
తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు గోల్డెన్ ఎరని చూస్తోంది. భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఇండియన్ సినిమాకి ప్రతిబింబంగా నిలుస్తోంది. ఏ భాషలోనూ లేని విధంగా అత్యధిక బడ్జెట్ చిత్రాలు మన వద్దనే రూపొందుతున్నాయి. అయితే ఇలాంటి భారీ సినిమాలు తెలుగు సినిమా ప్రారంభంలోనూ వచ్చాయి. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలున్నాయి. వాటిలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన మూవీ `మిస్సమ్మ`. ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఈ చిత్రం విడుదలై 70ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో `మిస్సమ్మ` మూవీ ఎలాంటి సంచనాలు సృష్టించింది? తెరవెనుక ఏం జరిగింది? ఎవరి జీవితాలను మార్చేసింది? ముఖ్యంగా సావిత్రి లైఫ్‌ని మార్చడంలో ఎలాంటి పాత్ర పోషించిందనేది తెలుసుకుందాం.
`మిస్సమ్మ` మూవీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు రేలంగి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, రుష్వేంద్రమణి కీలక పాత్రల్లో మెరిశారు. అప్పట్లో పౌరాణిక, జానపద చిత్రాల జోరు సాగుతుంది. వరుసగా అలాంటి చిత్రాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో వచ్చిన సోషల్ కామెడీ డ్రామానే `మిస్సమ్మ`. దీనికి ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించగా, విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి సంయుక్తంగా నిర్మించారు. 1955 జనవరి 12 ఈ మూవీ విడుదలైంది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
యొతిష్ బెనర్జీ అనే బెంగాలీ రైటర్ రాసిన మన్మొయీ గర్ల్స్ స్కూల్ అనే రచన ఆధారంగా చక్రపాణి, పింగళి నాగేంద్రరావు సినిమా కథగా రచించగా, దర్శకుడు ఎస్వీ ప్రసాద్ దీన్ని మంచి రొమాంటిక్ కామెడీ డ్రామాగా మలిచారు. అయితే ఈ సినిమాలో మొదట అనుకున్న కాస్టింగ్ వేరు. ఎమ్టీ రావు పాత్రకి ఎన్టీఆర్‌ని అనుకున్నారు. సావిత్రి నటించిన మేరీ పాత్రకి మొదట భానుమతిని తీసుకున్నారు. కొంత కాలం షూటింగ్ కూడా చేశారు. కానీ ఓ రోజు వరలక్ష్మీ వ్రతం అని చెప్పి భానుమతి షూటింగ్‌కి లేట్‌గా వస్తే, నిర్మాతలు ఫైర్ అయ్యారు. తన ఆలస్యాన్ని అసిస్టెంట్‌కి చెప్పినా, అతను నిర్మాతలకు చెప్పలేదు. దీంతో భానుమతిపై ఫైర్ అయ్యారు. దెబ్బకి భానుమతి కూడా రెచ్చిపోయింది. ఇది కాస్తా ఈగో క్లాష్‌కి దారి తీసింది. అంతిమంగా భానుమతి తన పాత్రని పోగొట్టుకోవాల్సి వచ్చింది. రెండో పాత్రకి సావిత్రిని అనుకున్నారు. భానుమతి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సావిత్రిని మేరి పాత్రలో నటింప చేశారు. సీత పాత్రకి జమునని తీసుకున్నారు. అలా భానుమతి వల్ల సావిత్రి, జమున జీవితాలు మారిపోయాయి.
ఏఎన్నార్ పోషించిన డిటెక్టీవ్ రాజు పాత్రకి వేరే నటులను అనుకున్నారు. మొదట జగ్గయ్యని సంప్రదించారు. ఆయన ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు. కానీ సెట్ కాలేదు. ఆయన తప్పుకోవడంతో చాలా మంది ఆర్టిస్ట్ లను అనుకున్నారు. ఈ పాత్ర కోసం చాలా కాలమే అన్వేషణ జరిగింది. ఎవరూ సెట్ కావడం లేదు. దీంతో ఏఎన్నార్‌కి ఈ విషయం తెలిసి ఆయనే టీమ్‌ని సంప్రదించారు. అప్పటికే ఏఎన్నార్ `దేవదాస్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆయన కెరీరే మారిపోయింది. అయితే వరుసగా సీరియస్ రోల్స్, సాడ్ రోల్స్ వస్తుండటంతో ఛేంజోవర్ కోసం ఈ మూవీ చేయాలనుకున్నారు అక్కినేని. తనే పట్టుబట్టి చేశారు. అక్కినేని చేస్తానంటే వద్దంటారా? ఎల్వీ ప్రసాద్, చక్రపాణి, నాగిరెడ్డి ఇలా అంతా హ్యాపీ. ఇలా భారీ తారాగణంతో `మిస్సమ్మ` రూపొందింది. ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ `అందాల రాక్షసి`. కానీ ఆ తర్వాత `మిస్సమ్మగా` మార్చారు. చూడ్డానికి సోషల్ డ్రామా అయినా కాస్టింగ్ పెద్దగా ఉంది. వర్కౌట్ అవుతుందా అనే డౌట్ కూడా మేకర్స్ లో ఉంది. కానీ ఆ మేకర్స్ అంచనాలను తలకిందులు చేసింది `మిస్సమ్మ`.
సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ ఒక రొమాంటిక్ కామెడీ డ్రామాగా చెప్పొచ్చు. శ్రీనువైట్ల లాంటి చాలా మంది దర్శకులు ఇలాంటి డ్రామాను పట్టుకుని బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. కానీ 1955లోనే డ్రామా ఏంటో చూపించిన చిత్రం `మిస్సమ్మ`. అప్పాపురంలో జమిందారు గోపాలం(ఎస్వీఆర్) పెద్ద కూతురు మహాలక్ష్మి నాలుగో ఏటన తప్పిపోతుంది. కాకినాడ బీచ్ సమీపంలో తిరునాళ్లలో మిస్ అవుతుంది. అప్పట్నుంచి దాదాపు 16ఏళ్లుగా ఆమె కోసం వెతుకుతూనే ఉంటారు. బాధపడుతూనే ఉంటారు. ఆమె గుర్తుగా మహాలక్ష్మి పేరుతోనే ఎలిమెంటరీ స్కూల్‌ని స్టార్ట్ చేసి ఉచితంగా చదువు చెప్పిస్తారు. స్కూల్‌లో జమిందార్ మేనల్లుడు రాజు(ఏఎన్నార్) పంతులుగా చేస్తుంటారు. ఆయనకు డిటెక్టివ్ పనులంటే ఇష్టం. పిల్లలకు చదువు చెప్పమంటే డిటెక్టివ్ పనులు చేస్తుంటారు.
మరో పంతులు(అల్లు రామలింగయ్య) ఆయుర్వేద వైద్యుడు. పిల్లలకు చదువు చెప్పకుండా తన మందులు తయారు చేయిస్తుంటాడు. వీరి వాలకం చూసి ఇలా అయితే స్కూల్ బాగుపడదు, పిల్లలు చదువుకోలేరు అని భావించిన జమిందార్ కొత్త టీచర్లకి ప్రకటన ఇస్తారు. అలాగే తన చిన్న కూతురు సీత(జమున)కి సంగీతం నేర్పించడానికి కూడా టీచర్ అవసరం ఉన్న నేపథ్యంలో సంగీతం తెలిసిన బీఏ చదివిన పెళ్లైన జంట కావాలని ప్రకటన ఇస్తారు. కట్ చేస్తే ఎమ్టీ రావు పట్నంలో బీఏ చదివి ఉద్యోగం కోసం తిరుగుతుంటాడు. అలాగే మేరీ కూడా ఉద్యోగం కోసం వెతుకుతుంటుంది. వీరిద్దరు పేపర్ ప్రకటన చూస్తారు. కానీ పెళ్లైన జంట కావాలని భావించి నిట్టూరస్తారు. అంతలోనే రావు అదిరిపోయే ఉపాయం ఆలోచిస్తాడు. తామిద్దరం భార్యభర్తలుగా యాక్ట్ చేసి ఈ ఉద్యోగంలో చేరదామని చెబుతాడు. ఇది విన్న మేరి రావుని చెడామడా తిట్టేసి వెళ్లిపోతుంది. కానీ మేరీకి జాబ్ చాలా ముఖ్యం. తమకు అప్పు ఇచ్చిన డేవిడ్ తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుంటాడు. అతని మొహాన డబ్బు కొట్టాలని కసితో ఉంటుంది.
దీంతో రావు ప్రపోజల్ నచ్చి పేరెంట్స్ ని ఒప్పించి ఈ ఉద్యోగానికి రెడీ అవుతుంది. అప్పాపురం వెళ్లి రావు, మేరి భార్యభర్తలుగా పరిచయం చేసుకుంటారు. ఉద్యోగంలో చేరతారు. తన పేరుని మహాలక్ష్మిగా మార్చుకుంటుంది మేరి. ఈ జంటని చూసి జమిందారు, ఆయన భార్య ఎంతో ముచ్చటపడతారు. మేరి తన కూతురులాగే ఉందని భావిస్తారు. రావుని అల్లుడిగా పిలుస్తుంటారు. చాలా ప్రేమని చూపిస్తారు. అతి ప్రేమ వల్ల మేరి ఇబ్బంది పడుతుంది. దీని వల్ల రావు నలిగిపోతుంటాడు. ఈ క్రమంలో ఒకరినొకరు ప్రేమలో పడతారు. కానీ బయటకు బెట్టు చేస్తుంటారు. జమీందార్ల అత్యుత్సాహం కారణంగా మేరి ఇబ్బంది పడి ఇంటికి వెళ్లిపోవాలనుకుంటుంది. అంతలోనే డేవిడ్ అక్కడికి వస్తాడు. మరోవైపు రాజు.. మహాలక్ష్మి ఎవరు అనేది కనిపెట్టే పనిలో ఉంటారు. అందుకు డేవిడ్ ఉపయోగపడతాడు. చివరికి తప్పిపోయిన తమ మహాలక్ష్మినే మేరి అని తెలియడంతో కథ సుఖాంతం అవుతుంది.
సినిమా ఆద్యంతం కామెడీ డ్రామాగా సాగుతుంది. ఆరోగ్యకరమైన హాస్యం సినిమాని నడిపిస్తుంది. అలకలు, బెట్టుచేయడాలు, రావు పాత్ర ఎత్తులు, రాజు పాత్ర డిటెక్టీవ్ పనులు నవ్వులు పూయిస్తారు. వీరికితోడు రావు, మేరీలతో వచ్చిన దేవయ్య(రేలంగి) డబ్బులు లాగే పనులు, ముఖ్యంగా రాజుకి నిజాలు చెబుతా అంటూ డబ్బులు లాగే తీరు నవ్వులు పూయిస్తుంది. మరోవైపు రావు, మేరీల గొడవలు కామెడీగా ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా సైతం అలరిస్తుంది. ఇక జమీందార్ వద్ద వీరిద్దరు ఆడే నాటకం ఆద్యంతం నటకీయంగా ఉంటుంది. సీరియస్ ఇన్నోసెంట్‌గా ఏఎన్నార్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమాలో ఎన్టీఆర్, సావిత్రిల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరి పాత్ర తక్కువ కాదు. అందరికి ప్రయారిటీ ఉంటుంది. ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది. నిజ జీవితానికి అందం పడుతుంది. వారు కూడా అంతే బాగా చేశారు. అలరించారు. సినిమా కథ, కథనం చాలా నీట్‌గా ఉంటుంది. ఎక్కడ డివియేట్ కాకుండా ప్రారంభం సీన్ నుంచి ఎంగేజ్ చేస్తుంది.
ఇప్పుడు మనకు కొంత స్లోగా అనిపిస్తుంది. విజువల్స్ కూడా మామూలుగానే అనిపిస్తాయి. ఇప్పుడొస్తున్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ అప్పటి ఆడియెన్స్ కి ది బెస్ట్ మూవీని అందించారని చెప్పొచ్చు. అప్పట్లోనే చదువు విలువ గురించి, అలాగే నిరుద్యోగం గురించి చర్చించిన తీరు బాగుంది. మరోవైపు మహిళా సాధికారతకు పెద్ద పీఠ వేసిన విషయం అభినందనీయం. ఈ సినిమాకి డైలాగ్‌లు పెద్ద అసెట్ అయితే పాటలు బిగ్గెస్ట్ అసెట్. చక్రపాణి కలంలోనే మ్యాజిక్ ఉంది. హాస్య సన్నివేశాలను, డ్రామాని అద్భుతంగా రాశారు. పింగళి రాసిన పాటల విషయానికి వస్తే `ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే`, `బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే`, `రావోయి చందమామ మా వింత గాథ వినుమా`, `రాగసుధారస పానముజేసి` పాటలకి ఇప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. పి సుశీల, ఏఎం రాజా, పి లీలా పాడారు. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ సినిమాని చాలా బాగా తెరెక్కించారు. ఆద్యంతం రక్తికట్టించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
1955, జనవరి 12న విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. అప్పుడు వచ్చిన అన్ని సినిమాలను బోల్తా కొట్టించింది. 13సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది. ఇందులో అక్కినేని అసిస్టెంటుగా పాత్రలో నటించిన బాలకృష్ణకు ఒక్క డైలాగు ఉండదు. ఈ సినిమా తమిళ వెర్షన్ 'మిసియమ్మ'లో ఎన్టీఆర్ పాత్రను జెమిని గణేశ్ పోషించగా, సావిత్రి పాత్రను సావిత్రినే చేయగా, అక్కినేని పాత్రను తంగవేలు పోషించారు. బాలకృష్ణ పాత్రను కరుణానిధి పోషించారు. ఈ సినిమాని మొత్తం మూడు భాషల్లో తెరకెక్కిస్తే మూడు భాషల్లో ( తెలుగు, హిందీ, తమిళ్ ) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సావిత్రి జీవితాన్నే మార్చేసింది. ఆమె `దేవదాస్`తో పెద్ద విజయం అందుకున్నా, ఈ సినిమా కమర్షియల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా, ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో సావిత్రి కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఫుల్ బిజీ అయ్యింది. ఫైనల్‌గా.. తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా, సినీ అభిమాని తప్పకుండా చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచే సినిమా `మిస్సమ్మ` అవుతుందని చెప్పొచ్చు.