nayanthara
నటుడు ధనుష్ పై మరో వివాదం చెలరేగింది. ఈసారి చెలరేగిన వివాదం మరింత సంచలనంగా మారొచ్చు. ఎందుకంటే ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయింది ఎవరో కాదు లేడి సూపర్ స్టార్ నయనతార. నయనతార, ధనుష్ గతంలో కొన్ని చిత్రాల్లో నటించారు. ధనుష్ నిర్మాణంలో కూడా నయన్ నటించింది. తాజాగా నయనతార.. ధనుష్ పై దుమ్మెత్తి పోస్తూ, అతడి నిజస్వరూపం ఇదే అంటూ 3 పేజీల బహిరంగ లేఖతో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ లేఖలో ధనుష్ క్యారెక్టర్ ని తప్పు బడుతూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది.
అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది ? వివాదం ఏంటి ?
2015లో నయనతార ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ అనే చిత్రంలో నటించింది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయన్ జంటగా నటించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత కాలంలో నయన్, ధనుష్ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. రీసెంట్ గా నయనతార తన పెళ్లి, కెరీర్, లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే టైటిల్ తో డాక్యుమెంటరీ చిత్రాన్ని నవంబర్ 18న రిలీజ్ చేస్తారు. ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ నుంచి విభేదాలు మొదలయ్యాయి. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని పాటకి సంబంధించిన 3 సెకండ్ల వీడియో ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. తన అనుమతి లేకుండా ఆ వీడియో ఉపయోగించడం ధనుష్ కి నచ్చలేదు. నయనతారపై కోర్టులో ఏకంగా 10 కోట్ల కాపీ రైట్ కేసు నమోదు చేశాడు. కొన్ని రోజుల పాటు నయన్, ధనుష్ మధ్య ఈ వ్యవహారంలో చర్చలు జరిగినట్లు టాక్. రాజీ కుదరకపోవడంతో నయన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ధనుష్ పై ఏకంగా 3 పేజీల లేఖతో విరుచుకుపడింది.
నయనతార లేఖలో ఏముంది ?
నయనతార ఈ లేఖలో ధనుష్ ని ఉద్దేశిస్తూ.. చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు పొందావు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటం చేస్తూ నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా. నాపై నీకు గతం నుంచి పగ ఉందని తెలుసు. కానీ ఈ స్థాయిలో నీ నీచ బుద్ధిని బయటపెడతావని అనుకోలేదు. నాకు సంబంధించిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చిత్రం రిలీజ్ కోసం నా సన్నిహితులు, అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక చాలా మంది సాయం, కష్టం ఉంది.
నా సినీ జీవితానికి సంబంధించిన క్లిప్స్, అనేక విషయాలు ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచాం. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు కూడా ఉంటాయి. కానీ నా కెరీర్ లో కీలకమైన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని క్లిప్స్ ని మాత్రం ఉపయోగించలేకపోయాం. దీని గురించి నిన్ను ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసినా రిజెక్ట్ చేశావు. ఇది నా మనసుని బద్దలయ్యేలా చేసింది. బిజినెస్ లెక్కలు వేసుకుని, నా పై ఉన్న కక్షతో నువ్వు కేసు వేశావు. నానుమ్ రౌడీ దాన్ చిత్రానికి సంబంధించిన అన్ని క్లిప్స్ ని ఎడిటింగ్ లో తొలగించాం. నువ్వు అనుమతులు ఇవ్వలేదు కాబట్టి అలా చేయక తప్పలేదు. ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్ లో ప్రత్యేకం. నా డాక్యుమెంటరీకి ఆ పాటలు బాగా సరిపోతాయి. కానీ తొలగించక తప్పలేదు.
కేవలం షూటింగ్ మధ్యలో మొబైల్స్ లో తీసిన 3 సెకండ్ల క్లిప్ మాత్రం ఉపయోగించాం. అది కూడా BTS క్లిప్ మాత్రమే. మా మొబైల్స్ లో చిత్రీకరించిన క్లిప్ అది. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థం అవుతోంది. నీ అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థం అయింది. అభిమానుల ముందు ఒకలా నటిస్తూ లోపల నీ నీచ స్వభావాన్ని అలాగే ఉంచుకున్నావని మాకు తెలుసు. బయటకి ఒకలా, లోపల మరోలా ఉంటూ నీ అభిమానులని, ప్రపంచాన్ని మోసం చేస్తున్నావ్. పదేళ్ల క్రితం విడుదలైన చిత్రానికి సంబంధించిన 3 సెకండ్ల క్లిప్ వాడుకుంటే కేసు వేశావ్.. కనీసం మనసాక్షి అనేది కూడా లేదు. ప్రతిసారి నువ్వు నీ అహాన్ని బయటపెడుతూనే ఉన్నావ్.. నీ సాటి వ్యక్తులు ఎదిగితే జీర్ణించుకోలేని వ్యక్తిత్వం నీది.
ఈ ప్రపంచం చాలా పెద్దది. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తుల పట్ల ఓర్వలేని తనం చూపించకూడదు. జరిగిన వాస్తవాలని మార్చేసి నీ ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో కొత్త కథలు అల్లుతావని నాకు తెలుసు అంటూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది. నయనతార లేఖపై, ఆమె డాక్యుమెంటరీ వివాదంపై ధనుష్ ఎలాంటి సమాధానం ఇస్తాడు అనేది ఆసక్తిగా మారింది.