
కింగ్ నాగార్జునకి సంబంధించి హీరోయిన్ల విషయంలో పలు రూమర్లు ఉన్నాయి. టబు విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు పెళ్లి వరకు వెళ్లారనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో జగపతిబాబు విషయంలోనూ ఇలాంటివే ఉన్నాయి. సౌందర్య విషయంలో ఆయన కూడా ఇలాంటి రూమర్స్ ని ఫేస్ చేశారు. అయితే ఈ ఇద్దరు ఆయా రిలేషన్లపై ఓపెన్ గానే స్పందించారు. మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మరోసారి నాగార్జునని ఇబ్బంది పెట్టాడు జగపతిబాబు. మన్మథుడు సైతం తక్కువేం కాదు, జగపతిబాబుని సౌందర్య విషయంలో ఇరకాటంలో పెట్టాడు. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే..
జగపతిబాబు మ్యాన్లీ హీరోగా రాణించారు. ఫ్యామిలీ కథలతో ఎక్కువగా సినిమాలు చేసి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హీరోగా క్రేజ్ తగ్గిన నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాడు. విలన్‌గా మారి రచ్చ చేశారు. ఇప్పుడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. పాజిటివ్, నెగటివ్ రోల్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నారు. హోస్ట్ గా మారారు. జీ తెలుగు కోసం ఓ ప్రత్యేకమైన షో చేస్తున్నారు. `జయమ్ము నిశ్చయమ్ము రా` పేరుతో కొత్త టాక్‌షోని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఇందులో `జయమ్ము నిశ్చయమ్ము రా` అవ్వాలంటే ఒక స్నేహితుడు కావాలి. నా స్నేహితుడు అక్కినేని నాగార్జున అంటూ జగపతిబాబు ఈ షోని స్టార్ట్ చేశారు. సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో ఇది అని జగపతిబాబు తనదైన స్టయిల్‌లో ఓపెన్‌గా చెప్పగా, ఓకే అలానే కానివ్వు అని నాగ్ రియాక్ట్ కావడం విశేషం. `షూటింగ్‌కి వెళ్లి ఉండడు, గోవాలో వేరే డేట్‌కి వెళ్లి ఉంటాడని చెప్పావంటా` అని జగపతిబాబు అడగ్గా, `గుర్తు పెట్టుకో నువ్వే దొరుకుతావ్` అని నాగ్ చెప్పడం విశేషం.
ఇంతలోనే నాగ్ బ్రదర్ వెంకట్, సిస్టర్ నాగసుశీల కూడా ఈ షోకి వచ్చారు. `నాగ్‌లో మొదటిసారి మన్మథుడు ఎప్పుడు కనిపించారు` అని జగపతిబాబు అడగ్గా, `నీకంటే తర్వాతే మన్మథుడు` అని వెంకట్ చెప్పడంతో `అది వేరే` అని తప్పించుకున్నారు జగపతిబాబు. ఇంతలో కత్తిలాంటి బాణం విసిరారు జగపతిబాబు. `రమ్యకృష్ణ, టబులో బెస్ట్ హీరోయిన్ ఎవరు` అని నాగార్జునని అడగ్గా, `కొన్ని చెప్పకూడదు, చెప్పను` అని సమాధానం దాటవేశారు నాగ్. అంతేకాదు రివర్స్ లో జగపతిబాబుకి ప్రశ్న వేశారు. `మీకు రమ్యకృష్ణ, సౌందర్యలో ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అని ఆయన్ని ఇరకాటంలో పెట్టగా, ఇది నా ఇంటర్వ్యూ కాదు, దీనికి నేను సమాధానం చెప్పను అని తప్పించుకున్నారు జగ్గుభాయ్.
అనంతరం `నేనేదో చిన్నా చితకా క్యారెక్టర్స్ చేసుకుంటూ బతికేస్తుంటే, నువ్వు మధ్యలో విలన్‌గా చేయడమేంటి? అదేంటో చెప్పు అసలు` అని జగపతిబాబు అడగ్గా, `ఒకడు పుట్టగానే ఎవడి చేతిలో పోతాడు అనేది వాడి తలమీద రాసిపెట్టి ఉంటుంది` అని `కూలీ` సినిమాలోని డైలాగ్ చెప్పి వాహ్ అనిపించారు నాగ్. ఇలా నాగ్ `జయమ్ము నిశ్చయమ్మురా` షో ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. చాలా ఆసక్తికరంగానూ అనిపించింది. ఈ టాక్ షో పూర్తి ఎపిసోడ్ ఆగస్ట్ 17(ఆదివారం) రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతుంది.
నాగార్జున ప్రస్తుతం `కూలీ` చిత్రంలో నటించారు. రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో నాగ్‌తోపాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో నాగ్ నెగటివ్ రోల్ చేయడం విశేషం. తన కెరీర్‌లోనే మొదటిసారి ఆయన విలన్ పాత్రని పోషించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందో మరో మూడు రోజుల్లో తేలనుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది.