వేచ్చ ఇచ్చి వ్యాపారాలు చేయించడం, దందాలు, కబ్జాలు, దోచుకోవడాలు, సెటిల్మెంట్లు ఇలా అన్నింటిని టచ్ చేశారు దర్శకుడు. నయీం మాజీ నక్సలైట్ నుంచి రౌడీషీటర్‌గా, గ్యాంగ్‌స్టర్ గా ఎదగడానికి దోహదపడిన అంశాలను బోల్డ్ గా ఆవిష్కరించారు. అందుకు ఆయనకు పోలీస్ డిపార్ట్ మెంట్ ఏ రేంజ్‌లో అండగా నిలిచింది. ఆయన్ని అడ్డు పెట్టుకుని దాదాపు 20కిపైగా ఐపీఎస్, ఐఎఎస్ స్థాయి అధికారులు కోట్లకు కోట్లు సంపాదించడం, ఆయన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకుల సెటిల్మెంట్లని ఇందులో బాగా చూపించారు.
మరోవైపు అడవిలో నక్సల్స్ ఎలాంటి ప్లాన్స్ చేస్తారు, వారిలైఫ్ ఎలా ఉంటుందనేది ఇందులో టచ్ చేశారు. అప్పట్లో మావోయిస్టు పార్టీలకు కోట్ల రూపాయల ఫండ్ రావడం, దాన్ని వాళ్లు కొంత బంగారం రూపంలో ఇన్వెస్ట్ చేయడం వంటి కొత్త కోణాలను ఇందులో చూపించారు దర్శకుడు. అదే సమయంలో మావోయిస్టులు కూడా తమ కార్యక్రమాల కోసం జనం మధ్యలోనే ఉంటారనే విషయాన్ని కూడా ఇందులో చూపించారు. వారి లోపాలను సైతం ఇందులో టచ్ చేశారు దర్శకుడు. నయాం ఎంత క్రూరంగా చంపుతాడనేది కూడా క్లారిటీగా చూపించారు. నయీం.. తెలంగాణ ఉద్యమం చివరి సమయంలో తెలంగాణ ఉద్యమ నాయకుడిని బెదిరించడం, ఆ తర్వాత తెలంగాణ వచ్చాక ఆయన సీఎం అయిన తర్వాత కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులను బెదిరించడంతో, అది సీఎం దృష్టికి వెళ్లడం, నయీం తమకు పెద్ద తలనొప్పిగా మారాడనే విషయాన్ని గమనించి పెంచిపోషించిన పోలీసులతోనే నయీంని మట్టు పెట్టడం ఇందులో క్లారిటీగా చూపించారు. అయితే తనని చంపేయడానికి తెలంగాణ సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఆపరేషన్ స్టార్ట్ అయ్యిందని తెలిశాక నయీంలో వచ్చిన రియలైజేషన్, ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. పోలీస్ వైపా? నక్సల్ వైపా? అంటే తాను మావోయిస్టుల వైపే ఉంటానని, తనది ఉద్యమ రక్తం అని చెప్పడం కదిలిస్తుంది. క్లైమాక్స్ లో సన్నివేశాలు బరువెక్కించేలా ఉంటాయి.
ఆర్టిస్టులు, టెక్నీషియన్లుః
ఆర్టిస్టుల పరంగా నయీం పాత్రలో `కేజీఎఫ్` ఫేమ్ వశిష్ట సింహా అద్భుతంగా చేశాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇకపై నయీం అంటే వశిష్ట ఫేసే గుర్తుకొస్తుందని చెప్పొచ్చు. ఆవేశం, కోపం, రొమాన్స్, రియలైజేషన్ ఇలా అన్ని భావోద్వేగాలు చాలా బాగా పలికించారు. ఆయన అక్క పాత్రలో యజ్ఞాశెట్టి పాత్ర మేరకు బాగా చేసింది. ఆయన లవర్‌గా, మావోయిస్టు కోవర్ట్ గా లత పాత్రలో సంయుక్త హార్నాడ్, నయీం టీనేజ్ పాత్రలో నిఖిల్, గణేషన్న పాత్రలో దేవి ప్రసాద్, తన భార్య పాత్రలో బిగ్‌బాస్ దివి తమ పాత్రల మేరకు మెప్పించారు. టెక్నికల్‌గా దర్శకుడు దాము బాలాజీ నయీం కథని బాగానే ఆవిష్కరించారు. అయితే సీన్లు తక్కువగా ఉండి, ఎక్కువగా డైలాగులు ఉండటం కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. స్లో నెరేషన్ ఇబ్బంది పెట్టే అంశం. ఈ విషయంలో దర్శకుడు మరింత దృష్టిపెట్టాల్సింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీన్ల ఎలివేషన్ ఇంకా పెంచాల్సింది. ఆ విషయంలో లోటు కనిపిస్తుంది. అది బోరింగ్‌కి దారితీస్తుంది. విజువల్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్ లోపాటు చాలానే కనిపిస్తాయి.
ఫైనల్ థాట్‌ః
రెగ్యూలర్ సినిమాలా కాకుండా.. గ్యాంగ్‌స్టర్ నయీం స్టోరీగా చూస్తే నచ్చే సినిమా అవుతుంది.
నటీనటులు, టెక్నీషియన్లుః
వశిష్ట సింహా, దివి, బాహుబలి నిఖిల్, యజ్ఞాశెట్టి, సంయుక్తం హర్నాడ్, దేవి ప్రసాద్ తదితరులు.
నిర్మాతః సీఏ వరదరాజు(శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్)
దర్శకుడుః దాము బాలాజీ
కెమెరాః సురేష్ భార్గవ
సంగీతంః అరుణ్ ప్రభాకర్
ఎడిటింగ్‌ః కిషోర్ మద్దాలి