ఒకప్పుడు డైట్ అంటే కేవలం కఠినమైన నియమాలు అని, ఇష్టం లేని ఆహారాన్ని తినాల్సి వస్తుందని నయనతార భావించేవారట. కానీ, కాలక్రమేణా ఆమె ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. శరీరాన్ని ఇబ్బంది పెట్టే కఠినమైన ఉపవాసాలకు బదులుగా, శరీరానికి అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించడమే అసలైన డైట్ అని ఆమె నమ్ముతున్నారు. ఆమె తనకు నచ్చిన ఫుడ్ ను మితంగా తినడానికి ఇష్టపడుతుంది.
ఇంటి వంటకే తొలి ప్రాధాన్యం
షూటింగ్ ప్రదేశాల్లో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు రకరకాల ఆహారాలు అందుబాటులో ఉన్నప్పటికీ, నయనతార ఎల్లప్పుడూ ఇంట్లో వండిన సాదా సీదా భోజనాన్ని తినడానికే మొగ్గు చూపుతారు. షూటింగ్స్ కోసం వెళ్లేటప్పుడు కూడా ఇంటి నుంచే క్యారేజ్ తీసుకెళ్తుంటారు. ఇది జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఆమె తన రోజువారీ ఆహారంలో పండ్లు, తాజా కూరగాయలు, గుడ్లు , లీన్ మీట్ (మాంసం)లతో కూడిన సమతుల్య పోషకాహారాన్ని తీసుకుంటారు.