టాలీవుడ్ కింగ్ నాగార్జున స్పెషల్ పోస్ట్ చేశారు. ఆయనకు చాలా ప్రత్యేకమైన రోజు గురించి మరింత ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోజు తన జీవితంలో మర్చిపోలేని రెండు విషయాలు జరిగినట్టు ఆయన వెల్లడించారు. ఇంతకీ ఆ స్పెషల్ డేట్ ఏంటి?
టాలీవుడ్ 'కింగ్' నాగార్జున అక్కినేనికి మే 23వ తేదీ చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఆయన కెరీర్‌లో రెండు ముఖ్యమైన సంఘటనలు ఇదే రోజు జరిగాయి. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా 'విక్రమ్' విడుదలైంది మే 23నే. అలాగే, ఆయన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) చివరి సినిమా 'మనం' కూడా ఇదే రోజున థియేటర్లలోకి వచ్చింది. నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగార్జున సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా, ఆయన కొడుకు నాగ చైతన్య కూడా తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.
25
తనకు మొదటి సినిమా.. తండ్రికి చివరి సినిమా..
1986, మే 23న నాగార్జున హీరోగా పరిచయమైన 'విక్రమ్' సినిమా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన సినీ ప్రయాణం మొదలైంది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన నాగార్జున, ఆ తర్వాత 'శివ', 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా', 'అన్నమయ్య', 'మన్మథుడు', 'ఊపిరి' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. సరిగ్గా నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన అదే రోజున.. కొన్ని సంవత్సరాల తర్వాత, తన తండ్రి ఏఎన్ఆర్ చివరి సినిమా 'మనం'ను కూడా విడుదల చేశారు. ఈ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల కావడం నాగార్జునకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. ఈ ప్రత్యేకమైన రోజున నాగార్జున తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఎమోషనల్ లెటర్ రాశారు.
35
నాగార్జున ఎమోషనల్ పోస్ట్
నాగార్జున తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అభిమానులకు ఓ లేటర్ రాశారు. 'మనం' సినిమాను గుర్తుచేసుకుంటూ, 'మే 23 నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నా తండ్రి, లెజెండ్ ఏఎన్ఆర్ గారి చివరి చిత్రం 'మనం'ను నిర్మించి, విడుదల చేసే గౌరవం నాకు దక్కింది ఈరోజే. ఆ సినిమాలో మా నాన్న, నా కొడుకులతో కలిసి నటించే అదృష్టం కూడా కలిగింది' అని రాశారు.'
అలాగే, చాలా ఏళ్ల క్రితం ఇదే మే 23న నా మొదటి సినిమా 'విక్రమ్' కూడా విడుదలైంది. మిమ్మల్ని అందరినీ అలరించడానికి, మీ ప్రేమను, ఆశీర్వాదాలను పొందడానికి నాకు అవకాశం దొరికింది. ఇన్నేళ్లుగా నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి మరెన్నో మే 23లు వస్తాయని ఆశిస్తున్నాను' అని నాగార్జున అన్నారు.
55
నాగ చైతన్య అభినందనలు
సినిమా ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న తండ్రి నాగార్జునకు, ఆయన కొడుకు, నటుడు నాగ చైతన్య కూడా అభినందనలు తెలిపారు. 'విక్రమ్' సినిమా నుంచి ఇప్పటివరకు, మీరు వేసిన ప్రతి అడుగులోనూ ధైర్యం ఉంది. ఎన్నో కొత్త ట్రెండ్స్ సృష్టించారు. నాకు మాత్రమే కాదు, ఎంతోమంది నిర్మాతలకు, రాబోయే తరాలకు మీరే స్ఫూర్తి. థ్యాంక్యూ కింగ్ నాగార్జున' అని చైతన్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'క్లాసిక్ చిత్రం 'మనం'కు 12 ఏళ్లు. ఏఎన్ఆర్ గారు మనతోనే జీవించి ఉన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని. మే 23 ఎప్పటికీ ప్రత్యేకమైన రోజే' అని ఆయన రాసుకొచ్చారు.