Nagarjuna, Balakrishna
నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మధ్య గత కొన్నేళ్లుగా మాటల్లేవ్ అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అయితే వీరిద్దరి మధ్య విభేదాలకు కారణాలు తెలియవు. ఒకప్పుడు నాగార్జున, బాలయ్య ఇద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ హయాం నుంచి నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య స్నేహం ఉంది.
Nagarjuna and Balakrishna
ఎన్టీఆర్, ఏఎన్నార్ అనేక అద్భుతమైన చిత్రాల్లో కలసి నటించారు. మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, కృష్ణార్జున యుద్ధం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ క్లాసిక్ చిత్రాలుగా నిలిచిపోయాయి. ఓ ఇంటర్వ్యూలో నాగార్జునకి మల్టీస్టారర్స్ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. ఈ జనరేషన్ లో మీరు బాలయ్య కలసి ఎందుకు నటించడం లేదు అని అడిగారు.
jr ntr, naga chaitanya
నాగార్జున స్పందిస్తూ.. మేమిద్దరం మల్టీస్టారర్ చిత్రం చేయాలనీ నాతో పాటు బాలయ్యకి కూడా ఆలోచన ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బాలయ్య శ్రీరామరాజ్యం చిత్రంలో నటిస్తున్న సమయంలో నాకు ఒక సీడీ పంపించారు. అది అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలసి నటించిన క్లాసిక్ మూవీ చుప్ కే చుప్ కే. ఆ మూవీ చూశాను. చాలా బాగా నచ్చింది. మనిద్దరం ఈ మూవీలో నటిస్తే బావుంటుంది అని బాలయ్య నాతో అన్నారు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక కూర్చుని ఆ మూవీపై వర్క్ చేద్దాం అని అనుకున్నాం.
gundamma katha
ఇంతలో ఈ విషయం ఒక హీరోకి తెలిసింది. వెంటనే మధ్యలో దూరి చెడగొట్టాడు అంటూ నాగార్జున కామెంట్స్ చేశారు. ఆ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. నేను బాలయ్య మల్టీస్టారర్ చిత్రం కోసం ప్రయత్నిస్తున్నట్లు తారక్ కి తెలిసింది. దీనితో తారక్ నాకు ఫోన్ చేశాడు. నాగ చైతన్య, నేను గుండమ్మ కథ చిత్రం రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం బాబాయ్. ఇప్పుడు మీరిద్దరూ మల్టీస్టారర్ చిత్రం చేస్తే మా ప్లాన్ కుదరదు అని అడిగాడు. చుప్ కే చుప్ కే రీమేక్ ఆగిపోవడానికి తారక్, చైతన్య కూడా ఒక కారణం అని నాగార్జున అన్నారు.
Chupke chupke
పాపం గుండమ్మ కథ చిత్రాన్ని రీమేక్ చేయడం చాలా సులభం అని తారక్, చైతన్య అనుకుంటున్నారు. అది ఎలాంటి సినిమానో వాళ్ళకి తెలియదు. కాబట్టి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చినట్లు నాగార్జున పేర్కొన్నారు. కొంతమంది నాతో గుండమ్మ కథ రీమేక్ చేయమని చాలా ఏళ్ళ క్రితమే నాతో కొంతమంది చెప్పారు. ఆ క్లాసిక్ ని టచ్ చేయాలంటే నాకే భయం వేసి వెనక్కి వచ్చేశాను. ఇప్పుడు మాయాబజార్ చిత్రాన్ని రీమేక్ చేయమంటే చేయగలమా ? కొన్ని క్లాసిక్ చిత్రాలని అలాగే వదిలేయాలి అని నాగార్జున అన్నారు. అసలు గుండమ్మ కథ చిత్రంలో సూర్యకాంతం లాంటి నటి ఇప్పుడు ఎవరు దొరుకుతారు ? అని నాగార్జున ప్రశ్నించారు.