Motivational Song: ‘ఇంతే ఇంతింతే’.. ఇది పాట మాత్ర‌మే కాదు, జీవితాన్ని మార్చే ఆలోచన

Published : Sep 25, 2026, 05:35 PM IST

Motivational Song: కొన్ని పాటలు వింటే కాసేపు మనసుకు ఆనందం కలుగుతుంది. మరికొన్ని పాటలు విన్న తర్వాత మనలో ఏదో ఒక ఆలోచన మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బాలు’ సినిమాలోని ‘ఇంతే ఇంతింతే’ రెండో జాబితాలోకి వ‌స్తుంది.

PREV
15
ఆలోచించే కొద్దీ ప్రపంచం మరింత పెద్దదవుతుంది

వినడానికి వేగంగా సాగే మ్యూజిక్, ఎనర్జిటిక్ బీట్‌తో ఆకట్టుకునే ఈ పాటలోని ప్రతి లైన్‌ను జాగ్రత్తగా గమనిస్తే ఎంతో లోతైన జీవిత సందేశం కనిపిస్తుంది. ఈ పాటకు ప్రముఖ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. యువతలో ఆలోచన పెంచడంతో పాటు, జీవితాన్ని కొత్త కోణంలో చూడాలనే స్ఫూర్తిని కలిగించేలా పదాలను ఉపయోగించారు. మణిశర్మ అందించిన సంగీతం పాటకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అందుకే ఈ పాటను కేవలం మాస్ బీట్ ఉన్న పాటగా కాకుండా, జీవితాన్ని అర్థం చేసుకునేలా చేసే ప్రేరణాత్మక గీతంగా చూడొచ్చు.

‘ఇంతే ఇంతింతే.. ఆలోచిస్తే అంతా ఇంతింతే’ అనే మాటతోనే పాట అసలు ఉద్దేశం మొదలవుతుంది. మన కంటికి కనిపించేది మొత్తం ప్రపంచం కాదు. మనం చూసే పరిధి ఎంత ఉంటే మన ప్రపంచం కూడా అంతే ఉంటుంది. కానీ ఆలోచనకు హద్దులు పెట్టకుండా ముందుకు వెళ్తే మనకు ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తాయి. ‘కన్ను ఇంతే.. కనుపాప ఇంతే.. లోకం లోతు చూడాలంతే’ అంటూ మన చూపు పరిమితమైనదైనా, మన ఆలోచనలకు మాత్రం పరిమితి ఉండకూడదని పాట చెబుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. పైకి కనిపించేదాన్ని మాత్రమే నమ్మకుండా, దాని వెనుక ఉన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

25
కనిపించేది మాత్రమే నిజం కాదు.. ముందే పసిగట్టాలి

‘మొగ్గల్లోన దాగుంది కాయో పండో కనిపెట్టాలి ముందే.. మబ్బులోన దాగుంది చినుకో తుఫానో పసిగట్టాలి ముందే’ అనే భావం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మొక్కలో ఉన్న మొగ్గను చూసి అది రేపు ఎలా మారుతుందో ఊహించగలగాలి. మబ్బులను చూసి అవి వర్షాన్ని తెస్తాయా, తుపానుకు సంకేతమా అనేది అర్థం చేసుకునే దృష్టి ఉండాలి.

ఇది కేవలం ప్రకృతి గురించి చెప్పిన మాట కాదు. మన జీవితంలో కూడా భవిష్యత్తును ముందే అంచనా వేసే సామర్థ్యం అవసరం. ఒక చిన్న సమస్య పెద్ద సమస్యగా మారకముందే గుర్తించాలి. చిన్న అవకాశాన్ని కూడా ముందుగానే అందిపుచ్చుకోవాలి. అలాగే మనుషుల విషయంలోనూ పైకి కనిపించే మాటలు, రూపాన్ని బట్టి నిర్ణయం తీసుకోకూడదని పాట సూచిస్తుంది. ‘మనుషుల్లో మంచోడెవరో.. ముంచేదెవరో.. మనసెట్టి చూడాలంతే’ అనే భావం ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడుతుంది. మనిషిని అర్థం చేసుకోవాలంటే అతని మాటల కంటే మనసును, పనులను గమనించాలి.

35
బయట ఉన్న విలువను మాత్రమే కాదు.. మనలోని శక్తిని కూడా చూడాలి

‘మట్టిలోని వజ్రం చూడు.. బొగ్గులోని అగ్గిని చూడు.. అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు’ అనే భావం పాటలో అత్యంత స్ఫూర్తినిచ్చే భాగాల్లో ఒకటి. మట్టిలో వజ్రం దాగి ఉంటుంది. బొగ్గులో అగ్ని దాగి ఉంటుంది. అలాగే సాధారణంగా కనిపించే మనిషిలో కూడా అసాధారణమైన ప్రతిభ దాగి ఉండొచ్చు. ఆ ప్రతిభను బయటకు తీసుకురావాల్సింది మనమే. తనపై నమ్మకం పెంచుకుని, తనలోని బలాన్ని గుర్తించిన వ్యక్తికి అవకాశాలు తక్కువైనా ముందుకు వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి మనకంటే ఈరోజు మనం మెరుగ్గా ఉన్నామా అని ఆలోచించడం ముఖ్యం. ‘నీలోని నిన్నే చూడు’ అన్న ప‌దంలో ఎంతో అర్థం దాగి ఉంది.

45
లక్ష్యం కోసం కష్టపడితే విజయానికి దారులు తెరుచుకుంటాయి

‘అలా చూస్తే ఎదురే లేదంతే.. ఇలా చేస్తే తిరుగే లేదంతే’ అంటూ పాట మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉండి, దాన్ని సాధించడానికి కష్టపడితే అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకూడదనే సందేశం ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ పాట చెప్పే విషయం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోవడం కాదు. మన ప్రయత్నం, పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఫలితాలు మన వెంట వస్తాయని చెప్పడం. ‘తొమ్మిది గ్రహాలన్నీ పనులే మాని తిరుగును నీ చుట్టే’ అనే పద ప్రయోగం కూడా ఇదే భావాన్ని ఉత్సాహంగా చెబుతుంది. అంటే మన జీవితాన్ని మార్చేది బయట నుంచి వచ్చే అద్భుతం కంటే మనలోని ప్రయత్నమే.

55
మంచి మనిషిగా ఎదగడమే అసలైన విజయం

పాట చివరి భాగం మనిషి ఎలా ఉండాలో మరింత గొప్పగా చెబుతుంది. పేదవాడికి స్నేహితుడిగా ఉండే గుణం కావాలి. ప్రేమించే వ్యక్తి పట్ల నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఉండాలి. దేశాన్ని కాపాడే సైనికుడిలా బాధ్యత ఉండాలి. తన పనిలో శ్రామికుడిలా కష్టపడాలి. నావికుడిలా ముందుకు సాగాలి. ఇక్కడ విజయానికి కేవలం డబ్బు, పేరు, హోదాను కొలమానంగా తీసుకోలేదు. మంచి మనసు, కష్టం చేసే గుణం, బాధ్యత, ధైర్యం, ఇతరులకు ఉపయోగపడే స్వభావం ఉన్నప్పుడే మనిషి నిజమైన విజయాన్ని సాధించినట్టని పాట చెబుతుంది. అందుకే ‘జనం మెచ్చే నాయకుడవుతావు.. జగం మెచ్చే ఉత్తముడవుతావు’ అనే భావం వస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని గౌరవించేలా జీవించడం, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగడం గొప్ప విషయం. చివరికి మనిషిగా పుట్టినందుకు అర్థం ఉండేలా జీవించాలనే సందేశంతో పాట ముగుస్తుంది.

ఇంత‌టి అర్థం ఉంది కాబ‌ట్టే ఈ పాట విడుదలై ఏళ్లు గుడుస్తోన్నా యువతకు స్ఫూర్తినిచ్చే సాహిత్యంగా గుర్తుండిపోయింది. చంద్రబోస్ పదాలకు మణిశర్మ సంగీతం తోడవడంతో ఈ పాటకు ప్రత్యేకమైన ఎనర్జీ వచ్చింది. వినేటప్పుడు మనల్ని ఉత్సాహపరిచే పాటగా మొదలై, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే పాటగా ‘ఇంతే ఇంతింతే’ నిలిచిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories