
సూపర్ మెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా ఘనవిజయం సాధించింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే మిరాయ్ పాజిటివ్ టాక్ తో దూసుకవెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. దీంతో ఈ మూవీలో వర్క్ చేసిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ప్రధానంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన తదుపరి ప్రాజెక్ట్‌గా ఏం చేస్తారో అన్న ఉత్కంఠలో ఉన్న ఫ్యాన్స్ కు ఎవరు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ ఆ మ్యాటరేంటీ?
అనంతపురానికి చెందిన కార్తీక్, కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సినిమాల పట్ల ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పుణే FTIIలో చేరాలనుకున్నా సాధ్యం కాలేదు. అనంతరం రాజీవ్ మీనన్ మైండ్ స్క్రీన్ ఇన్‌స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సు చేశారు. అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్ జర్నీ స్టార్ చేశారు.
ఈ సమయంలో ఆయన తీసిన ‘ఇన్ఫినిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ తరువాత 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కెమెరామెన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తరువాత కార్తికేయ, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమమ్, నిన్నుకోరి, కృష్ణార్జున యుద్ధం, చిత్రలహరి వంటి సక్సెస్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశారు.
టాలీవుడ్‌లో అద్భుతమైన టెక్నీషియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ ఘట్టమనేని, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూర్య Vs సూర్య, ఈగిల్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, విజువల్ ప్రెజెంటేషన్‌కి మాత్రం మంచి పేరు తెచ్చారు. తాజాగా విడుదలైన మిరాయ్ సినిమాతో కార్తీక్ ఘట్టమనేని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. విజువల్ గ్రాండియర్, టెక్నికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో ఆయనపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మిరాయ్ తో కార్తీక్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే స్కిల్ ఉన్న డైరెక్టర్, టెక్నీషియన్‌గా నిలిచిపోయారు.
తాజాగా మిరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి కొత్త సినిమాలో తాను కెమెరా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. “కథ ఇంకా వినలేదు. కానీ చిరంజీవి సినిమా చేయడానికి అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? రెండు పడవలపై ప్రయాణం కాదు, ఇది ప్రత్యేక అవకాశం కాబట్టి అంగీకరించాను” అని కార్తీక్ తెలిపారు. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టిన చిరు-బాబీ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి రిపీట్ అవ్వడం విశేషం.
మిరాయ్ లాంటి సక్సెస్ అందుకున్న తరువాత దర్శకుడిగా కొత్త సినిమా ప్రకటించకుండా, కార్తీక్ తన నెక్స్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చే చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేయబోతున్నట్లు వెల్లడించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే.. ఇప్పటి వరకు కార్తీక్ ఘట్టమనేని టాప్ హీరోల సినిమాలకు సినిమాటోగ్రఫీ చేయలేదు. ఈ ప్రాజెక్ట్‌తో ఆయన కెరీర్‌లో మెగా బ్రేక్ రాబోతోంది. చిరంజీవితో పనిచేయడం ఏ సినిమాటోగ్రాఫర్‌కైనా ఒక కలలాంటిది. కార్తీక్‌కి అది నిజమవ్వబోతోంది. అంతేకాదు, చిరంజీవి ఆయన పనితో ఇంప్రెస్ అయితే, భవిష్యత్తులో మెగా కుటుంబ హీరోతో డైరెక్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చని ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, బాబీ-చిరు మూవీని ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా దసరా రోజున సెట్స్ మీదకు వెళ్లనుంది. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ వస్తున్న ఈ కాంబినేషన్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా చేరడం ఆ క్రేజ్‌ను మరింత పెంచింది.