Mohan Babu
మోహన్ బాబు గతంలో విలన్ గా అనేక చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో కూడా మోహన్ బాబు విలన్ గా కనిపించారు. చిరంజీవి, మోహన్ బాబు కాంబినేషన్ అప్పట్లో చాలా బాగుండేది. ఆ తర్వాత మోహన్ బాబు కూడా హీరో అయ్యారు. హీరో అయ్యాక మోహన్ బాబు విలన్ పాత్రలు తగ్గించారు. అయితే మంచు ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తరచుగా వార్ జరుగుతూనే ఉంది.
దీనిపై మోహన్ బాబు తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణు హీరోగా కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 140 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇంటర్వ్యూలో మోహన్ బాబు మెగా ఫ్యామిలీతో విభేదాలు, ట్రోలింగ్ గురించి ఓపెన్ అయ్యారు. చిరంజీవి, మోహన్ బాబు, సినిమాల వరకు మాత్రమే కాంపిటీటర్స్ అని ఫ్యాన్స్ ఎందుకు భావించడం లేదు ? ఎందుకు అంతలా ట్రోలింగ్ చేసుకుంటున్నారు అని యాంకర్ ప్రశ్నించింది.
మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను సాధారణంగా ట్రోలింగ్ గురించి పట్టించుకోను. ఏదైనా విషయం నా దాకా వస్తే వాళ్ళ కర్మ అని వదిలేస్తాను. కానీ ఇండస్ట్రీలో వ్యక్తిగా.. ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు.. ఆ మూవీ హిట్టా ఫ్లాపా అని తెలుసుకుంటాను. ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది అని ఆరా తీస్తాను. ఇండస్ట్రీ వ్యక్తిగా మంచి చెడ్డలు తెలుసుకోవడం ముఖ్యం. అంతే తప్ప ఫలానా హీరో చెడిపోవాలని నేను కోరుకోను. అలా కోరుకుంటే ముందుగా తానే చెడిపోతాను అని మోహన్ బాబు అన్నారు.
కానీ ట్రోలింగ్ వల్ల అభిమానులు ఎలాంటి అనుభూతి చెందుతున్నారో అర్థం కావడం లేదు. ఆ క్షణానికి వాళ్ళకి అది సంతోషాన్ని ఇస్తోంది. కానీ దానివల్ల జరిగే నష్టం గురించి వాళ్ళకి తెలియడం లేదు అని మోహన్ బాబు అన్నారు.
నేను ఎవరినీ విమర్శించను. వాళ్ళకి భయపడి సైలెంట్ గా కూడా ఉండను. వాళ్ళు ఎంత శక్తివంతులు అయినా భయపడే నైజం తనది కాదని మోహన్ బాబు అన్నారు.